Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: గోపాల గోపాల


సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై. లిమిటెడ్‌, 

Advertisement
CJ Advs

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌

గోపాల గోపాల

నటీనటులు: వెంకటేష్‌,  పవన్‌కళ్యాణ్‌, శ్రీయ, మిథున్‌ చక్రవర్తి,

పోసాని కృష్ణమురళి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు

కెమెరా: జయనన్‌ విన్సెంట్‌

ఎడిటింగ్‌: గౌతంరాజు

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

మాటలు: బుర్రా సాయిమాధవ్‌

నిర్మాతలు: సురేష్‌, శరత్‌మరార్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిశోర్‌కుమార్‌ పార్థసాని

విడుదల తేదీ: 10.1.2015

మల్టీస్టారర్‌ మూవీస్‌ చెయ్యడానికి హీరోలు పెద్దగా ఆసక్తి చూపని ఈరోజుల్లో దానికి శ్రీకారం చుట్టాడు విక్టరీ వెంకటేష్‌. కమల్‌హాసన్‌తో ‘ఈనాడు’, మహేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలు చేసి మళ్ళీ మల్టీసారర్‌ మూవీస్‌కి ఊపు తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో చేసిన మరో మల్టీస్టారర్‌ ‘గోపాల గోపాల’. హిందీలో సూపర్‌హిట్‌ అయిన ‘ఓ మైగాడ్‌’ చిత్రానికి రీమేక్‌గా ప్రారంభమైన రోజు నుంచి ఈరోజు రిలీజ్‌ అయ్యే వరకు ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. కిశోర్‌ పార్థసాని దర్శకత్వంలో సురేష్‌, శరత్‌మరార్‌ నిర్మించిన ‘గోపాల గోపాల’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ రీమేక్‌ అయిన ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది? ఈ ఇద్దరు హీరోల అభిమానులను ఏమేరకు సంతృప్తి పరిచిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: గోపాల్రావు(వెంకటేష్‌) ఒక మధ్య తరగతి మనిషి. నాస్తికుడైన గోపాల్రావు దేవుడి కోసం భక్తులు వృధా ఖర్చులు చేస్తున్నారని బాధపడే వ్యక్తి. దేవుడ్ని పూజించని గోపాల్రావు కష్టంలో వున్న వారిని ఆదుకుంటాడు, ఆకలితో వున్నవారికి అన్నం పెడతాడు. అతను చేసే వ్యాపారం మాత్రం దేవుడు బొమ్మలు, విగ్రహాలు అమ్మడం. వాటిని అమ్మడం కోసం దేవుడి గురించి కల్లబొల్లి కబుర్లు చెప్పడానికి కూడా వెనకాడడు. భార్య మాత్రం నిత్యం దేవుడ్ని జపిస్తూ పూజలకు, పునస్కారాలకు గోపాల్రావు పర్సు ఖాళీ చేస్తుంటుంది. ఓరోజు సిద్ధేశ్వర మహరాజ్‌(పోసాని కృష్ణమురళి) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులంతా నిప్పుల్లో నడుస్తుంటారు. ఆ వరసలో గోపాల్రావు భార్య, కొడుకు కూడా వుంటారు. అది చూసి తట్టుకోలేని గోపాల్రావు నిప్పుల్లో నడవడానికి వచ్చిన వందలాది భక్తుల్ని తన మాటలతో చెల్లా చెదురు చేస్తాడు. దాంతో కోపోద్రిక్తుడైన సిద్ధేశ్వర గోపాల్రావుని శపిస్తాడు. అదే రాత్రి వచ్చిన భూకంపంలో ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరక్కపోయినా గోపాల్రావు విగ్రహాల షాపు మాత్రం పూర్తిగా ధ్వంసమైపోతుంది. దేవుడ్ని నిందించడం వల్లే ఇలా జరిగిందని తలో మాటా అంటారు. ఆ షాపుకు ఇన్స్యూరెన్స్‌ వుండడంతో తనకి జరిగిన నష్టాన్ని ఇవ్వాలని ఇన్స్యూరెన్స్‌ కంపెనీని ఆశ్రయిస్తాడు. ఇది ప్రకృతి బీభత్సం కాబట్టి యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ కిందికి వస్తుందని, అది తమ పాలసీలో లేదని తేల్చి చెబుతాడు ఇన్స్యూరెన్స్‌ ఆఫీసర్‌. దాంతో తనకి జరిగిన నష్టాన్ని దేవుడే చెల్లించాలంటూ కోర్టుకు ఎక్కుతాడు గోపాల్రావు. దేశంలో మత బోధలు చేసే స్వామీజీలను, మత పెద్దలను దోషులుగా పరిగణిస్తూ వారికి కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తాడు. ఆ నోటీసులు చూసి షాక్‌ అయిన స్వామీజీలు గోపాల్రావుని చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో మనిషి రూపంలో వచ్చిన దేవుడు అతన్ని రక్షిస్తాడు. దేవుడ్ని నమ్మని గోపాల్రావుని రక్షించడానికి ఆ దేవుడు ఎందుకు వచ్చాడు? దేవుడి మీద వేసిన కేసును గోపాల్రావు గెలిచాడా? ఈ విషయంలో దేవుడు ఎలాంటి సహాయం చేశాడు? ఈ సమస్య ఎలా పరిష్కారమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: మధ్యతరగతి వ్యక్తిగా, దేవుడ్ని నమ్మని నాస్తికుడిగా వెంకటేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. దేవుడ్ని, భక్తుల్ని నిందిస్తూనే తన వ్యాపారం కోసం దేవుడ్ని పొగుడుతూ విగ్రహాల్ని