Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: 365 డేస్‌


సినీజోష్‌ రివ్యూ: 365 డేస్‌

Advertisement
CJ Advs

డి.వి.క్రియేషన్స్‌ 

365 డేస్‌

నటీనటులు: నందు, అనైక సోఠి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, సత్యకృష్ణన్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: అనిత్‌

సంగీతం: నాగ్‌ శ్రీవత్స, ఎల్‌.ఎం.ప్రేమ్‌

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: రఘు కె.ఎం.ఆర్‌.

నిర్మాత: డి.వెంకటేష్‌

రచన, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ

విడుదల తేదీ: 22.05.2015

మాఫియా, హార్రర్‌, క్రైమ్‌ తరహా చిత్రాలను వదిలేసి ఫ్యామిలీ ఎమోషన్స్‌, హ్యూమన్‌ రిలేషన్స్‌తో కూడిన కథలతో సినిమాలు చేస్తున్న రామ్‌గోపాల్‌వర్మ లేటెస్ట్‌ మూవీ ‘365 డేస్‌’. ప్రేమ, పెళ్ళి, విడాకులు అనే అంశాలను టచ్‌ చేస్తూ వర్మ చేసిన సినిమా ఇది. నందు, అనైక సోఠి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 365 డేస్‌ చిత్రం ద్వారా రామ్‌గోపాల్‌వర్మ ఏం చెప్పుదలుచుకున్నాడు? మనందరికీ తెలిసిన విషయాల్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడా? తన పెళ్ళి కథ అంటూ వర్మ ప్రచారం చేసిన ఈ ప్రేమ, పెళ్ళి, విడాకుల కథను ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్‌ చేశారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: ఓపెన్‌ చేస్తే 365 రోజులు కలిసి వున్న భార్యాభర్తల మధ్య వున్న గొడవలు క్లైమాక్స్‌కి చేరి విడాకులు తీసుకోవాలని డిసైడ్‌ అయిన రోజు. అతని పేరు అపూర్వ్‌(నందు), ఆమె పేరు శ్రేయ(అనైక సోఠి). ఆరోజు బయట డిన్నర్‌ చేద్దామని డిసైడ్‌ అవుతారిద్దరూ. కానీ, ఆఫీస్‌లో మీటింగ్‌ లేట్‌ అవ్వడం వల్ల అపూర్వ్‌ టైమ్‌కి రాలేకపోతాడు. ఇంటికి వచ్చిన భర్తతో గొడవపడుతుంది శ్రేయ. మాటా మాటా పెరిగి ఇక కలిసి వుండలేం అని డిసైడ్‌ అవుతారు. ఫ్లాష్‌బ్యాక్‌లో 365 రోజులు వెనక్కి వెళ్తే.. అపూర్వ్‌, శ్రేయ ఎలా కలుసుకున్నారు? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? పెద్ద వాళ్ళని ఒప్పించి ఎలా పెళ్ళి చేసుకున్నారు? వారి సంసార జీవితంలో మనస్పర్థలు ఎలా వచ్చాయి? అవి పెరిగి విడాకుల వరకూ ఎందుకు వెళ్ళాయనేది స్క్రీన్‌ మీద చూడాల్సిందే. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఒక సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌గా, ప్రేమికుడిగా, భర్తగా, భార్యా బాధితుడిగా అన్ని రకాల షేడ్స్‌ని నందు పెర్‌ఫెక్ట్‌గా చూపించగలిగాడు. శ్రేయగా అనైక సోఠి పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగానే వుంది. కానీ, ఆమె స్క్రీన్‌ ప్రెజెన్స్‌ మాత్రం బాగా లేదు. కొన్ని యాంగిల్స్‌లో అనైక ఫేస్‌ని చూడడం కష్టమే అనిపించింది. ‘అందం నిర్వచనం.. అది నువ్వే అవును నిజం’ పాటలో నందు, అనైక పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. విజువల్‌గా ఆ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. నందు స్నేహితుడుగా కృష్ణుడు, అనైక స్నేహితురాలిగా సత్యకృష్ణన్‌ వారి వారి క్యారెక్టర్ల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇక అపూర్వ్‌ బాస్‌గా జగ్‌జిత్‌ క్యారెక్టర్‌లో పోసాని కృష్ణమురళి చేసిన క్యారెక్టర్‌లో అక్కడక్కడ నవ్వించినా ఎక్కువసార్లు విసిగించాడు. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోదగిన క్యారెక్టర్లు లేవు. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ అనిత్‌ గురించి. తనకి వున్న లిమిట్స్‌లో మంచి ఫోటోగ్రఫీ అందించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ‘అందం నిర్వచనం..’ పాటని చాలా ఎక్స్‌లెంట్‌గా తీశాడు. గతంలో రామ్‌గోపాల్‌వర్మ చేసిన కొన్ని సినిమాల్లో ఈ కాన్సెప్ట్‌తో చేసిన పాటలు వున్నాయి. అయితే వాటిని మించేలా అనిత్‌ ఈ పాటను విజువలైజ్‌ చేశాడు. ఈ చిత్రానికి నాగ్‌ శ్రీవత్స, ఎల్‌.ఎం.ప్రేమ్‌ అందించిన సంగీతం అంతగా బాగా లేదు. అయితే రఘు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం చాలా సీన్స్‌ని బాగా ఎలివేట్‌ చేసింది. ఈ సినిమాకి కథ, మాటలు అందించి డైరెక్ట్‌ చేసిన రామ్‌గోపాల్‌వర్మ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం కొత్తగా చేసింది ఏమీ లేదు. కథలో గానీ, కథనంలోగానీ, మాటల్లోగానీ ఎక్కడా కొత్తదనం కనిపించదు. ఎన్నో గొప్ప కథల్ని హ్యాండిల్‌ చేసి, గొప్ప సినిమాలు తీసిన వర్మ ఈ సినిమాని మాత్రం ఫస్ట్‌ టైమ్‌ డైరెక్ట్‌ చేసే డైరెక్టర్‌లా కూడా చెయ్యలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఈ కథని ఇంకా బాగా తియ్యగలరని సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. కథనంలోగానీ, మాటల్లోగానీ ఏమాత్రం కొత్తదనం లేదు. ఆర్టిస్టుల నుంచి రాబట్టుకోవాల్సినంత పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోలేదేమో అనిపిస్తుంది. 

ప్లస్‌ పాయింట్స్‌: 

ఫోటోగ్రఫీ

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌:

కథ, కథనం, మాటలు

ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం

విశ్లేషణ: తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచీ ప్రేమ, పెళ్ళి, విడాకుల కథలతో వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ప్రేమ ఫలించి పెళ్ళి వరకు వచ్చిన కథలైతే, కొన్ని పెళ్ళి తర్వాత విడాకుల వరకు వెళ్ళిన కథలు. తన అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు లేదా కొంతమంది జీవితాల్లో తను చూసిన సంఘటనల్ని తీసుకొని ఈ కథను తయారు చేశాడు వర్మ. అయితే 365 రోజుల్లో ఒక జంట ప్రేమించుకొని, పెళ్ళి చేసుకొని, విడాకులు తీసుకొనే వరకు వచ్చారంటే ఇలాంటి సంఘటనలు మన దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని వుంటాయి? అంత తొందరగా విడాకులు తీసుకునే వారి శాతం ఎంత? తన అనుభవంలోకి వచ్చిన విషయాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చెయ్యడం వల్ల సినిమా ఆద్యంతం కామెడీ సినిమాలా అనిపించింది. ఈ కథలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంట ఎలాగైనా విడాకులు తీసుకోవాలి అని మొదటి రోజునుంచే కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరంటే ఒకరికి మొహం మొత్తి విడాకులు తీసుకున్నారంటే దాని గురించి ఆలోచించవచ్చు. వర్మ అనుకున్న పాయింట్‌ చాలా చిన్నది. ప్రేమ, పెళ్ళి, విడాకులు అనే పాయింట్‌తో రెండు గంటలు సినిమా నడిపించాలంటే చాలా కష్టం. అందుకే పాటలతో సహా సినిమా నిడివి ఒక గంట 45 నిముషాలు. ఇంత తక్కువ నిడివి వున్న సినిమా అయినప్పటికీ ఎక్కువ సేపు థియేటర్‌లోనే కూర్చున్న ఫీలింగ్‌ కలుగుతుంది. హీరోయిన్‌ డైలాగ్స్‌ చెప్పిన విధానం ఒక టి.వి. సీరియల్‌ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే సినిమాలోని కొన్ని సీన్స్‌ కూడా సీరియల్‌ని మరపిస్తాయి. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ని ఈ సినిమాలో కంటే కొన్ని సీరియల్స్‌లోనే బాగా తీశారనిపిస్తుంది. మధ్య మధ్య పోసాని చెప్పే సెక్స్‌ సూత్రాలు విసుగు పుట్టిస్తాయి. పెళ్ళంటే ప్రమాదం అంటూ పోసాని పాడే పాట కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. పాతిక సంవత్సరాల క్రితం వర్మ సినిమాలో వచ్చిన ‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరు..’ పాటను గుర్తు తెచ్చేలా ఈ పాటని తీద్దామనుకున్నారు. కానీ, ఈ పాట మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో యూత్‌నిగానీ, లవర్స్‌నిగానీ, పెళ్ళి చేసుకోవాలనుకునేవారినిగానీ, పెళ్ళయిన వారిని గానీ ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు. పెళ్ళి, విడాకులు అనేది చాలా సీరియస్‌ ప్రాబ్లమ్‌ అని ఈ సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచీ చెప్తూ వస్తున్న వర్మ దాన్ని అంతే సీరియస్‌గా సినిమాలో చూపించలేకపోయాడు. సినిమాలోని కొన్ని సీన్స్‌ చూస్తే కామెడీగా కూడా అనిపించాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: 365 ఎపిసోడ్స్ సీరియల్ బెటర్..!

సినీజోష్‌ రేటింగ్‌: 1.75/5 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs