స్వప్న సినిమా
ఎవడే సుబ్రమణ్యం?
నటీనటులు: నాని, విజయ్, మాళవిక నాయర్, రీతు వర్మ,
కృష్ణంరాజు, నాజర్ తదితరులు
కెమెరా: రాకేష్, నవీన్‌్
సంగీతం: రధన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: ప్రియాంక దత్
దర్శకత్వం: నాగ్ అశ్విన్
విడుదల తేదీ: 21.03.2015
ఈమధ్యకాలంలో సరైన హిట్ రాక అవస్త పడుతున్న హీరో నానికి హిమాలయాల్లోని దూద్ కాశి వెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ కథ దొరికింది. ‘ఎవడే సుబ్రమణ్యం?’ పేరుతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక్ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం నానికి హిట్‌ని అందించిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: ఓపెన్ చేస్తే సుబ్రమణ్యం(నాని) ఓ చేత్తో కొండను పట్టుకొని, మరో చేత్తో బూస్ట్ డబ్బాని పట్టుకొని వేలాడుతూ కనిపిస్తాడు. అసలు తను అలా ఎందుకు వేలాడాల్సి వస్తోందో తెలుసుకోవడానికి మనల్ని ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్తాడు. డబ్బు సంపాదించడమే అతని ధ్యేయం, ప్రాక్టికల్ లైఫ్ అంటే అతనికి ఇష్టం. డబ్బు సంపాదించి గొప్పవాడు అవ్వడానికి ఏదైనా చెయ్యడానికి సిద్ధపడే మనస్తత్వం. ఇది చిన్నతనంలో అతని మనసులో బలంగా నాటుకుంది. అతని స్నేహితుడు(రిషి). ఎప్పుడూ జాలీగా వుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయపడే మనస్తత్వం కలవాడు. చిన్నతనంలో తెలుగు మాస్టారి మాటలకు ఇన్‌స్పైర్ అయి హిమాలయాల్లోని దూద్‌కాశికి వెళ్ళాలన్నదే తన జీవితాశయంగా పెట్టుకుంటాడు. ఇదిలా వుంటే పశుపతి(నాజర్) కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. ఎన్నో కంపెనీలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న పశుపతి కన్ను రామయ్య(కృష్ణంరాజు) కంపెనీమీద పడుతుంది. దాన్ని దక్కించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు. తన తెలివితేటలతో ఆ కంపెనీని పశుపతికి వచ్చేలా చేస్తాడు సుబ్రమణ్యం. దాంతో తన కూతురు రియా(రీతు వర్మ)ను సుబ్బుకి ఇచ్చి పెళ్ళి చేయడానికి నిర్ణయించుకుంటాడు పశుపతి. డబ్బు ప్రధానం కాదని, ముందు నువ్వు ఎవరో తెలుసుకోమంటాడు సుబ్బు స్నేహితుడు రిషి. వారికి ఆనంది(మాళవిక నాయర్) పరిచయమవుతుంది. ముగ్గురూ మంచి స్నేహితులవుతారు. కొన్ని సంఘటనల తర్వాత సుబ్బు స్నేహితుడు రిషి ఓ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. రిషి అస్తికల్ని అతనికి ఎంతో ఇష్టమైన దూద్ కాశీలో కలపాలని సుబ్బు, ఆనంది హిమాలయాలకు బయల్దేరతారు. సుబ్బు ప్రేమలో పడుతుంది ఆనంది. సుబ్బు, ఆనంది అనుకున్నట్టుగా రిషి అస్తికలు దూద్‌కాశీ వరకు తీసుకెళ్ళారా? డబ్బే ప్రధానం అనుకునే సుబ్బులో మార్పు వచ్చిందా? రియా, ఆనందిలను ఇష్టపడే సుబ్బు చివరికి ఎవరిని పెళ్ళి చేసుకున్నాడు అనేది కథ.
ప్లస్ పాయింట్స్: హిమాలయాల్లోని దూద్‌కాశిని కథలో ఇన్‌వాల్వ్ చేస్తూ రాసుకున్న కథ కొత్తగానే వుంది. రాకేష్, నవీన్‌ల ఫోటోగ్రఫి ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే రధన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే రీరికార్డింగ్ కూడా బాగుంది. నాని తన క్యారెక్టర్‌ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. రియాగా రీతు వర్మ ఓకే అనిపించుకుంది. హీరోయిన్‌గా మాళవిక నాయర్ లుక్స్ వైజ్‌గానీ, పెర్‌ఫార్మెన్స్ వైజ్‌గానీ హండ్రెడ్‌కి హండ్రెడ్ మార్కులు కొట్టేసింది. ఓ యాంగిల్‌లో శోభనలా, ఓ యాంగిల్‌లో నిత్యమీనన్‌లా కనిపించే మాళవికకు మంచి భవిష్యత్తు వుందని చెప్పొచ్చు. నాజర్, కృష్ణంరాజు క్యారెక్టర్లకు అంతగా ప్రాధాన్యత లేదు. విజువల్‌గా చూసుకుంటే సినిమా అంతా చాలా గ్రాండియర్‌గా కనిపిస్తుంది. హిమాలయాల్లోని అందమైన లొకేషన్స్‌ని ఎంతో అందంగా చూపించారు.
మైనస్ పాయింట్స్: ఇది యునీక్ సబ్జెక్ట్ ఏమీ కాదు. ఒక సాధారణమైన కథకి దూద్‌కాశిని లింక్ చేసి కొత్త తరహా చిత్రంగా చూపించే ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టుగా నేరేషన్ చాలా స్లోగా వుంటూ ఆడియన్స్‌కి చాలా బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ ఆడియన్స్‌కి రిలీఫ్‌నిస్తాయి తప్ప కథ ఊపందుకోదు. సుబ్బు, రిషి క్యారెక్టర్స్‌ని చూస్తుంటే ‘ఆర్య`2’లో నవదీప్, అల్లు అర్జున్ క్యారెక్టర్లు గుర్తొసాయి. రిషి క్యారెక్టర్ ఓవర్ యాక్టివ్‌గా వుంటూ తోటి క్యారెక్టర్లను ఇబ్బంది పెట్టడమే కాకుండా అప్పుడప్పుడు మనల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. కథలో విషయం అంతగా లేకపోయినా దూద్‌కాశీకి మనల్ని తీసుకెళ్ళడానికే ఆ బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నట్టు అనిపిస్తుంది.
విశ్లేషణ: రెండున్నర గంటల మనకు మూడు గంటల సినిమాగా అనిపిస్తుంది. అంటే అంత స్లో నేరేషన్‌తో సినిమా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్‌తో ఫర్వాలేదు అనింపించినా సెకండాఫ్‌కి వచ్చేసరికి మరింత బోర్ కొడుతుంది. సెకండాఫ్‌లో ఎక్కువ భాగం మంచు కొండలు, పచ్చని చెట్లే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి నుంచి స్టోరీ కదలదు. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండాఫ్‌లో ఏం జరగబోతోందో ఆడియన్స్‌కి ఇట్టే అర్థమైపోతుంది. సెకండాఫ్‌లో కామెడీ పార్ట్ కూడా తక్కువగా వుండడం వల్ల ఆడియన్స్‌కి సీట్లలో కూర్చోవడం కష్టమవుతుంది. సినిమా మొత్తంలో ఈజీగా 30 నిముషాలు కట్ చెయ్యాల్సిన అవసరం వుంది. కథ, కథనాల కంటే డైలాగ్స్ మీదే డైరెక్టర్ ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే బిజినెస్ డీల్స్, షేర్స్, కంపెనీల వ్యవహరాలు.. ఇవన్నీ కామన్ ఆడియన్‌కి అర్థమవడం కష్టం. పూర్తిగా ‘ఎ’ సెంటర్స్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది. బి, సి సెంటర్ల ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో లేవు. సినిమా రిజల్ట్ ఎలా వున్నప్పటికీ హిమాలయాల్లో ఎంతో రిస్క్‌తో ఈ సినిమాని తీసిన దర్శకనిర్మాతల్ని అభినందించాల్సిందే. హిమాలయాల్లోని అందమైన ప్రదేశాలు చూసే ఓపిక వుందీ అంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు.
ఫినిషింగ్ టచ్: ఈ సినిమా చూడాలంటే ఆడియన్స్‌కి ఓపిక ఎంతో అవసరం.
సినీజోష్ రేటింగ్: 2/5