Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: ఐ


ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమిటెడ్‌

Advertisement
CJ Advs

నటీనటులు: విక్రమ్‌, అమీ జాక్సన్‌, సురేష్‌గోపి, సంతానం తదితరులు

కెమెరా: పి.సి.శ్రీరామ్‌

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌

మాటలు: శ్రీరామకృష్ణ

ఎడిటింగ్‌: ఆంథోని

నిర్మాత: వి.రవిచంద్రన్‌

దర్శకత్వం: శంకర్‌

విడుదల తేదీ: 14.1.2015

జెంటిల్‌మేన్‌తో డైరెక్టర్‌గా పరిచయమై తన ప్రతి చిత్రాన్ని రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా రూపొందించే శంకర్‌ తన సినిమాల్లో టెక్నికల్‌గా ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. కథ, కథనంతోపాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమా రూపొందిస్తారు. అందుకే భారతదేశంలోని ప్రముఖ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా చియాన్‌ విక్రమ్‌ హీరోగా ఆస్కార్‌ ఫిలిమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై శంకర్‌ రూపొందించిన చిత్రం ‘ఐ’. ఈ చిత్రంపై ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలా హై రేంజ్‌లో వున్నాయి. దానికి తగ్గట్టుగానే పబ్లిసిటీ ముమ్మరంగా చెయ్యడంతో సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆడియన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. ఈమధ్యకాలంలో ప్రేక్షకులు అంతగా ఎదురుచూసిన సినిమా ఇదే. గతంలో విక్రమ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు’ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఐ’ చిత్రానికి ఎలాంటి రిజల్ట్‌ వచ్చింది? ఈ సినిమాలో శంకర్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేశాడు? విక్రమ్‌ తన క్యారెక్టర్‌కు ఎంతవరకు న్యాయం చేశాడు? ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ‘ఐ’ రీచ్‌ అయిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: ఓపెన్‌ చేస్తే పెళ్ళి మండపం నుంచి పెళ్ళికూతురు దియా(అమీ జాక్సన్‌)ను అష్టావక్రుడి రూపంలో వున్న లింగేష్‌(విక్రమ్‌) ఎత్తుకుపోతాడు. ఆమెను ఓచోట గొలుసులతో బంధిస్తాడు. ఫ్లాష్‌ బ్యాక్‌కి వెళ్తే లింగేష్‌ బాడీ బిల్డర్‌. తన కృషితో డా॥ వాసుదేవరావు(సురేష్‌గోపి) సహకారంతో మిస్టర్‌ ఆంధ్రా టైటిల్‌ గెలుచుకుంటాడు. మిస్టర్‌ ఇండియా పోటీలకు వెళ్ళాలని, ఆ టైటిల్‌ గెలుచుకోవాలని లింగేష్‌ ఆశయం. యాడ్‌ ఫిలింస్‌ చేసే దియా అంటే లింగేష్‌కి పిచ్చి ప్రేమ. ఆమె నటించిన యాడ్స్‌లోని  ప్రొడక్ట్స్‌ ఎవరికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని పట్టించుకోకుండా ప్రతి ప్రొడక్ట్‌ కొంటూ వుంటాడు. దియా విషయానికి వస్తే యాడ్‌ ఫిలింస్‌ చేస్తూ ఎంతో బిజీగా వుంటుంది. అయితే పెయిర్‌గా నటించే జాన్‌(ఉపేన్‌ పటేల్‌) దియాని లైంగికంగా వేధిస్తుంటాడు. తన కోరిక తీర్చమని టార్చర్‌ పెడుతుంటాడు. దానికి ఆమె ‘నో’ చెప్పడంతో ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా రోడ్డున పడేట్టు చేస్తాడు జాన్‌. దీంతో మిస్టర్‌ ఆంధ్రా అయిన లింగేష్‌ని ఆశ్రయిస్తుంది. అతన్ని మంచి మోడల్‌గా తయారు చేస్తానని చెప్తుంది. మిస్టర్‌ ఇండియా పోటీలను కూడా కాదనుకొని దియా కోసం మోడల్‌గా మారతాడు లింగేష్‌. వీరిద్దరూ చేసిన యాడ్స్‌కి విపరీతమైన స్పందన వస్తుంది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. లీ అని పిలిపించుకునే లింగేష్‌ మోడల్‌గా టాప్‌ లెవల్‌కి వెళ్ళిపోతాడు. ఉన్నట్టుండి లీ ఆరోగ్యం క్షీణిస్తుంది. రోజురోజుకీ కృశించిపోతూ అష్టావక్రుడిగా మారిపోతాడు. లీ అలా మారిపోవడానికి కారణం ఎవరు? అతన్ని ఎందుకు అలా మార్చారు? లీ ని ప్రేమించిన దియా మరొకరితో పెళ్ళికి ఎందుకు సిద్ధపడిరది? తనను అష్టావక్రుడిగా మార్చిన ఆ ‘కొంతమంది’పై లింగేష్‌ ఎలా పగతీర్చుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చెప్పుకోవాల్సింది ఒక్క విక్రమ్‌ గురించే చిత్రంలోని గెటప్స్‌కి తగ్గట్టుగా తన బాడీని మోల్డ్‌ చేసుకున్నాడు. మూడు సంవత్సరాలపాటు తన శరీరాన్ని అనే కష్టాలకు గురి చేశాడు. తను చేసే క్యారెక్టర్‌ కోసం ప్రాణం పెట్టే విక్రమ్‌ ఈ సినిమా కోసం అన్నంత పనీ చేసినట్టు కనిపించాడు. కండలు తిరిగిన బాడీ బిల్డర్‌గా, స్టైలిష్‌ మోడల్‌గా, అష్టావక్రుడిగా అతను చేసిన పెర్‌ఫార్మెన్స్‌, ఆ క్యారెక్టర్స్‌ని పండిరచడం కోసం తను పడిన తపన అమోఘం. ఒక పాత్ర కోసం అంత కష్టాన్ని ఇప్పటివరకూ ఎవరూ పడలేదు, భవిష్యత్తులో అంత కష్టపడతారన్న నమ్మకమూ లేదు. ఇక దియాగా అమీ జాక్సన్‌ బాగా చేసింది. కొన్ని యాంగిల్స్‌లో తమన్నాని గుర్తు తెచ్చిన అమీ తన క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేసింది. తను అంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో అందంగా కనిపించింది. వీరిద్దరి తప్పితే సినిమాలో చెప్పుకోదగ్గ పెర్‌ఫార్మెన్స్‌ ఎవరిదీ లేదు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌: భారీ టెక్నికల్‌ వేల్యూస్‌తో రిలీజ్‌ అయిన ఈ సినిమాలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఫోటోగ్రఫీ గురించి. ప్రతి సీన్‌ని అందంగా చిత్రీకరించడంలో సినిమాటోగ్రాఫర్‌ పి.సి.శ్రీరామ్‌ సక్సెస్‌ అయ్యారు. ముఖ్యంగా చైనా లొకేషన్స్‌ని చాలా అదదంగా చూపించారు. మ్యూజిక్‌ విషయానికి వస్తే ఇప్పటివరకు శంకర్‌ చేసిన సినిమాల్లో పాటలకు అంతగా ఆదరణ లభించని చిత్రమిదే. దానికి తగ్గట్టుగానే సాహిత్యం కూడా అర్థంపర్థం లేకుండా వుండడంతో ఆడియో మరింత బ్యాడ్‌ అయింది. ‘పూలనే కునుకేయమంట..’ పాట ఒక్కటే సినిమాలో చెప్పుకోదగ్గ పాట. విజువల్‌గా కూడా ఈ పాట చాలా బాగుంటుంది. గత శంకర్‌ సినిమాల స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ లేదనే చెప్పాలి. ఆర్ట్‌ డైరెక్టర్‌ ముత్తురాజ్‌ వర్క్‌ కూడా బాగుంది. ‘నువ్వుంటే నా జతగా..’ పాటకి అతను వేసిన సెట్‌ చాలా గ్రాండ్‌గా వుంది. ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయానికి వస్తే ఎలాంటి కొత్తదనం లేని విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. 

ప్లస్‌ పాయింట్స్‌

ఈ సినిమాకి వున్న ఒకే ఒక ప్లస్‌ పాయింట్‌ విక్రమ్‌ పెర్‌ఫార్మెన్స్‌

మైనస్‌ పాయింట్స్‌

కథ, కథనం

సాగదీసిన సన్నివేశాలు

కామెడీ లేకపోవడం

వెగటు పుట్టించే విలన్ల గెటప్స్‌

విశ్లేషణ: గతంలో విక్రమ్‌తో చేసిన ‘అపరిచితుడు’ చిత్రంలో స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ను బేస్‌ చేసుకొని కథ అల్లిన శంకర్‌ ఈ సినిమాలో ‘ఐ’ అనే వైరస్‌ను పాయింట్‌గా తీసుకొని దానిచుట్టూ కథ అల్లే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పటివరకు శంకర్‌ సినిమాల్లోకెల్లా అతి బలహీనమైన కథ, కథనాలతో ఈ సినిమా రూపొందింది. సినిమా స్టార్ట్‌ అయిన కొద్ది సేపటికే కథ ఏమిటో అర్థమైపోతుంది. దాన్ని ఎలా డీల్‌ చేశాడు, అందులో ఎలాంటి కొత్తదనం చూపించాడు అనే ఇంట్రెస్ట్‌తో కూర్చున్న ఆడియన్‌కి ప్రతి సీన్‌ పేలవంగా అనిపిస్తుంది. ఇది శంకర్‌ తీసిన సినిమా కాదనిపిస్తుంది. ఒక్కో ఫైట్‌ని దాదాపు 10 నిముషాలపైనే చూపించడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో సంతానం చెప్పిన కొన్ని డైలాగ్స్‌కి నవ్విన ఆడియన్స్‌ ఆ తర్వాత సినిమా అంతా నవ్వడం మర్చిపోయినట్టుగా కూర్చుండిపోతారు. సినిమా స్టార్ట్‌ అయిన క్షణం నుండి కంప్లీట్‌ అయ్యేవరకు ఏ దశలోనూ సినిమా మీద క్యూరియాసిటీ కలగదు. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే కథ తెలిసిపోవడంతో సినిమా ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమాలో చెప్పుకోదగ్గ ఒకే ఒక అంశం విక్రమ్‌ పెర్‌ఫార్మెన్స్‌. ఈ సినిమా కోసం అతను ఎంత కష్టపడ్డాడు అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. కథ, కథనం, డైరెక్షన్‌, మ్యూజిక్‌ వంటి విషయాలు పక్కన పెడితే విక్రమ్‌ కోసం సినిమా చూడాలనుకునేవారు మూడు గంటలు భరించడానికి సిద్ధమై వెళ్ళండి. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ సినిమాని ఫ్యామిలీ లేడీస్‌, పిల్లలు చూడడం చాలా కష్టం. ఈ సినిమాకి ముందు శంకర్‌ చేసిన ‘రోబో’ పిల్లల నుండి పెద్ద వారి వరకు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో మాత్రం అలాంటి అంశాలు ఏమీ లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్‌కి రావడం కూడా కష్టమే. ఆస్కార్‌ రవిచంద్రన్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నప్పటికీ కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఆడియన్స్‌కే కాదు శంకర్‌కి కూడా షాకిచ్చిన ‘ఐ’

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs