లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్
మోసగాళ్ళకు మోసగాడు
నటీనటులు: సుధీర్‌బాబు, నందిని, అభిమన్యు సింగ్,
జయప్రకాష్‌రెడ్డి, ప్రవీణ్, చంద్రమోహన్,
పంకజ్ కేసరి, ఫిష్ వెంకట్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఉమ్మడిసింగు సాయిప్రకాష్
సంగీతం: మణికాంత్ కద్రి
మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మెత్స
సమర్పణ: శంకర్ చిగురుపాటి
నిర్మాత: చక్రి చిగురుపాటి
రచన, దర్శకత్వం: బోస్ నెల్లూరి
విడుదల తేదీ: 22.05.2015
నిఖిల్, స్వాతిలతో ‘స్వామిరారా’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించి ఆ చిత్రం ద్వారా సుధీర్‌వర్మను దర్శకుడుగా పరిచయం చేసిన చక్రి చిగురుపాటి లేటెస్ట్‌గా సుధీర్‌బాబు హీరోగా నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం ద్వారా బోస్ నెల్లూరి దర్శకుడుగా పరిచయమయ్యాడు. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించి, నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఆరోజుల్లో మొదటి కౌబాయ్ సినిమాగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో సుధీర్‌బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ టైటిల్‌కి సరైన జస్టిఫికేషన్ ఇచ్చిందా? సుధీర్‌బాబుకి మరో సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిందా? ‘స్వామిరారా’ తర్వాత నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ రెండో చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.
కథ: ఓపెన్ చేస్తే ఓ దేవాలయంలోని సీతారాముల విగ్రహాలను తెలివిగా అపహరించి, వాటి స్థానంలో నకిలీ విగ్రహాలను వుంచుతారు. ఆ విగ్రహాలను దుబాయ్‌లో వున్న స్మగ్లర్ రుద్ర(అభిమన్యు సింగ్) కోసం దొంగిలిస్తారు. అయితే కస్టమ్స్ అధికారుల కంట పడకుండా వాటిని దుబాయ్ తరలించేందుకు టైమ్ కోసం ఎదురుచూస్తుంటారు. కట్ చేస్తే అతని పేరు కృష్ణప్రసాద్ అలియాస్ క్రిష్(సుధీర్‌బాబు). స్నేహితుడితో కలిసి చిన్న చిన్న మోసాలు చేస్తూ వుంటాడు. మోసగాళ్ళను మోసం చేసి వారి దగ్గర డబ్బు కొట్టేయడం అతని స్టైల్. అలా కొట్టేసిన డబ్బుతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న క్రిష్ లైబ్రరీలో పనిచేసే జానకి(నందిని)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇకపై మోసాలు మానేస్తానని ఆమెకు మాట ఇస్తాడు. దొంగిలించిన విగ్రహాలను దుబాయ్ తీసుకొచ్చే పనిని కౌశిక్‌కి అప్పగిస్తాడు రుద్ర. ఈ పని చేయడం కోసం క్రిష్‌ని పిలిపిస్తాడు కౌశిక్. అయితే ఆ విగ్రహాలతో మాయమవుతాడు క్రిష్. మోసాలు మానేస్తానని జానకికి మాట ఇచ్చిన క్రిష్ 25 కోట్ల రూపాయల విలువ చేసే విగ్రహాలతో సహా ఎందుకు మాయమయ్యాడు? ఆ విగ్రహాలు రుద్రకు చేరాయా? మోసాలు మానని క్రిష్‌ని జానకి ప్రేమించిందా? అనేది తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్: క్రిష్‌గా ఇప్పటివరకు సుధీర్‌బాబు చెయ్యని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌గానీ, డైలాగ్ డెలివరీగానీ, స్టైల్‌గానీ కొత్తగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్‌లో మహేష్‌బాబుని ఇమిటేట్ చేసినట్టుగా అర్థమవుతుంది. అయితే నటుడిగా సుధీర్‌కి ఇది ఒక ప్రమోషన్‌లాంటిదని చెప్పుకోవచ్చు. అతనికి ఇలాంటి క్రైమ్ కామెడీ సినిమాలు, మాస్ కామెడీ సినిమాలు సూట్ అయ్యే అవకాశం వుంది. హీరోయిన్ నందిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్‌కి సినిమాలో అంత ప్రాధాన్యత లేదు. కేవలం హీరోని ప్రేమించే హీరోయిన్‌గానే చూపించారు తప్ప ఆమెకు ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ అంటూ ఏమీ లేకపోవడం, హీరో కాంబినేషన్‌లో చేసిన సీన్స్‌లో కూడా కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాకపోవడంతో వీరిద్దరి పెయిర్ అంతగా ఆకట్టుకోలేదు. మిగతా క్యారెక్టర్లలో జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ఫిష్ వెంకట్‌ల కామెడీ ట్రాక్ అందర్నీ నవ్వించింది. విలన్‌గా అభిమన్యు సింగ్ క్యారెక్టర్ చాలా రొటీన్‌గా వుంటుంది. ఆ క్యారెక్టర్‌కి వున్న పరిధిలో అతను కూడా బాగానే చేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన పంకజ్ కేసరిని నటన కంటే సిగిరెట్స్ తాగడానికి ఎక్కువ వాడుకున్నారు. ఇక ఒక అనాధాశ్రమాన్ని నడిపే మాస్టారిగా చంద్రమోహన్ ఓకే అనిపించాడు. క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి వున్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు.
