Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: దోచేయ్‌


శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్‌

Advertisement
CJ Advs

దోచేయ్‌

నటీనటులు: నాగచైతన్య, కృతి సనన్‌, పోసాని, రావు రమేష్‌,

రవిబాబు, ప్రవీణ్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌

సంగీతం: సన్నీ ఎం.ఆర్‌.

ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌

నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌వర్మ

విడుదల తేదీ: 24.04.2015

అక్కినేని నాగచైతన్య లవ్‌స్టోరీస్‌ చేశాడు, యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ వున్న సినిమాలు చేశాడు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ చేశాడు. ఫస్ట్‌ టైమ్‌ క్రైమ్‌తో కూడిన ఒక స్టైలిష్‌ మూవీ ద్వారా ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలనుకున్నాడు. ‘స్వామిరారా’ వంటి డిఫరెంట్‌ మూవీతో అందర్నీ ఆకట్టుకున్న సుధీర్‌వర్మ డైరెక్షన్‌లో ‘దోచేయ్‌’ అంటూ ఓ సినిమా చేసేశాడు. ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఇప్పటివరకు చెయ్యని ఒక స్టైలిష్‌ మూవీతో వచ్చిన నాగచైతన్యని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? స్వామిరారాతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుధీర్‌వర్మ ‘దోచేయ్‌’తో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నాడా? ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగిందనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: ఓపెన్‌ చేస్తే ఒక బ్యాంక్‌ రాబరీ. రెండున్నర కోట్ల రూపాయలను తెలివిగా బ్యాంకు నుంచి దోచుకుంటారు. అందులో ఇద్దరు ఆ డబ్బును సొంతం చేసుకోవడానికి ఒకరినొకరు కాల్చుకోవడానికి సిద్ధపడతారు. కట్‌ చేస్తే .. స్వామిరారా టైపులో తన ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ చెల్లెల్ని డాక్టర్‌ చదివిస్తుంటాడు చందు(నాగచైతన్య). అలాగే జైల్లో వున్న తండ్రి వైద్యానికి కావాల్సిన డబ్బు కోసం కాస్త పెద్ద దొంగతనాలు చేస్తూ ఇట్టే డబ్బు సంపాదిస్తుంటాడు. ఇలా హ్యాపీగా నడుస్తున్న అతని లైఫ్‌లోకి మీరా(కృతి సనన్‌) ఎంటర్‌ అవుతుంది. అన్ని సినిమాల్లోలాగే ఇందులో కూడా వెంటనే హీరో లైన్‌లోకి వచ్చేస్తుంది హీరోయిన్‌. జైల్లో వున్న తండ్రిని సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయాలంటే రెండు కోట్లు ఖర్చవుతుందని హోమ్‌ మినిస్టర్‌ పి.ఎ. చెప్పడంతో ఆ రెండు కోట్లు సంపాదించే పనిలో పడతాడు చందు. ఆ పనిలో భాగంగా ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్తాడు చందు అక్కడ బ్యాంక్‌ దోపిడీ చేసిన ఇద్దరు ఫ్రెండ్‌ డబ్బు కోసం ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు. అదే టైమ్‌లో అక్కడికి ఎంటర్‌ అయిన చందు ఆ డబ్బును తీసుకొని ఉడాయిస్తాడు. చిన్న దొంగతనాలు చేస్తున్నప్పుడు మామూలు తీసుకొని చందుని వదిలేసే సి.ఐ. రిచర్డ్‌(రవిబాబు) పెద్ద మొత్తంలో చందు డబ్బు కొట్టేశాడని తెలిసి అతన్ని వెతుకుతుంటాడు. ఆ బ్యాంక్‌ దోపిడీ చేయించింది మాణిక్యం(పోసాని కృష్ణమురళి). మాణిక్యం ఎంత డేంజర్‌ పర్సన్‌ అనేది చందుకి తెలుసు. కానీ, ఆ డబ్బు అతనిదని చందుకి తెలీదు. చందు డబ్బు కొట్టేశాడని తెలుసుకున్న మాణిక్యం అతని తండ్రిని, చెల్లెల్ని కిడ్నాప్‌ చేస్తాడు. మరి చందు కొట్టేసిన డబ్బు మాణిక్యం దగ్గరికి చేరిందా? చందు ఫ్యామిలీకి మాణిక్యం చేసిన అన్యాయం ఏమిటి? మాణిక్యం అంటే చందు ఎందుకు భయడుతున్నాడు? మాణిక్యం వల్ల తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి చందు ప్రతీకారం ఏవిధంగా తీర్చుకున్నాడు? అనేది మిగతా కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవాల్సి వస్తే రిచర్డ్‌ ప్రసాద్‌ ఫోటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు సినిమాని రిచ్‌గా చూపించడంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. నాగచైతన్యని స్టైలిష్‌గా చూపించే ప్రయత్నంలో డైరెక్టర్‌ కొంత వరకు సక్సెస్‌ అయ్యాడు. ఇక హీరోయిన్‌ కృతి సనన్‌ గ్లామర్‌ కూడా సినిమాకి ప్లస్‌ అయింది. సెకండాఫ్‌లో వచ్చే టెంప్టింగ్‌ స్టార్‌ బుల్లెట్‌బాబు(బ్రహ్మానందం) తన పంచ్‌ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ని కాసేపు నవ్వించాడు. అక్కడక్కడ సప్తగిరి కామెడీ, విలన్‌ క్యారెక్టర్‌లో కూడా పోసాని నవ్వించే ప్రయత్నం చేశాడు. వైవా హర్ష కాంబినేషన్‌లో పోసాని చేసిన కొన్ని సీన్స్‌ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి. నాగచైతన్యని అనుక్షణం వెంటాడే పోలీస్‌ ఆఫీసర్‌గా రవిబాబు సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. నాగచైతన్య ఫ్రెండ్స్‌గా నటించిన ప్రవీణ్‌, సత్య తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. 

మైనస్‌ పాయింట్స్‌: ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పాల్సి వస్తే అది కథ. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి కథ అనేది లేదు. సినిమా అంతా బిట్లు, బిట్లుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప కథ ఇదీ అని చెప్పడానికి ఒక్క లైను కూడా లేదు. సుధీర్‌వర్మ చేసిన స్వామిరారా సినిమాని తీసుకుంటే ఒక మంచి కథ, దాన్ని అందంగా చెప్పిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దానికి తగ్గట్టుగా మంచి కామెడీ, ట్విస్ట్‌లు వుండడంతో ఆడియన్స్‌ సూపర్‌హిట్‌ అన్నారు. అయితే ఆ సినిమాకి కథ విషయంలో తీసుకున్నంత శ్రద్ధ దర్శకుడు ఈ సినిమాకి తీసుకున్నట్టుగా అనిపించదు. సాధారణంగా క్రైమ్‌ స్టోరీస్‌కి స్క్రీన్‌ప్లే ఎంత స్పీడ్‌గా వుంటే ఆడియన్స్‌కి సినిమా మీద అంత ఇంట్రెస్ట్‌ కలుగుతుంది. సీన్‌, సీన్‌కి ఆడియన్స్‌లో క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. ఈ సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్‌ నుండి ఎండిరగ్‌ వరకు ఏ దశలోనూ క్యూరియాసిటీ అనేది కలగదు. సినిమా స్టార్ట్‌ అయ్యాక ఫస్ట్‌ హాఫ్‌ ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా అని ఎదురుచూడాల్సి వస్తుంది, అలాగే సెకండాఫ్‌ స్టార్ట్‌ అయ్యాక సినిమా ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది తప్ప ఏ సీన్‌ కూడా ఆడియన్స్‌ని సీట్లో కూర్చోబెట్టే విధంగా వుండదు. స్వామిరారా హిట్‌ అవ్వడంతో మళ్ళీ అలాంటి క్రైమ్‌ స్టోరీనే ఎంచుకున్న సుధీర్‌వర్మ ఈసారి దాన్ని ఆడియన్స్‌కి రీచ్‌ అయ్యేలా తియ్యడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. అక్కడక్కడ పేలిన కొన్ని కామెడీ డైలాగ్స్‌ తప్ప సినిమాలో డైలాగ్స్‌కి కూడా ఎలాంటి ప్రాధాన్యత లేదు. చాలా సాదా సీదా డైలాగులు, అవి కూడా ప్రేక్షకులకు నీరసం తెప్పించేలా చెప్పించారు. మ్యూజిక్‌ విషయానికి వస్తే స్వామిరారాకి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసిన సన్ని కూడా ఈ సినిమా విషయంలో శ్రద్ధ పెట్టలేదు. ఆడియో పరంగా ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. అలాగే విజువల్‌గా కూడా పాటలు ఇంప్రెస్‌ చెయ్యలేకపోయాయి. పాటల్ని కూడా ఇష్టమొచ్చినట్టు ప్లేస్‌ చెయ్యడం వల్ల పాట వస్తోందంటే ఆడియన్స్‌కి చిరాకు మొదలైనట్టే అనిపిస్తుంది. దానికి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతంత మాత్రంగానే వుంది. కొన్ని చోట్ల చాలా లౌడ్‌గా బాదుతున్నట్టు అనిపించింది తప్ప మ్యూజిక్‌ని ఎంజాయ్‌ చేసే విధంగా లేదు. క్లైమాక్స్‌కి ముందు వచ్చే బైక్‌, కార్‌ ఛేజ్‌ సినిమాకి ఎంతమాత్రం అవసరం లేకపోయినా గ్రాండియర్‌ కోసం తీసినట్టు అనిపిస్తుంది. దానికితోడు ఛేజ్‌ లెంగ్త్‌ కూడా ఎక్కువ కావడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. సెకండాఫ్‌లో మాణిక్యం ఆట కట్టించే ప్రయత్నంలో శ్రీను వైట్ల ఫార్మాట్‌లో వెళ్ళి పోలీస్‌ స్టేషన్‌ సెట్‌, కోర్టు సెట్‌, మీడియా సెటప్‌, జూనియర్‌ ఆర్టిస్టుల కోలాహలంతో హీరోకి మాత్రమే సాధ్యమయ్యే ట్రిక్కులతో విలన్‌ ఆట కట్టిస్తాడు. ఈ సినిమాలో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ విలన్‌గా నటించానని పోసాని ఎంత గర్వంగా చెప్పుకున్నా, ఈమధ్యకాలంలో అతను చేస్తున్నవన్నీ ఈ తరహా క్యారెక్టర్లే. కాకపోతే ఈ సినిమాలో చాలా చోట్ల గన్‌ వాడాడు. అదే తేడా. ఇక సెంటిమెంట్‌ సీన్స్‌ విషయానికి వస్తే నాగచైతన్యకు తండ్రిగా నటించిన రావు రమేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూస్తే నటిస్తున్నాడు అని తెలిసిపోతుంది తప్ప అతను చేసిన సీన్స్‌లో సెంటిమెంట్‌ అనేది ఎక్కడా పండలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడియన్స్‌కి కలవరపెట్టే ఎన్నో మైనస్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. 

విశ్లేషణ: స్వామిరారా చిత్రాన్ని చూసి అద్భుతం అనుకున్న ఆడియన్స్‌ సుధీర్‌వర్మ చేసిన మరో అద్భుతం అని వెళ్తే నిరాశ తప్పదు. నాగచైతన్యతో క్రైమ్‌ యాక్షన్‌ మూవీని స్టైలిష్‌గా తియ్యాలని ప్రయత్నించిన సుధీర్‌వర్మ ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయాడని చెప్పాలి. స్టైలిష్‌గా అనిపించే కొన్ని సీన్స్‌, కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌, కొంత కామెడీని మాత్రం ఎంజాయ్‌ చెయ్యాలనుకునేవారు ఈ సినిమా చూడొచ్చు. రాబరీ సీన్‌, ఆ తర్వాత వచ్చే కొన్ని చిన్న చిన్న దొంగతనాలు, హీరోయిన్‌ ఎంట్రీ, హీరోహీరోయిన్‌ లవ సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ కాస్త ప్లెజెంట్‌గా అనిపించినా కథ అనేది లేకపోవడం వల్ల ఏ సీన్‌కి ఆ సీన్‌ తీసినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ని ఒక పెద్ద ట్విస్ట్‌లా చూపించినా సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో కొంత ఊహించిన విధంగానే జరిగింది. సెకండాఫ్‌లో ఇంకా ఏదో పెద్ద ట్విస్ట్‌ వుంటుందని థియేటర్‌లోకి వెళ్ళిన ప్రేక్షకుడు నిరాశగా బయటికి రావాల్సి వస్తుంది. ఈ సినిమా ప్రొడక్షన్‌ వాల్యూస్‌ గురించి చెప్పుకోవాలంటే ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని కొత్త లొకేషన్స్‌ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమా కేవలం ఎ సెంటర్స్‌లో మాత్రమే టైమ్‌పాస్‌ కోసం ఏదో ఒక సినిమా చూడాలనుకునే ఆడియన్స్‌కి మాత్రమే నచ్చుతుంది. స్వామిరారా చూడనివారికి ఈ సినిమా కొత్తగా అనిపించే అవకాశం వుంది. కథ కంటే, ఆర్టిస్టుల కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌నే ఎక్కువగా కోరుకుంటున్న ఈ తరుణంలో ఇలాంటి స్టైలిష్‌ మూవీ కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో చెప్పలేం. 

ఫినిషింగ్‌ టచ్‌: కథ లేకుండా ‘దోచేయ్‌’

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs