యునైటెడ్ మూవీస్
పండగ చేస్కో
నటీనటులు: రామ్, రకుల్ ప్రీత్, సోనాల్ చౌహాన్,
సాయికుమార్, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్,
సంపత్‌రాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
సంగీతం: ఎస్.ఎస్.థమన్
కథ: వెలిగొండ శ్రీనివాస్
స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్
ఎడిటింగ్: గౌతంరాజు
నిర్మాత: పరుచూరి కిరీటి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
విడుదల తేదీ: 29.05.2015
‘కందిరీగ’ తర్వాత వరసగా మూడు ఫ్లాప్ మూవీస్ చేసిన రామ్ ‘పండగ చేస్కో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యునైటెడ్ మూవీస్ పతాకంపై ‘సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డాన్‌శీను’తో డైరెక్టర్‌గా పరిచయమైన గోపీచంద్ మలినేని ‘బాడీగార్డ్’తో ఫర్వాలేదనిపించుకొని ‘బలుపు’తో మరో సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘పండగ చేస్కో’ చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏమేర ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసింది? ఈమధ్యకాలంలో హిట్ అనేది లేని రామ్‌కి గోపీచంద్ ‘పండగ చేస్కో’తో సూపర్‌హిట్‌ని అందించాడా? వీరిద్దరి ఫస్ట్ కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అయింది? తన ప్రతి సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని కూడా తన స్టైల్‌లోనే ఎంటర్‌టైనింగ్‌గా తీశాడా? ఈ విషయాలన్నీ సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: కార్తీక్(రామ్) పోర్చుగల్‌లో ఒక గేమింగ్ కంపెనీకి యజమాని. దానితోపాటు ఇండియాలోనూ అతనికి చాలా బిజినెస్‌లు వున్నాయి. మరో పక్క అనుష్క(సోనాల్ చౌహాన్) కూడా అక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. తన తండ్రి రాసిన వీలునామా ప్రకారం ఒక నెలలో ఆమె పెళ్ళి జరిగితేనే ఆస్తి ఆమె సొంతం అవుతుంది. లేకపోతే ఆస్తంతా ట్రస్టుకి వెళ్ళిపోతుంది. అలాంటి టైమ్‌లో రామ్‌తో పెళ్ళికి ఓకే అంటుంది. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోతుంది. కట్ చేస్తే భూపతి(సంపత్‌రాజ్), సాయిరెడ్డి(సాయికుమార్) ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. కొన్ని కారణాల వల్ల వారిద్దరూ శత్రువులుగా మారతారు. సాయిరెడ్డి చెల్లెళ్ళను పెళ్ళి చేసుకున్న భూపతి, అతని సోదరులు 25 సంవత్సరాలుగా తమ భార్యలను సాయిరెడ్డి దగ్గరికే పంపిస్తారు. ఇదిలా వుంటే సిటీలో వుండే దివ్య(రకుల్ ప్రీత్) భూపతి కూతురు. దివ్యకు నాన్న, మావయ్య ఇద్దరూ ఇష్టమే. అందుకే మావయ్య దగ్గరే వుంటానని, పెళ్ళి మాత్రం తండ్రి చూపించిన అబ్బాయినే చేసుకుంటానని చెప్తుంది. ఇదిలా వుంటే హైదరాబాద్‌లోని గ్రీన్ ఆర్మీ అనే సంస్థ కార్తీక్‌కి చెందిన ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరిగిపోతోందని దాన్ని మూసివేయిస్తుంది. గ్రీన్ ఆర్మీ సంస్థను నడుపుతున్న దివ్యను లవ్‌లో పడేసి ఆమె నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు కార్తీక్. తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత తను ఇండియా ఎందుకు వచ్చాడో రివీల్ చేస్తాడు కార్తీక్. అసలు కార్తీక్ ఇండియా ఎందుకు వచ్చాడు? భూపతి, సాయిరెడ్డిల ఫ్యామిలీతో అతనికి వున్న సంబంధం ఏమిటి? నిజంగానే దివ్యను ప్రేమలోకి దింపాడా? తనతో ఎంగేజ్‌మెంట్ జరిగిన అనుష్కను కార్తీక్ ఏం చేశాడు? భూపతి, సాయిరెడ్డిల మధ్య శత్రుత్వం రావడానికి కారణం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: కార్తీక్ క్యారెక్టర్‌లో రామ్ పెర్‌ఫార్మెన్స్ ఇంతకుముందు సినిమాల్లో చూసినట్టుగానే వుంది తప్ప కొత్తగా ఏం లేదు. అలాగే అతని క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఏమీ అనిపించలేదు. డైలాగ్ డెలివరీలోగానీ, అతని బాడీ లాంగ్వేజ్‌లోగానీ కొత్తదనం ఏమీ కనిపించలేదు. అయితే డాన్సుల్లో మాత్రం ఎక్స్‌లెంట్ అనిపించుకున్నాడు. రకుల్ ప్రీత్ చేసిన దివ్య క్యారెక్టర్‌లో కూడా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌కి ఎంత ప్రాధాన్యత వుంటుందో, ఈ సినిమాలో అంతకుమించి ఏమీ లేదని చెప్పాలి. పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఈ క్యారెక్టర్‌లో రకుల్‌ని ఇంతకుముందే చూసినట్టు అనిపిస్తుంది. వీకెండ్ వెంకట్రావుగా బ్రహ్మానందం అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కువసార్లు సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. ఎం.ఎస్.నారాయణ, సురేఖావాణి కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని కామెడీ సీన్స్‌లో ఇద్దరూ చాలా బాగా చేశారు. సంపత్‌రాజ్, సాయికుమార్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, అభిమన్యు సింగ్ తదితరులు చేసిన క్యారెక్టర్లు చాలా రొటీన్‌గా వున్నాయి. దానికి తగ్గట్టుగానే వారి పెర్‌ఫార్మెన్స్ కూడా రొటీన్‌గానే వుంది. బిజినెస్ మ్యాగ్నెట్‌గా సోనాల్ చౌహాన్ చాలా డిగ్నిఫైడ్‌గా పెర్‌ఫార్మ్ చేసింది. ఫస్ట్ హాఫ్‌లో ఆమె పెర్‌ఫార్మెన్స్ అందరికీ నచ్చేలా వుంది.
టెక్నీషియన్స్: ఈ సినిమాకి సంబంధించి మొదట చెప్పుకోవాల్సిన టెక్నీషియన్ సమీర్‌రెడ్డి. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా చూపించాడు. ఫారిన్ లొకేషన్స్‌ని కన్నుల పండువగా చిత్రీకరించడంలో సమీర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా పాటలు చిత్రీకరించిన అందమైన లొకేషన్స్‌ని అంతకంటే అందంగా తెరమీద చూపించాడు సమీర్. కథ, కథనాలకు తగ్గట్టుగా గౌతంరాజు ఎడిటింగ్ కూడా ఓకే అనిపించాడు. మ్యూజిక్ విషయానికి వస్తే థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో ఇంతకుముందు వచ్చిన పాటల్నే మళ్ళీ వింటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా మూడు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదనిపించాడు. కోన వెంకట్ రాసిన మాటలు అక్కడక్కడ మాత్రమే పేలాయి. కొన్నిచోట్ల చాలా రొటీన్ వున్న డైలాగ్స్ విసుగు పుట్టిస్తాయి. వెలిగొండ శ్రీనివాస్ ఇచ్చిన ఈ కథ చాలా అస్తవ్యస్తంగా వుండడమే కాకుండా కలగూర గంపలా ఎన్నో కథలు ఈ సినిమాలో చేరినట్టు అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది చాలా పాత కథ. ఒక సీన్ కథకి, మరో సీన్ కథకి సంబంధం లేదేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. దానికి తగ్గట్టుగానే స్క్రీన్‌ప్లే చేసుకున్నాడు గోపీచంద్. ఫారిన్ సీన్ కట్ చేస్తే విలన్ ఆదిత్య మీనన్ సీన్, కట్ చేస్తే భూపతి, సాయిరెడ్డిలకు సంబంధించిన సీన్. ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూ దేన్నీ పూర్తిగా చూడనివ్వకుండా డిస్ట్రబ్ చేస్తున్నట్టుగా వుంటాయి. ఈ కథను పర్‌ఫెక్ట్‌గా ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా చెయ్యడంలో, క్యారెక్టర్ల గురించి క్లారిటీగా చెప్పడంలో గోపీచంద్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు చూసుకుంటే ఎన్నో లూప్ హోల్స్ వున్నాయి. అలాగే కొన్ని సీన్స్‌కి లాజిక్ కూడా లేదు.
ప్లస్ పాయింట్స్:
ఫోటోగ్రఫీ
కొంత ఎంటర్‌టైన్‌మెంట్
కొంత మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
చాలా పాత కథ
కథలో క్లారిటీ లేకపోవడం
క్యారెక్టర్ల మధ్య కన్‌ఫ్యూజన్
లాజిక్ లేని సీన్స్
విశ్లేషణ: గోపీచంద్ మలినేని ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కథ విషయంలో సరైన క్లారిటీ లేదని స్టార్టింగ్ నుంచే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో రిచ్ గెటప్‌లో వున్న కార్తీక్, అంతే రిచ్‌గా వుండే సోనాల్ చౌహాన్ మధ్య సీన్స్, ఎంగేజ్‌మెంట్, తర్వాత ఇండియాలో హీరోయిన్ రకుల్ ప్రీత్‌తో కొన్ని సీన్స్, తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో ఈ సీన్స్ మధ్యలోనే అక్కడక్కడ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌కి వచ్చే సరికి ఇక అంతా మామూలే. హీరోయిన్ ఫ్యామిలీలోకి ఒక మెంబర్‌గా ఏదో ఒక కారణంతో వచ్చి చేరే హీరో క్యారెక్టర్. ఎంతో తెలివిగా అందర్నీ బుట్టలో వేసి, అందరికీ ఒక క్లారిటీ తీసుకు రావడానికి హీరో చేసే జిమ్మిక్కులు వుంటాయి. ఎన్నో సినిమాల్లో వుండే క్లైమాక్స్‌లాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా వుంటుంది తప్ప ఏమాత్రం కొత్తదనం కనిపించదు. ఈ సినిమా చూసే ప్రతి ఆడియన్‌కి ఇలాంటి సినిమా ఇంతకుముందే చూశామన్న ఫీలింగ్ కలిగించడం ఈ సినిమా స్పెషాలిటీ. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం లేదు. ఐదు పాటలు, ఐదు ఫైట్స్, కొన్ని కామెడీ సీన్స్, కొంత సెంటిమెంట్ వంటి రొటీన్ ఎలిమెంట్స్ కోరుకునే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు తక్కువ. రొటీన్ ఫ్యామిలీ సీన్స్, రొటీన్ కామెడీ వంటివి తప్ప ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే కొత్త అంశాలు కూడా ఈ సినిమాలో ఏమీ లేవు.
ఫినిషింగ్ టచ్: రెండున్నర గంటలు దండగే.!
సినీజోష్ రేటింగ్: 2.75/5