టెక్నీషియన్స్: ఈ సినిమాకి సాయిప్రకాష్ అందించిన ఫోటోగ్రఫీ ప్రాణం అని చెప్పాలి. ప్రతి ప్రేమ్‌ని ఎంతో అందంగా చూపించడమే కాకుండా కొత్త లొకేషన్స్‌లో తీసిన సీన్స్‌ని మరింత అందంగా చిత్రీకరించాడు. మణికాంత్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా స్టార్టింగ్‌లో బాబా సెహగల్ పాడిన టైటిల్ సాంగ్ తప్ప మిగతా పాటలు ఆడియోపరంగా, విజువల్‌గా కూడా అంత బాగా లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా, కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా బాగా చేశాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చెప్పుకోదగ్గట్టుగా లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు కొన్ని సీన్స్ మధ్య మధ్య అతికించినట్టుగా అనిపించాయి. డైరెక్టర్ బోస్ గురించి చెప్పుకోవాలంటే తను అనుకున్న కాన్సెప్ట్‌ని పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించడంలో అంతగా సక్సెస్ అవ్వలేదు. స్వామిరారా చిత్రానికి సీక్వెల్ అని ప్రచారం జరిగిన ఈ సినిమా కూడా క్రైమ్ కామెడీని బేస్ చేసుకొనే తీశారు. అయితే స్వామిరారా చిత్రంలో వున్న స్పీడ్‌గానీ, స్టోరీలో గ్రిప్‌గానీ ఇందులో లేవు. పైగా సీన్స్ కూడా చాలా స్లోగా రన్ అవుతుండడం వల్ల చాలా సీన్లు ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యలేకపోయాయి. సెకండాఫ్‌లో హీరో హీరోయిన్లను విలన్ ఇంట్లో పెట్టి ఇంతకుముందు చూసిన సినిమాలను గుర్తు చేశాడు. నిర్మాత చక్రి చిగురుపాటి సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. ఈ సినిమాలో ఇప్పటివరకు మనం చూడని చాలా కొత్త లొకేషన్స్ కనిపిస్తాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు ప్రతి సీన్ గ్రాండియర్‌గా కనిపించడానికి నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని అర్థమవుతుంది.
ప్లస్ పాయింట్స్:
మంచి కామెడీ
ఫోటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్
పాటలు
విశ్లేషణ: స్వామిరారా చిత్రంలో విగ్రహం కథ, ఈ సినిమా మాత్రం రెండు విగ్రహాల కథ. స్వామిరారా చిత్రంలోలాగే గుడిలో దొంగిలించబడిన విగ్రహాలు చేతులు మారుతూ సినిమాని నడిస్తాయి. అయితే ఆ సినిమాలో ఆడియన్స్ పొందిన థ్రిల్‌ని ఈ సినిమాలో పొందలేకపోయారు. ఓపెనింగ్ సీన్‌లో విగ్రహాల దొంగతనం, ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్, అతను హీరోయిన్ వెంటపడడం, మధ్య మధ్య జె.పి. గ్యాంగ్ కామెడీ, మధ్యలో చంద్రమోహన్ అనాధాశ్రమం వ్యవహారంతో ఫస్ట్ హాఫ్ అయిందనిపించారు. సెకండాఫ్ స్టార్ట్ అయిన చాలా సేపటి వరకు కథలో ఎలాంటి చలనం వుండదు. ఇలాంటి క్రైమ్ కథ ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే సినిమాలో స్పీడ్ అనేది ఇంపార్టెంట్. అది ఈ సినిమాలో మిస్ అయింది. అయితే సెకండాఫ్‌లో కొంత టైమ్ తర్వాత సినిమా కాస్త స్పీడందుకొని క్లైమాక్స్ వరకు వెళ్తుంది. కథ, కథనం విషయాలు పక్కన పెడితే సినిమాలో కామెడీ బాగా వర్కవుట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు అక్కడక్కడా నవ్వించడం వల్ల సినిమా ఓకే అంటున్నారు ప్రేక్షకులు. స్వామిరారా తర్వాత మళ్ళీ సరదాగా నవ్వుకోవడానికి ఎక్కువ అవకాశం వున్న సినిమా. ఇది క్రైమ్ కామెడీ అయినప్పటికీ ఎక్కడా వల్గారిటీ అనేది లేకపోవడంవల్ల కుటుంబ సమేతంగా ఒకసారి చూడొచ్చు.
ఫినిషింగ్ టచ్: మోసగాడు ఓకే అనిపించుకున్నాడు
సినీజోష్ రేటింగ్: 2.75/5