Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: ఉత్తమ విలన్‌


సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌

Advertisement
CJ Advs

ఉత్తమ విలన్‌

నటీనటులు: కమల్‌హాసన్‌, కె.బాలచందర్‌, కె.విశ్వనాథ్‌,

ఊర్వశి, జయరామ్‌, ఆండ్రియా, పూజాకుమార్‌, 

పార్వతి మీనన్‌, పార్వతి నాయర్‌, నాజర్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: శాందత్‌

సంగీతం: ఎం.జిబ్రాన్‌

ఎడిటింగ్‌: విజయ్‌ శంకర్‌

కథ, స్క్రీన్‌ప్లే: కమల్‌హాసన్‌

సమర్పణ: ఇరోస్‌ ఇంటర్నేషనల్‌, రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌,

తిరుపతి బ్రదర్స్‌

నిర్మాత: సి.కళ్యాణ్‌

దర్శకత్వం: రమేష్‌ అరవింద్‌

విడుదల తేదీ: 2.05.2015

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ ఏ సినిమా చేసినా అద్భుతమే. గతంలో తన నటనతో ఎన్నో అద్భుతాలు సృష్టించిన కమల్‌ లేటెస్ట్‌గా చేసిన చిత్రం ‘ఉత్తమ విలన్‌’. తను అందించిన కథ, స్క్రీన్‌ప్లేతో రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలను అధిగమించి విడుదలైంది. సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి కమల్‌హాసన్‌ కోసం, అతను చేసే అద్భుతాలు చూడడం కోసం సినిమాకి వెళ్ళే ఆడియన్స్‌కి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? ఇందులో కమల్‌ హాసన్‌ చేసిన కొత్త ప్రయోగం ఏమిటి? అసలు ‘ఉత్తమ విలన్‌’ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవదడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ: మనోరంజన్‌(కమల్‌హాసన్‌) ఒక సూపర్‌స్టార్‌. కోట్లాది మంది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వున్న హీరో. ఒక సాధారణమైన వ్యక్తి అయిన మనోరంజన్‌ని నటుడ్ని చేసి అతనితో ఎన్నో సినిమాలు రూపొందించిన దర్శకుడు మార్గదర్శి(కె.బాలచందర్‌). అయితే నటుడుగా వున్న మనోరంజన్‌ని సూపర్‌స్టార్‌ని చెయ్యడంలో అతని మామ పూర్ణచంద్రరావు(కె.విశ్వనాథ్‌) ఎంతో కీలక పాత్ర పోషించాడు. అందుకు ప్రతిఫలంగా అతని కూతుర్ని(వరలక్ష్మీ) మనోరంజన్‌కి ఇచ్చి వివాహం చేస్తాడు. తను ప్రేమించిన యామిని ని పక్కన పెట్టి వరలక్ష్మీని పెళ్ళి చేసుకుంటాడు. అలా చేసుకోవడం వెనుక ఒక కారణం వుంటుంది. ప్రస్తుతానికి వస్తే మనోరంజన్‌ చేసిన లేటెస్ట్‌ మూవీ రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అవుతుంది. దాని తర్వాత చేయబోయే ఆదిశంకరుడు సినిమాని పక్కన పెట్టి తన గురువు మార్గదర్శితో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అవుతాడు మనో. దానికి కారణం మనోకి వచ్చిన బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి. దానివల్ల ఎక్కువ కాలం తాను బ్రతకనని, అందుకే చివరి సినిమా గురువుతో చెయ్యాలనుకుంటాడు. నిజ జీవితంలో ఎక్కువ కాలం బ్రతకని మనో మృత్యుంజయుడుగా పేరు తెచ్చుకున్న ఉత్తముడి కథతో ‘ఉత్తమ విలన్‌’ స్టార్ట్‌ చేస్తాడు. ఓ పక్క మనోరంజన్‌ నిజ జీవిత కథ, మరో పక్క మనో, మార్గదర్శి కలిసి చేస్తున్న ఉత్తమ విలన్‌ సినిమా ఈ రెండూ ప్యారలల్‌గా జరుగుతూ వుంటాయి. మనో ఉత్తమ విలన్‌ చిత్రాన్ని కంప్లీట్‌ చేశాడా? సినిమాలో మృత్యుంజయుడుగా నటిస్తున్న మనో నిజజీవితంలో మృత్యువును జయించగలిగాడా? బ్రెయిన్‌ ట్యూమర్‌ వల్ల అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తను ప్రేమించి యామినిని కాదని వరలక్ష్మీని పెళ్ళి చేసుకోవడానికి రీజన్‌ ఏమిటి? యామిని ఏమైంది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఈ చిత్రంలో కనిపించే ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత వుంది. ఆయా క్యారెక్టర్లను పాత్రధారులు అద్భుతంగా పోషించారు. నిజజీవితంలో మనోరంజన్‌గా, సినిమాలో ఉత్తముడుగా కమల్‌హాసన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు పాత్రల్లోనూ జీవించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్‌ సీన్స్‌లో తనకు తనే సాటి అనేలా పెర్‌ఫార్మ్‌ చేశాడు. వరలక్ష్మీగా ఊర్వశి నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. నిజ జీవితంలో కూడా తన గురువైన కె.బాలచందర్‌తో చేయించిన మార్గదర్శి క్యారెక్టర్‌ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. పూర్ణచంద్రరావు క్యారెక్టర్‌లో కె.విశ్వనాథ్‌ తన సహజ నటనతో అందర్నీ మెప్పించారు. తను రాసుకున్న రెండు అద్భుతమైన క్యారెక్టర్లను కె.బాలచందర్‌ని, కె.విశ్వనాథ్‌లతో చేయించాలని కమల్‌హాసన్‌ అనుకోవడం, వారు కూడా ఆ క్యారెక్టర్లు చెయ్యడానికి ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. మనోరంజన్‌కి ప్రేమికురాలిగా, పర్సనల్‌ డాక్టర్‌గా ఆండ్రియా ఇచ్చిన పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రకరకాల సిట్యుయేషన్స్‌లో ఆమె నటన ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. కల్పవల్లిగా పూజా కుమార్‌, మనోన్మణిగా పార్వతి మీనన్‌ ఎంతో సెటిల్డ్‌గా చేశారు. ఈ చిత్రంలో ముత్యాలరాజుగా నాజర్‌ పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ నవ్విస్తుంది. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌: రెండు బ్యాక్‌డ్రాప్‌లతో నడిచే ఈ కథకు శాందత్‌ ఇచ్చిన ఫోటోగ్రఫీ సింప్లీ సూపర్బ్‌ అని చెప్పాలి. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా చూపించాడు. ఇక జిబ్రాన్‌ మ్యూజిక్‌ విషయానికి వస్తే పాటలు అంతగా ఆకట్టుకునేలా లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపించాడు. సినిమాలో వాడిన గ్రాఫిక్స్‌ ఏమాత్రం రిచ్‌గా లేవు. చాలా సీన్స్‌లో గ్రాఫిక్స్‌ పేలవంగా కనిపించడమే కాకుండా, సాధారణ ప్రేక్షకులకు కూడా ఇవి గ్రాఫిక్స్‌ అని అర్థమయ్యేలా వున్నాయి. కమల్‌హాసన్‌ రాసుకున్న కథ విషయానికి వస్తే కథగా చెప్పుకోవడానికి, వినడానికి బాగానే వున్నా సినిమా వరకు వచ్చేసరికి సినిమాలో ఎక్కడా ఎలాంటి ఫీల్‌ రాలేదు. హీరోకి వచ్చిన బ్రెయిన్‌ ట్యూమర్‌ అయినా, హీరో పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన సెంటిమెంట్‌ ఇవన్నీ స్క్రీన్‌ మీద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రతి సీన్‌ని విపులంగా చెప్పే ప్రయత్నంలో లెంగ్త్‌ని పెంచుకుంటూ పోయారు. దాంతో సినిమా చూసే ఆడియన్స్‌కి విసుగు పుట్టింది. 172 నిముషాల సినిమాని ఏకధాటిగా ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకుండా చూడడం అంటే ఆడియన్స్‌కి అగ్నిపరీక్షగా మారింది. టేకింగ్‌ పరంగా రమేష్‌ అరవింద్‌ ఎక్కడా రాజీ పడకుండా చేసినప్పటికీ కథలో, కథనంలో పట్టు లేకపోవడంతో సినిమా ఏ సందర్భంలోనూ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నట్టుగా అనిపించదు. మేకింగ్‌ పరంగా చూస్తే నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా తీశారు.

విశ్లేషణ: ఇది కమల్‌హాసన్‌ చేసిన ఒక వినూత్న ప్రయోగం అని చెప్పుకోవడానికి వీల్లేని సినిమా. ఒక సూపర్‌స్టార్‌ జీవిత కథ. అందులో ‘ఉత్తమ విలన్‌’ అనే సినిమా మేకింగ్‌ కథ. మధ్యలో హీరోకి బ్రెయిన్‌ ట్యూమర్‌. మరో పక్క హీరో పర్సనల్‌ లైఫ్‌లో జరిగిన ఓ తప్పిదం. ఇలా ఒక సాధారణమైన కథ, కథనాలతో రూపొందిన ‘ఉత్తమ విలన్‌’ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ తప్ప సినిమాలో చెప్పుకోదగిన పాజిటివ్‌ పాయింట్‌ ఏదీ లేదు. సినిమా స్టార్ట్‌ అవడమే స్లోగా స్టార్ట్‌ అయి అదే స్లోని కంటిన్యూ చేస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కానీ, క్లైమాక్స్‌గానీ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వలేకపోయాయి. హీరో కథని సీరియస్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తూనే అతను చేస్తున్న ఉత్తమ విలన్‌ సినిమా ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించే ప్రయత్నం చేశారు. కానీ, అది సక్సెస్‌ అవ్వలేదు. ఎలాంటి సినిమాలో అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటున్న ప్రజెంట్‌ ఆడియన్స్‌ని ‘ఉత్తమ విలన్‌’ నిరాశపరుస్తాడు. తెయ్యం నృత్యం నేపథ్యంలో ఉత్తమ విలన్‌ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు కమల్‌హాసన్‌. ఆ డాన్స్‌కి సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌లో అతని కష్టం కనిపిస్తుంది. అయితే ఆడియన్స్‌కి ఈ డాన్స్‌ అంత రుచించదు. ఫైనల్‌గా చెప్పాలంటే కమల్‌హాసన్‌ కోసం ఎ సెంటర్‌ ఆడియన్స్‌ సినిమాని కొంతవరకు ఆదరించే అవకాశం వుంది. బి, సి సెంటర్ల ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు తక్కువ. దశావతారం, విశ్వరూపం చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎలాంటి ప్రత్యేకత లేదనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs