యు.వి. క్రియేషన్స్
జిల్
నటీనటులు: గోపీచంద్, రాశిఖన్నా, కబీర్, అవసరాల శ్రీనివాస్,
బ్రహ్మాజీ, అమిత్‌కుమార్, పోసాని తదితరులు
సినిమాటోగ్రఫీ: శక్తి శరవణన్
సంగీతం: జిబ్రాన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాధాకృష్ణకుమార్
విడుదల తేదీ: 27.03.2015
యు.వి. క్రియేషన్స్ బేనర్‌లో ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో కొత్త దర్శకుల్ని పరిచయం చేసిన వంశీ, ప్రమోద్ తమ మూడో చిత్రానికి కూడా కొత్త దర్శకుడ్నే ఎన్నుకున్నారు. గోపీచంద్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో నిర్మించి యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జిల్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘లౌక్యం’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తర్వాత గోపీచంద్ చేసిన ‘జిల్’ ఎంతవరకు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసింది? యు.వి. క్రియేషన్స్‌లో మూడో సినిమాగా వచ్చిన ‘జిల్’ హ్యాట్రిక్‌ని అందించిందా? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.
కథ: ఓపెన్ చేస్తే ముంబయిలో ఆరోజు పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా ఎలర్ట్‌గా వుంది. మాఫియా డాన్ ఛోటా నాయక్(కబీర్)ను కోర్టులో ప్రవేశపెట్టే రోజు. అతన్ని కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. కట్ చేస్తే హైదరాబాద్‌లో జై(గోపీచంద్) ఒక ఫైర్ ఆఫీసర్. విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రమాదంలో వున్న వారిని కాపాడతాడు. ఆ క్రమంలో సూసైడ్ చేసుకోబోతున్న హీరోయిన్ సావిత్రి(రాశిఖన్నా)ని కాపాడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఇద్దరూ లవ్‌లో పడతారు. కట్ చేస్తే పోలీసుల నుంచి తప్పించుకున్న ఛోటా నాయక్ రంగనాథ్(బ్రహ్మాజీ) అనే వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రంగనాథ్ అతన్ని మోసం చేసి వెయ్యి కోట్ల రూపాయలు కాజేయడమే కాకుండా అప్రూవర్‌గా మారుతున్నాడని తెలుసుకున్న ఛోటా అతని కోసం సెర్చింగ్ మొదలుపెడతాడు. రంగనాథ్ వున్న హోటల్‌లో అగ్నిప్రమాదం జరగడంతో అతను చనిపోతాడు. అతన్ని కాపాడే క్రమంలో జైకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు రంగనాథ్. అది టి.వి.లో చూసిన ఛోటా జైని టార్గెట్ చేస్తాడు. చనిపోయే ముందు రంగనాథ్ ఏం చెప్పాడు, తన వెయ్యికోట్లు ఎక్కడ వున్నాయి ఈ ప్రశ్నలతో జైని టార్చర్ పెడుతుంటాడు ఛోటా. నిజంగానే జైకి రంగనాథ్ ఏమైనా చెప్పాడా? ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయో జైకి తెలుసా? తన డబ్బు దక్కించుకోవడం కోసం జై కి, అతని కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు? ఛోటాని జై ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: ఇప్పటి వరకు మన హీరోలను పోలీస్ ఆఫీసర్లుగా, మిలటరీ ఆఫీసర్లు, నేవీ ఆఫీసర్లుగా.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లలో పవర్‌ఫుల్ ఆఫీసర్స్‌గా చూశాం. ఫస్ట్ టైమ్ ఒక పవర్‌ఫుల్ ఫైర్ ఆఫీసర్ని మనకి పరిచయం చేశాడు డైరెక్టర్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు ప్రతి షాట్‌ని ఎంతో స్టైలిష్‌గా తీశాడు డైరెక్టర్. కథ మనం ఇంతకుముందు చూసినట్టుగానే అనిపించినా దాన్ని కొత్తగా చూపించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. గోపీచంద్ పెర్‌ఫార్మెన్స్ కొత్తగా వుండడమే కాకుండా, చాలా స్టైలిష్‌గా కూడా వుంది. హీరోయిన్ రాశి ఖన్నా కూడా అందంతోపాటు తన అభినయంతో ఆకట్టుకుంటుంది. విలన్‌గా నటించిన కబీర్ చాలా నేచురల్‌గా చేశాడు. ఒక కొత్త ఆర్టిస్ట్‌ని చూస్తున్న ఫీల్ రాకుండా క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ చేశాడు. రెగ్యులర్‌గా వుండే కమెడియన్స్ ఈ సినిమాలో లేరు. మధ్య మధ్య ప్రభాస్ శ్రీను, పోసానిల కామెడీ, హీరో, హీరోయిన్‌ల ఫ్యామిలీ సీన్స్‌లో వచ్చే కామెడీ బాగుంది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కి వస్తే శక్తి శరవణన్ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం అని చెప్పాలి. ప్రతి సీన్‌ని చాలా ఆందంగా, ఫ్రెష్‌గా చూపించాడు. ఫైట్స్‌లో కూడా కొత్తదనాన్ని, ఫ్రెష్‌నెస్‌ని చూపించిన అనల్ అరసును అభినందించాలి. ముఖ్యంగా రెయిన్ ఫైట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా చాలా పెర్‌ఫెక్ట్‌గా ఎలాంటి ల్యాగ్ లేకుండా చేశారు. జిబ్రాన్ చేసిన పాటలు వినడానికి కొత్తగా వున్నాయి. అలాగే విజువల్‌గా కూడా చాలా బాగా తీశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్: డైరెక్టర్ టేకింగ్, హీరో పెర్‌ఫార్మెన్స్ స్టైలిష్‌గా వున్నప్పటికీ తెలుగు సినిమాల్లో ఇలాంటి కథలు కోకొల్లలుగా వచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ ఎక్కువ కావడం కొంత బోర్ కొట్టించింది. ఫస్ట్ హాఫ్‌లో కథలో ఎలాంటి కదలిక లేకుండా జరిగే సన్నివేశాలు చాలా వుంటాయి. సెకండాఫ్‌లో హీరో ఇంట్లో ప్రభాస్ శ్రీను, పోసాని చేసిన కామెడీ బోర్ కొట్టించింది. ఈ టోటల్ సీన్ సినిమాలో పెద్ద మైనస్ అని చెప్పాలి. హీరో పవర్‌ఫుల్ ఆఫీసర్, పవర్‌ఫుల్ విలన్ వీరిద్దరి మధ్య జరుగుతున్న పోరాటం. విలన్ వల్ల హీరోకి నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు క్లైమాక్స్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా వుండాలి. కానీ, చాలా సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. థియేటర్ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్ ఒక అద్భుతమైన క్లైమాక్స్ చూశాం అన్న ఫీల్‌తో కాకుండా సినిమా ఓకే అనే ఫీల్‌తో బయటికి వస్తారు.
విశ్లేషణ: కొత్త కథ కాదు, కథనం కూడా కొత్తది కాదు. అయినా డైరెక్టర్ రాధాకృష్ణ టేకింగ్, గోపీచంద్ స్టైలిష్ పెర్‌ఫార్మెన్స్, మంచి పాటలు, కథకు తగినట్టుగా వుండే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్ రాశి ఖన్నా గ్లామర్ వెరసి ‘జిల్’ ఒక మంచి సినిమా అనిపించుకుంది. ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్ మధ్య జరిగే సీన్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూ, సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో, విలన్ మధ్య జరిగే ఛాలెంజెస్‌తో ఫాస్ట్ వెళ్తుంది సినిమా. సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. రొటీన్ ఫార్ములాతో వచ్చిన ‘జిల్’లో వున్న కొన్ని టెక్నికల్ హైలైట్స్, హీరో పెర్‌ఫార్మెన్స్, డైరెక్టర్ స్టైలిష్ టేకింగ్ ఆడియన్స్‌కి నచ్చుతాయి. ‘జిల్’తో యు.వి. క్రియేషన్స్ హ్యాట్రిక్ కొట్టిందని చెప్పాలి. గోపీచంద్ ఖాతాలో మరో కమర్షియల్ హిట్‌ని వేసుకున్నాడు. ఫైనల్‌గా యాక్షన్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వున్న ‘జిల్’ని ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడొచ్చు.
ఫినిషింగ్ టచ్: స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్
సినీజోష్ రేటింగ్: 3/5