Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ


రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ 

Advertisement
CJ Advs

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నటీనటులు: సుధీర్‌బాబు, నందిత, పోసాని, గిరిబాబు,

ప్రగతి తదితరులు

సినిమాటోగ్రఫీ: కె.ఎస్‌.చంద్రశేఖర్‌

సంగీతం: హరి

ఎడిటింగ్‌: రమేష్‌ కొల్లూరి

మాటలు: ఖదీర్‌బాబు

నిర్మాత: లగడపాటి శిరీషా శ్రీధర్‌

రచన, దర్శకత్వం: ఆర్‌.చంద్రు

విడుదల తేదీ: 19.06.2015

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎవడిగోల వాడిది చిత్రం చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన లగడపాటి శిరీష, శ్రీధర్‌ ఆ తర్వాత వారి బేనర్‌లో చేసిన స్టైల్‌ చిత్రం తప్ప కమర్షియల్‌ సక్సెస్‌లు తక్కువ. ఇప్పుడు లేటెస్ట్‌గా కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ‘చార్మినార్‌’ చిత్రాన్ని ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్‌.చంద్రు తెలుగు చిత్రాన్ని కూడా డైరెక్ట్‌ చేశాడు. సినిమాటోగ్రాఫర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా కన్నడ సినిమాకి వర్క్‌ చేసినవారే. సుధీర్‌బాబు, నందిత జంటగా రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో చక్కని ప్రేమకథా చిత్రంగా అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా కమర్షియల్‌గా కూడా ఘనవిజయం సాధించింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది? డైరెక్టర్‌ చంద్రు తెలుగులో కూడా ఈ సినిమాని సూపర్‌హిట్‌ అయ్యే రేంజ్‌లో రూపొందించాడా? లగడపాటి శ్రీధర్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించింది? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ: అది కృష్ణా నది ఒడ్డున కృష్ణాపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊరిలో పుట్టి పెరిగిన కృష్ణ(సుధీర్‌బాబు) ఇంజనీరింగ్‌ చదివి అమెరికాలో సెటిల్‌ అవుతాడు. అతని చిన్నప్పటి ఫ్రెండ్స్‌ మాత్రం చదువు అబ్బక తలో పని చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తుంటారు. ఓరోజు పేపర్‌లో కృష్ణ ఫోటో చూసిన అతని ఫ్రెండ్స్‌కి ఒక ఆలోచన వస్తుంది. తమతోపాటు చదువుకున్న వారందరినీ ఒకచోట చేర్చి ఒక ఫంక్షన్‌ చేయాలని అనుకుంటారు. అందులో భాగంగానే అమెరికాలో వున్న కృష్ణకి ఫోన్‌ చేస్తారు. అతను తప్పకుండా వస్తానని చెప్తూ తమతో కలిసి చదువుకున్న రాధకి కూడా చెప్పారా? అని అడుగుతాడు. తన స్నేహితులు చెప్పిన డేట్‌కి ఇండియా వస్తాడు కృష్ణ. ఎయిర్‌పోర్ట్‌ నుంచి కారులో వస్తున్న కృష్ణ తన గత జ్ఞాపకాలలోకి వెళ్తాడు. తనని చదివించడం తండ్రికి ఇష్టం లేదు. గొర్రెలు కాసుకుంటూ వుండమని చెప్తుంటాడు. ఆ టైమ్‌లో తమ స్కూల్‌లో, తమ క్లాస్‌లో రాధ అనే అమ్మాయి చేరుతుంది. రాధ అంటే ఎందుకో కృష్ణకి ఇష్టం ఏర్పడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె మీద ఇష్టం మరింత పెరుగుతుంది. ఇంటర్‌ వరకు కలిసి చదువుకుంటారు. చదువంటే ఇంట్రెస్ట్‌ లేని కృష్ణ... రాధ పరిచయం వల్ల, ఆమె ఇన్‌స్పిరేషన్‌ వల్ల ఇంటర్‌ వరకు వస్తాడు. రాధ అంటే ఇష్టమని చెప్పే ధైర్యం ఏరోజూ చెయ్యని కృష్ణ ఓరోజు ధైర్యం చేసి ఒక లవ్‌లెటర్‌ రాసి ఆమెకు అందేలా ప్లాన్‌ చేస్తాడు. కానీ, అది రాధ తల్లికి, ఆమె నుంచి కాలేజ్‌ ప్రిన్సిపాల్‌(పోసాని)కి చేరుతుంది. రాధకి కృష్ణ మీద ప్రేమ వుందా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు కృష్ణను చాటుగా వుండమని రాధని అడుగుతాడు. సి.ఎ. చెయ్యడం తన జీవితాశయమని, తనకి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ తప్ప మరేదీ తెలీదని చెప్తుంది. అప్పుడు కృష్ణని జీవితం అంటే ఏమిటి అనే విషయంలో ఎడ్యుకేట్‌ చేస్తాడు. ఆ తర్వాత రాధకు దూరమవుతాడు కృష్ణ. రాధకు దూరమవ్వాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మళ్ళీ రాధకు తన ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేశాడా? రాధ నిజంగానే కృష్ణని ప్రేమించలేదా? ఆ తర్వాత కృష్ణ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి? రాధ తను అనుకున్నట్టు సి.ఎ. చేసిందా? చివరికి కృష్ణ ప్రేమ ఫలించిందా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఒక సాధారణ కుటుంబంలో పుట్టి గవర్నమెంట్‌ స్కూల్‌లో చదువుకొని, ఆ తర్వాత ఇంటర్‌, ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థిగా, చిన్నప్పటి నుంచి రాధను ప్రేమించే కృష్ణగా సుధీర్‌బాబు పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కని నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎంతో మెచ్యూరిటీగా కనిపించాడు. తను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పలేని అసహాయ స్థితిలో వున్న యువకుడిగా తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాడు. రాధగా నందిత ఒక కొత్త క్యారెక్టర్‌లో కనిపించింది. పల్లెటూరి అమ్మాయిగా, తనను ఇష్టపడే అబ్బాయికి ఇన్‌స్పిరేషన్‌గా, తన చిన్ననాటి స్నేహితుడికి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పే అమ్మాయిగా చక్కని నటన కనబరిచింది. తల్లిని అమితంగా ప్రేమించే అమ్మాయిగా, తల్లి కోసం, చెల్లెలి కోసం ప్రేమను సైతం త్యాగం చేసిన కూతురుగా నందిత ఇచ్చిన పెర్‌ఫార్మెన్స్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా పోసాని కృష్ణమురళి చేసిన క్యారెక్టర్‌ చాలా రొటీన్‌గా మనం ఇంతకుముందు సినిమాల్లో చూసిన క్యారెక్టర్‌లాగే వుంటుంది తప్ప ఏమాత్రం కొత్తగా అనిపించదు. చైతన్య కృష్ణ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో ఒక రౌడీ స్టూడెంట్‌లా కనిపిస్తాడు. హీరోతో తన్నులు తినే క్యారెక్టరే తప్ప అతనికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. సినిమాలో ఎక్కువ భాగం హీరో, హీరోయిన్‌ స్టోరీ నడుస్తుంటుంది కాబట్టి మిగతా పాత్రల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. 

టెక్నీషియన్స్‌: కన్నడ సినిమాకి పనిచేసిన సంగీత దర్శకుడు హరి, సినిమాటోగ్రాఫర్‌ కె.ఎస్‌.చంద్రశేఖర్‌ ఈ సినిమాకి కూడా వర్క్‌ చేశారు. చంద్రశేఖర్‌ ఫోటోగ్రఫీ సినిమా కథకు తగ్గట్టు, సినిమాలో వుండే వివిధ బ్యాక్‌డ్రాప్‌లకు తగ్గట్టు బాగుంది. ప్రతి సీన్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. హరి సంగీతం బాగుంది. పాటలు కూడా ఫరవాలేదు అనిపించాయి. అయితే పాటల ప్లేస్‌మెంట్స్‌ మాత్రం సినిమాకి బ్యాడ్‌ అయ్యాయి. ఒక ఫ్లోలో వెళ్తున్న సినిమాకి పాటలు చాలా అడ్డంకి అయ్యాయి. సినిమాలో ఎక్కువ ఎమోషనల్‌ సీన్స్‌, ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ వుండడంతో దానికి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని ఆకట్టుకునేలా చేశాడు హరి. ఎడిటింగ్‌ విషయానికి వస్తే దాని గురించి చెప్పుకునేంత ఏమీ లేదు. డైరెక్టర్‌ చంద్రు గురించి చెప్పాలంటే ఈ కథతో కన్నడలో సూపర్‌హిట్‌ కొట్టిన చంద్రు తెలుగులో కూడా ఆ రేంజ్‌లోనే హిట్‌ అవుతుందనుకున్నాడు. తెలుగు, ప్రేక్షకుల కంటే కన్నడ ప్రేక్షకులు సినిమాల టేస్ట్‌ విషయంలో కొంత వెనకబడి వున్నారని ఆమధ్య వచ్చిన కొన్ని సినిమాలు చూస్తే అర్థమవుతుంది. కన్నడలో హిట్‌ అయిన చార్మినార్‌ కూడా ఆ కోవకు చెందిందే. ఆ కాన్సెప్ట్‌తో తెలుగులో సినిమా చెయ్యాలనుకున్నప్పుడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల పల్స్‌ ఏమిటి? ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌లో, ఎలాంటి సీన్స్‌తో తను అనుకున్న కథను ఆడియన్స్‌కి రీచ్‌ అయ్యేలా చేస్తే బాగుంటుందని చంద్రు ఆలోచిస్తే సినిమా ఇంకా బాగా వచ్చేది. సినిమాలో ఎంత కథ వున్నా, ఎంత ఫీల్‌ వున్నా స్లో నేరేషన్‌ వల్ల చాలా బోర్‌ ఫీల్‌ అవుతాం. కథలో వున్న ఫీల్‌, హీరో, హీరోయిన్‌ల క్యారెక్టర్స్‌లో వున్న లవ్‌గానీ, ఎమోషన్‌ని గానీ పర్‌ఫెక్ట్‌గా ఆడియన్స్‌కి రీచ్‌ అయ్యేలా చేయలేకపోయాడు. వారి వారి క్యారెక్టర్స్‌ని అద్భుతంగా పోషించినా అనుకున్న ఫీల్‌ వర్కవుట్‌ చెయ్యడంలో చంద్రు సక్సెస్‌ కాలేకపోయాడు. నిర్మాణం విషయానికి వస్తే నిర్మాత శిరీషా శ్రీధర్‌ కథకు తగినట్టుగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మించారని విజువల్స్‌ చూస్తే అర్థమవుతుంది.

విశ్లేషణ: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే ఒక సాఫ్ట్‌ టైటిల్‌, ఒక పొయిటిక్‌ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా కథ పరంగా, క్యారెక్టర్స్‌ పరంగా ఓకే అనిపిస్తుంది. కానీ, సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ప్రతి సీన్‌ చాలా స్లోగా మూవ్‌ అవడంతో నెక్స్‌ట్‌ సీన్‌ మీద ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అవ్వలేదు. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్‌ పరంగా చూస్తే చాలా తప్పులు కనిపిసాయి. ఒక సీన్‌లో తనకు కాఫీ, టీ ఇష్టం లేదని చెప్పిన హీరో నెక్స్‌ట్‌ సీన్‌లోనే కాఫీకి ఆర్డరిస్తాడు. సిటీ నుంచి ఊరికి బయల్దేరిన హీరోయిన్‌.. హీరోతో ‘వెళ్తాను’ అని చెప్తుంది. నెక్స్‌ట్‌ సీన్‌లో హీరో అలా చెప్తే.. అలా చెప్పకూడదు వెళ్ళొస్తాను అని చెప్పాలి అంటుంది. ఇలాంటివి సినిమాలో లెక్కకు మించి కనిపిస్తాయి. అయితే ఒక మంచి కథతో సినిమా నడుస్తుండడం వల్ల ఆడియన్స్‌కి అవి అంతగా గుర్తుండకపోవచ్చు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో, హీరోయిన్ల స్కూల్‌ లైఫ్‌, కాలేజ్‌ లైఫ్‌తో చాలా స్లోగా రన్‌ అవుతూ ఇంటర్వెల్‌ వరకు వస్తుంది. అప్పటివరకు హీరోయిన్‌కి తన ప్రేమ గురించి చెప్పని హీరో సెకండాఫ్‌లో అయినా చెప్తాడని ఎంత ఎదురుచూసినా క్లైమాక్స్‌ వచ్చేస్తుంది కానీ హీరో చెప్పడు. తీరా క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఆడియన్స్‌కి ఒక ట్విస్ట్‌ ఇస్తాడు డైరెక్టర్‌. ఒక మంచి ప్రేమకథను చూస్తున్న ప్రేక్షకులు ప్లెజెంట్‌గా వుండే క్లైమాక్స్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అలా కాకుండా ఆడియన్స్‌ ఊహకి విరుద్ధంగా సినిమా ఎండ్‌ అవ్వడం వల్ల నిరుత్సాహానికి గురవుతారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక మంచి ప్రేమకథను చూడాలనుకునేవారికి, ఒక ప్రేమికుడి లైఫ్‌లోని ఎమోషనల్‌ మూమెంట్స్‌కి కనెక్ట్‌ అయ్యే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రేమకథ కూడా ఇప్పటి ట్రెండ్‌కి అనుగుణంగా ఫాస్ట్‌గా వుండాలనుకునేవారికి మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఇలాంటి ప్రేమకథలు కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: ఆకట్టుకుంటుంది కొందరిని

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

- హరా జి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs