Advertisement

సినీజోష్‌ రివ్యూ: ఓకే బంగారం


మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

Advertisement

ఓకే బంగారం

నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌, నిత్యమీనన్‌, ప్రకాష్‌రాజ్‌, 

లీలా శామ్సన్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌

ఎడిటింగ్‌: శ్రీకర ప్రసాద్‌

నిర్మాత: దిల్‌రాజు

రచన, దర్శకత్వం: మణిరత్నం

విడుదల తేదీ: 17.04.2015

భారతీయ సినిమాలో మణిరత్నం కి ఒక విశిష్టమైన స్థానం వుంది. ఆ సినిమాలతో ఇతర దర్శకుల సినిమాలను పోల్చలేం. ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించిన మణిరత్నం కూడా కొన్ని ఫ్లాప్‌ సినిమాలు చేశారు. అయితే ఫ్లాప్‌ అయిన సినిమాలు ఎందుకు ఫ్లాప్‌ అయ్యాయనే విషయం తెలుసుకోవడం కోసం సినిమాకి వెళ్ళే అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. కథాంశం ఏదైనా తనదైన మార్క్‌ మణిరత్నం సినిమాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు, ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించడంలో ఆయనకి ఆయనే సాటి. దర్శకుడుగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి 25 సంవత్సరాలు దాటిపోయినా ఎప్పటికప్పుడు జనరేషన్‌తోపాటు తనూ అప్‌డేట్‌ అవుతూ ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టు సినిమాలు చేస్తూ యూత్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిపించుకుంటున్నారు. లేటెస్ట్‌గా ‘ఓకే బంగారం’ అనే కొత్త తరహా ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దుల్కర్‌ సల్మాన్‌, నిత్యమీనన్‌ జంటగా రూపొందిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం, పి.సి.శ్రీరామ్‌ ఫోటోగ్రఫీ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మణిరత్నం గత చిత్రాల స్థాయిలో వుందా? మణిరత్నం తీసే ప్రేమకథా చిత్రాలను ప్రేమించే ప్రేక్షకులను ‘ఓకే బంగారం’ ఎంతవరకు ఆకట్టుకుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: కథగా చెప్పాలంటే చాలా చిన్న పాయింట్‌. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెళ్ళి మీద సదభిప్రాయం లేని జంట పెళ్ళి వరకు ఎలా వెళ్ళిందనేది కథ. ఆదిత్య(దుల్కర్‌ సల్మాన్‌) ఒక గేమింగ్‌ ప్రోగ్రామర్‌. తను పనిచేస్తున్న కంపెనీకి ఒక కొత్త గేమ్‌ కాన్సెప్ట్‌ని చెప్తాడు. అది అప్రూవ్‌ అయితే అమెరికా వెళ్ళిపోవాలన్నది అతని ప్లాన్‌. జీవితంలో పెళ్ళి అనేది ఒక ట్రాష్‌ అని అతని నమ్మకం. తార(నిత్యమీనన్‌) ఒక ఆర్కిటెక్చర్‌. తన రీసెర్చ్‌ కోసం దేశంలోని వివిధ ప్రదేశాలను సందర్శిస్తుంటుంది. తన రీసెర్చ్‌ కోసం పారిస్‌ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో జాయిన్‌ అవ్వాలన్నది ఆమె కల. తన తల్లిదండ్రులు ఎప్పుడూ కలహించుకోవడం చూసిన ఆమె జీవితంలో పెళ్ళి చేసుకోకూడదనుకుంటుంది. ఈ ఇద్దరూ ముంబై రైల్వే స్టేషన్‌లో అనుకోకుండా కలుసుకుంటారు. ఇద్దరూ చాలా ఫాస్ట్‌గా ఫ్రెండ్స్‌ అయిపోతారు. ఆరు నెలల్లో ఫారిన్‌ వెళ్ళిపోవాలన్నది ఇద్దరి ప్లాన్‌. అయితే ఈ ఆర్నెల్లు సహజీవనం చేద్దామని అంతకంటే ఫాస్ట్‌గా డిసైడ్‌ అయిపోతారు. గణపతి(ప్రకాష్‌రాజ్‌), భవాని(లీలా శామ్సన్‌) అనే ఇద్దరు వృద్ధ జంట ఇంటిలో ఆదిత్య గెస్ట్‌గా వుంటాడు. వారిని ఒప్పించి అదే ఇంటికి తారని తీసుకొస్తాడు. అలా స్టార్ట్‌ అయిన ఆదిత్య, తారల లివింగ్‌ రిలేషన్‌ ఎన్ని మలుపులు తిరిగింది. వారి రిలేషన్‌ లివింగ్‌ వరకే పరిమితమైందా? పెళ్ళి వరకూ వెళ్ళిందా? పెళ్ళి అంటే సదభిప్రాయం లేని వాళ్ళిద్దరూ ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు? అనేది మిగతా కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: కథ, కాన్సెప్ట్‌ పాతదే అయినా తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో, విజువల్స్‌తో, యూత్‌ని ఆకట్టుకునే చిన్న చిన్న డైలాగ్స్‌తో మెస్మరైజ్‌ చేశారు మణిరత్నం. ఇప్పటి యూత్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ పాత కథని మలచడంలో తన మార్క్‌ని చూపించారు మణిరత్నం. సినిమా మొదలైన 15 నిముషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కథ ముందుకు వెళ్ళకపోయినా క్యూట్‌ దృశ్యాలతో, ఆసక్తి కలిగించే మాటలతో, కనువిందు చేసే పాటలతో ఫస్‌ హాఫ్‌ అంతా నడిపించారు. మణిరత్నం ఎంత పకడ్బందీగా కథ, స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్నారో.. దానికి తగ్గట్టుగానే దుల్కర్‌, నిత్యమీనన్‌ల పెర్‌ఫార్మెన్స్‌ కూడా వుంది. ప్రజెంట్‌ యూత్‌ని రిప్రజెంట్‌ చేసే విధంగా దుల్కర్‌ చాలా అద్భుతంగా తన పెర్‌ఫార్మెన్స్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ వుంది. తారగా నిత్యమీనన్‌ అమేజింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చింది. ప్రకాష్‌రాజ్‌, లీలా శ్యామ్సన్‌ మధ్య వచ్చే సెంటిమెంట్‌, ఎమోషనల్‌ సీన్స్‌ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు మణిరత్నం. 

మైనస్‌ పాయింట్స్‌: పెళ్ళంటే ఇష్టంలేని జంటలను పెళ్ళి వరకు తీసుకెళ్ళే కథలు ఇప్పటివరకు చాలా వచ్చాయి. ఆ జంటలను కలపడానికి మరో జంటను ఆదర్శంగా చూపించే సినిమాలు కూడా చాలా వచ్చాయి. కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమీలేదు. ప్రస్తుతం ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాలో కనిపించదు. సిట్యుయేషన్‌కి తగ్గట్టు హీరో, హీరోయిన్‌ చెప్పే డైలాగుల్లోనే మనం ఎంటర్‌టైన్‌మెంట్‌ని వెతుక్కోవాలి. 2 గంటల 38 నిముషాల సినిమాలో మనకి ఎక్కువగా కనిపించే పాత్రలు నాలుగే. ఎంటర్‌టైన్‌మెంట్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని మిక్స్‌ చేస్తూ వస్తున్న రెగ్యులర్‌ సినిమాలు చూసేవారికి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. పైగా కొన్ని సన్నివేశాలు రిపీటెడ్‌గా వుండడం కూడా సినిమాకి మైనస్‌ అయింది. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌: ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది పి.సి.శ్రీరామ్‌ ఫోటోగ్రఫీ గురించి. మణిరత్నంతో కొంత గ్యాప్‌ తర్వాత ఈ సినిమాకి పనిచేశారు శ్రీరామ్‌. మంచి ప్రేమకథని తియ్యాలంటే పి.సి.శ్రీరామ్‌లాంటి సినిమాటోగ్రాఫర్‌ ఎంతో అవసరం అని మరోసారి నిరూపించారు. మణిరత్నం విజువలైజేషన్‌ని అర్థం చేసుకొని దాన్ని స్క్రీన్‌ మీద ప్రజెంట్‌ చెయ్యడంలో పి.సి.శ్రీరామ్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. క్లోజప్‌ షాట్స్‌ని అద్భుతంగా తియ్యడంలో ఎక్స్‌పర్ట్‌ అయిన శ్రీరామ్‌ ఈ సినిమాలో అలాంటి షాట్స్‌ని లెక్కకు మించి చూపించారు. అతి అనేది ఎక్కడా లేకుండా పర్‌ఫెక్ట్‌ లైటింగ్‌తో సీన్‌లోని మూడ్‌ ఆడియన్స్‌కి రీచ్‌ అవ్వడంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే సినిమాలో పాటలు వున్నా, అవి వచ్చి వెళ్ళిన సంగతి కూడా అర్థం కానంతగా తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు రెహమాన్‌. ‘మాయేదో చెయ్యవా..’, ‘మన మన మన మెంటల్‌ మదిలో’, ‘అమాయకా’ పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అచ్చ తెలుగు పాటల్లా ఈ పాటల్ని రాయడం కూడా సినిమాకి మరో ఎస్సెట్‌ అయింది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి చెప్పాలంటే సీన్‌లోని ఎమోషన్‌ని, లవ్‌ని, సెంటిమెంట్‌ని తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో మరింత ఎలివేట్‌ చేశారు రెహమాన్‌. శ్రీకరప్రసాద్‌ ఎడిటింగ్‌ చాలా పర్‌ఫెక్ట్‌గా వుంది. కథ స్లోగా అనిపించినా, కొన్ని ఎలిమెంట్స్‌ మనం మిస్‌ అవుతున్నామని తెలిసినా ఆడియన్స్‌కి ఎక్కడా బోర్‌ కొట్టకుండా చాలా స్పీడ్‌గా రన్‌ అవ్వడానికి శ్రీకరప్రసాద్‌ ఎడిటింగ్‌ చాలా హెల్ప్‌ అయింది. 

విశ్లేషణ: అప్పట్లో ‘సఖి’ వంటి అందమైన ప్రేమకథని అప్పటి యూత్‌కి కనెక్ట్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయిన మణిరత్నం దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆ తరహా ప్రేమకథతో మరోసారి ప్రేమకథా చిత్రాలను ప్రేమించే వారికి విందు చేశారు. ఇప్పుడు వస్తున్న ప్రేమకథా చిత్రాల తీరు వేరు, ఆ చిత్రాలు చేసే దర్శకుల దారి వేరు. ప్రేమకథ అంటే ఇంత సున్నితంగా వుండాలి, ప్రేమ సన్నివేశాలు ఇంత హృద్యంగా వుండాలి అని మరోసారి తీసి చూపించారు మణిరత్నం. ఈ చిత్రంలో హీరో ప్రొఫెషన్‌ గేమ్‌ ప్రోగ్రామర్‌ కావడం ప్రజెంట్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. హీరోయిన్‌ ప్రొఫెషన్‌ ఏదైనప్పటికీ ఆ పాత్ర చేసిన నిత్యమీనన్‌ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. హీరో, హీరోయిన్‌ పరిచయం, వారి మధ్య ఏర్పడే ఫ్రెండ్‌షిప్‌, ఆ తర్వాత లివింగ్‌ రిలేషన్‌.. వీటన్నింటితో ఫస్ట్‌ హాఫ్‌ ఫాస్ట్‌గా అయిందనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి వారి రిలేషన్‌ కంటిన్యూ అవుతూనే వారి బంధం ఎంత బలంగా మారింది అనే సన్నివేశాలు, గణపతి, భవానిల మధ్య వచ్చే సెంటిమెంట్‌ సీన్స్‌, వారి కోసం హీరోహీరోయిన్లు టెన్షన్‌ పడే సీన్స్‌ సినిమా స్పీడ్‌కి కొంత బ్రేక్‌ వేసాయి. క్లైమాక్స్‌ కూడా ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేయడం కూడా ఆడియన్స్‌కి అంతగా రుచించదు. ఈ సినిమాకి కనెక్ట్‌ అయ్యేవారు ఎంతమంది వున్నారో, సినిమాలోని కంటెంట్‌కి కనెక్ట్‌ అవ్వని వారు కూడా అంతే మంది వుంటారు. ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా మంచి ప్రేమకథా చిత్రాన్ని చూడాలనుకునేవారు ‘ఓకే బంగారం’ చూడొచ్చు.

ఫినిషింగ్‌ టచ్‌: ఓకే అనిపించుకున్న బంగారం

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement