గోల్డెన్ టైమ్ పిక్చర్స్
కాలింగ్ బెల్
నటీనటులు: రవివర్మ, వ్రితి ఖన్నా, మమత రహుత్, సంకీర్త్,
నరేష్, లక్కీ, వంశీ తదితరులు
సినిమాటోగ్రఫీ: వివేక్ ఎస్.కుమార్
సంగీతం: సుకుమార్ పి.
ఎడిటింగ్: దీపు
నిర్మాత: అనూద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్
విడుదల తేదీ: 21.03.2015
యాక్షన్ మూవీస్, ఫ్యాక్షన్ మూవీస్, కామెడీ మూవీస్, లవ్ స్టోరీస్..ఇలా తెలుగు సినిమా ట్రెండ్ మారుతూ ప్రస్తుతం హార్రర్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల హార్రర్ స్టోరీస్‌తో సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై పన్నా రాయల్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ అనూద్ నిర్మించిన మరో హార్రర్ థ్రిల్లర్ ‘కాలింగ్ బెల్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకుల్ని భయపెట్టింది? ఏమేర ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిందీ తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
కథ: కార్తీక్(రవివర్మ), వైశాలి(మమత రహుత్) కొత్తగా పెళ్ళయిన జంట. ఒకర్ని విడిచి మరొకరు వుండలేనంత ప్రేమగా వారిద్దరూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ వుంటారు. కార్తీక్‌కి ఓరోజు ఓ స్వామీజీ(సమ్మెట గాంధీ) తారసపడి నువ్వు ఒక పిశాచితో కాపురం చేస్తున్నావని, ఆమె వల్ల నీ చావు తప్పదని కార్తీక్‌ని హెచ్చరిస్తాడు. దాన్ని కార్తీక్ నమ్మక పోవడంతో అతను ఇంట్లో లేని సమయంలో అతని భార్య ఎలా ప్రవర్తిస్తుందో ప్రత్యక్షంగా చూపిస్తాడు. అదే రాత్రి వైశాలి తన భయానక చేష్టలతో కార్తీక్‌ని చంపే ప్రయత్నం చేస్తుంది. ఆ టైమ్‌లో స్వామీజీ వచ్చి అడ్డుకుంటాడు. కార్తీక్, స్వామీజీ కలిసి వైశాలిని హతమార్చి ఆ ఇంటి గార్డెన్‌లోనే నిలువునా పాతేస్తారు. ఇక ఆ ఇంట్లో ఎవరూ వుండొద్దని స్వామీజీ చెప్పడంతో కార్తీక్ ఆ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వచ్చేస్తాడు. కట్ చేస్తే కార్తీక్ తమ్ముడైన విశాల్(నరేష్) అన్నయ్యకు తెలియకుండా తన స్నేహితులు అమర్(సంకీర్త్), హర్ష(వంశీ), నిషా(లక్కీ), రియా(వ్రితి ఖన్నా)లతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఆ ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో వున్న ఆత్మవల్ల ఈ ఐదుగురు స్నేహితులకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? వాటిని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు? చివరికి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారా? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ సినిమాల్లో ఇదో కొత్త తరహా కథ అని చెప్పవచ్చు. కథ కంటే కథనంతో ఆడియన్స్‌ని కట్టి పడేశాడు డైరెక్టర్. ప్రతి సీన్‌లో టెన్షన్ క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. దానికి ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ కూడా బాగా హెల్ప్ అయింది. స్నేహితులుగా నటించిన ఐదుగురు, రవివర్మ, మమత రహుత్ పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. డేలో గానీ, నైట్ ఎఫెక్ట్‌లోగానీ వివేక్ అందించిన ఫోటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది. సుకుమార్ చేసిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా, సిట్యుయేషన్‌కి తగ్గట్టు చేసిన రీ`రికార్డింగ్ ఆడియన్స్‌ని భయపెట్టింది. చాలా సన్నివేశాల్లో ఆడియన్స్‌ని ఉలిక్కిపడేలా చాలా ఎఫెక్టివ్‌గా తీసిన సీన్స్‌కి కూడా ఆర్.ఆర్. చాలా హెల్ప్ అయింది.
మైనస్ పాయింట్స్: కథ ఓకే, కథనం ఓకే. కానీ, రెండు గంటల సేపు ఆడియన్స్‌ని కూర్చోబెట్టే ప్రయత్నంలో అనవరమైన చాలా సన్నివేశాల్ని జోడిరచడంతో చాలాచోట్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండాఫ్‌లో ఏం జరగబోతుందో ఆడియన్స్ ఊహించడం కొంచెం కష్టమే అయినప్పటికీ దాన్ని కొనసాగించడానికి, సినిమా నిడివి పెంచడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నంలో చాలా తప్పులు జరిగాయి. ఒక ఆత్మ ఆ ఐదుగురు స్నేహితుల్లో ఒక అమ్మాయిని ఆవహించడం ఇంటర్వెల్ బ్యాంగ్‌గా చూపించి, దాని వల్ల మిగతా స్నేహితులు పడే ఇబ్బందులతో క్లైమాక్స్ వరకు నడిపారు. దాంతో సినిమాకి డైరెక్టర్ ఎలాంటి కన్‌క్లూజన్ ఇస్తాడా అని ఆడియన్స్ ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. కథ, కథనాల్లో తీసుకున్న శ్రద్ధ ఆడియన్స్ బోర్ ఫీల్ అవకుండా ఫాస్ట్‌గా సినిమాని నడిపించడంలో తీసుకోలేకపోయారు. మధ్యలో నల్ల వేణు, చలాకి చంటి, షకలక శంకర్ చేసిన కామెడీ ఆడియన్స్‌కి విసుగు పుట్టించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు ఒక్కో సీన్‌కి ఎక్కువ టైమ్ తీసుకోవడం కూడా సినిమాకి మైనస్ అయింది.
విశ్లేషణ: ఒక కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీసి ఆడియన్స్‌ని మెప్పించాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నం అభినందించాలి. ఎందుకంటే తనకు వున్న బడ్జెట్ లిమిట్స్‌లో క్వాలిటీగా సినిమా తియ్యడానికి ట్రై చేశాడు. ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఆడియన్స్‌ని ఎక్కువగా భయపెట్టిన సినిమా ఇదే అని చెప్పాలి. ఆమధ్య వచ్చిన ‘కాంచన’ చిత్రాన్ని చూసి ఆడియన్స్ ఎంత భయపడ్డారో, ఈ సినిమాకి తగ్గట్టు ఆడియన్స్‌ని భయపెట్టే ప్రయత్నం చేశారు. బడ్జెట్ లిమిట్ వల్ల పెద్ద సినిమా రేంజ్‌లో గ్రాఫిక్స్‌గానీ, స్పెషల్ ఎఫెక్ట్స్‌గానీ చేసే వీలు లేకపోవడం వల్ల ఉన్నంతలో బాగానే చేశారని చెప్పాలి. ఆడియన్స్ ఊహించని క్లైమాక్స్ అయినప్పటికీ దాన్ని మరింత ఎఫెక్టివ్‌గా చూపించడానికి సోర్స్ లేకపోవడంతో క్లైమాక్స్ అయిందనిపించారు. రెండు గంటల సేపు ఆడియన్స్‌ని సినిమాలో ఇన్‌వాల్వ్ చెయ్యాలన్న ప్రయత్నంలో డైరెక్టర్ అక్కడక్కడా తడబడినా ఫైనల్‌గా సినిమా ఓకే, ఒకసారి చూడొచ్చు అనిపించేలా తియ్యగలిగాడు. ‘కాలింగ్ బెల్’ అనే టైటిల్ వల్ల, మౌత్ టాక్ వల్ల సినిమా ఫర్వాలేదు అన్న టాక్ వినిపిస్తోంది.
ఫినిషింగ్ టచ్: హార్రర్ చిత్రాల్లో మరో కొత్త ప్రయత్నం
సినీజోష్ రేటింగ్: 2.5/5