అంటగట్టే సీన్స్‌లో, కోర్టు సీన్స్‌లో, పవన్‌కళ్యాణ్‌ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌లో అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. మొదటి నుంచీ ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇందులో పవన్‌కళ్యాణ్‌ పాత్ర పరిమితమైందని సినిమా రిలీజ్‌కి ముందు పవన్‌ ఫ్యాన్స్‌కి అర్థమైంది. ఫస్ట్‌ హాఫ్‌ ఎండిరగ్‌లో ఎంటర్‌ అయిన పవన్‌కళ్యాణ్‌ దేవుడి పాత్రకి పర్‌ఫెక్ట్‌ సూట్‌ అయ్యాడు. ప్రసన్న వదనంతో, ప్రశాంతంగా డైలాగ్స్‌ చెప్తూ మోడ్రన్‌ గాడ్‌గా అందర్నీ ఆకట్టుకున్నాడు. లీలాధర స్వామి పాత్రలో మిథున్‌ చక్రవర్తి  జీవించాడని చెప్పాలి. ఒరిజినల్‌ వెర్షన్‌లో కూడా ఈ పాత్రని అతనే చేశాడు. తనకి డైలాగ్స్‌ తక్కువగా వున్నప్పటికీ, చూపుల్తో, బాడీ లాంగ్వేజ్‌తో ఆడియన్స్‌ని చాలా చోట్ల నవ్వించాడు. ఇక సిద్ధేశ్వర మహరాజ్‌ పాత్రకి పోసాని కృష్ణమురళి పూర్తి న్యాయం చేశాడు. బాబా వేషంలో కనిపించినప్పటికీ రెగ్యులర్‌గా అతను చేసే పెర్‌ఫార్మెన్సే ఇందులోనూ చేశాడు. అయితే అతను చేసిన ప్రతి సీన్‌ నవ్వు తెప్పించేదిగా వుంది. గోపాల్రావు భార్యగా నటించిన శ్రీయ పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ఆశిష్‌ విద్యార్థి, కృష్ణుడు, దీక్షా పంత్‌, రంగనాథ్‌ తమ క్యారెక్టర్స్‌కి తగ్గట్టుగా సాదా సీదాగా నటించారు. పృథ్వి కనిపించిన కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌: ఈ సినిమాకి ప్రాణం అన్నట్టుగా డైలాగ్స్‌ రాసి అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేసాడు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌. ప్రతి సీన్‌లోనూ కొత్త డైలాగ్స్‌ రాసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్స్‌, కోర్టులో వెంకటేష్‌ చెప్పే డైలాగ్స్‌ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. డైలాగ్స్‌కి డెఫినెట్‌గా థియేటర్‌లో చప్పట్లు పడతాయి. జయనన్‌ విన్సెంట్‌ ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా వుంది. ప్రతి ఫ్రేమ్‌ ఎంతో రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్టిస్టుల్ని కూడా అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈమధ్య వచ్చిన పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్‌గా అనిపిస్తాడు. మ్యూజిక్‌ విషయానికి వస్తే రెగ్యులర్‌గా వచ్చే పాటలు కాకపోవడం, పాటలకు సరైన సిట్యుయేషన్స్‌ కూడా ఎక్కువ లేకపోవడంతో ఆడియో పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. అయితే వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌లపై తీసిన ‘భజే భజే’ పాట ఆడియో పరంగా, విజువల్‌గా కూడా బాగుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు అనూప్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కొత్తగా వుంది. ఇప్పటివరకు అనూప్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్స్‌కి ఇది పూర్తి భిన్నంగా వుందని చెప్పాలి. బ్రహ్మ కడలి చేసిన ఆర్ట్‌ వర్క్‌ కూడా బాగుండడం వల్ల ప్రతి సీన్‌ చాలా రిచ్‌గా కనిపించింది. గౌతంరాజు ఎడిటింగ్‌లో కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఇక డైరెక్టర్‌ విషయానికి వస్తే ఆల్రెడీ బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన కథను తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేశాడు. ఈ కాన్సెప్ట్‌ కొత్తదే అయినప్పటికీ దాన్ని పర్‌ఫెక్ట్‌ చెప్పడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. దాదాపు సినిమా అంతా హిందీ వెర్షన్‌లాగే తీసినప్పటికీ హిందీలో పండినంతగా తెలుగులో ఆ ఎమోషన్స్‌ పండలేదనే చెప్పాలి. టోటల్‌గా మాటల గారడీతోనే సినిమా నడిపించాడనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి వచ్చేసరికి చాలా అసహజంగా అనిపిస్తుంది. ఓపక్క గోపాల్రావు హాస్పిటల్‌లో వుండగానే అతని సమాధి కట్టేందుకు లీలాధర సిద్ధమవడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. గోపాల్రావు హాస్పిటల్‌లో వున్న కొద్దిరోజుల్లోనే దేశంలో ఊహకందని మార్పులు జరిగినట్టు చూపించడం కూడా అసహజంగా అనిపిస్తుంది. సురేష్‌, శరత్‌మరార్‌ సినిమాని రిచ్‌గా నిర్మించారు. హిందీ వెర్షన్‌ కంటే తెలుగు వెర్షన్‌ చాలా రిచ్‌గా అనిపించింది. 

విశ్లేషణ: ఇది చాలా సెన్సిటివ్‌ సబ్జెక్ట్‌. ఒక నాస్తికుడికి, ఆస్తికులకు మధ్య జరిగే పోరాటం. ఇది కథగా చెప్పడానికి, డైలాగులతో మెప్పించడానికి బాగానే వుంటుంది కానీ, ఎంతవరకు ఈ సినిమాని రిసీవ్‌ చేసుకుంటారనేదే ప్రశ్న. ఎందుకుంటే మనదేశంలో అత్యధిక శాతం ఆస్తికులే. దేవుడి మీద కేసు పెట్టడం అనే కాన్సెప్ట్‌ని ఎంతవరకు సపోర్ట్‌ చేస్తారనేది ఆలోచించాల్సిన విషయం. బాలీవుడ్‌లో ఈ చిత్రానికి ఘన విజయాన్ని కట్టబెట్టినా తెలుగుకి వచ్చే సరికి మన ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో మార్పు వుంటుంది. పైగా ఈ చిత్రంలో వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌లాంటి ఇద్దరు స్టార్‌ హీరోలు నటించారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా వుంటాయని ఆశిస్తారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఆశించే ఎలిమెంట్స్‌ ఇందులో లేకపోవడం కూడా వారిని నిరాశ పరుస్తుంది. పవన్‌కళ్యాణ్‌ ఫస్ట్‌ హాఫ్‌ ఎండిరగ్‌లో ఎంట్రీ ఇవ్వడం వల్ల అప్పటివరకు ఆడియన్స్‌ చాలా బోర్‌ ఫీల్‌ అవుతారు. కథ నడుస్తున్నా ప్రేక్షకుల ధ్యాస అంతా పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ ఎప్పుడిస్తాడు అనేదానిపైనే వుంటుంది కాబట్టి ఫస్ట్‌హాఫ్‌ అంతగా ఆకట్టుకోదు. పవన్‌కళ్యాణ్‌ ఎంటర్‌ అయిన తర్వాతే సినిమాకి కాస్త ఊపు వచ్చిందని చెప్పాలి. సంక్రాంతి పండక్కి ఔట్‌  అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని ఆశించి వెళ్ళే ఆడియన్స్‌కి మాత్రం తప్పకుండా నిరాశే ఎదురవుతుంది. మాటిమాటికీ వచ్చే కోర్టు సీన్స్‌ వల్ల సినిమా చూస్తున్నట్టుగా కాకుండా టీవీ సీరియల్‌ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఆయా సీన్స్‌కి రాసిన డైలాగ్స్‌ బాగుండడం వల్ల కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, మసాలా ఈ చిత్రంలో లేకపోవడం వల్ల ఎంతవరకు ఈ చిత్రాన్ని రిసీవ్‌ చేసుకుంటారనేది ప్రశ్నార్థకమే. ఈ సంక్రాంతికి ముందుగా వచ్చిన ‘గోపాల గోపాల’ కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

ఫినిషింగ్‌ టచ్‌:  దేవుడు అనే టాపిక్‌పై సినిమా చెయ్యడమే సాహసం. దాన్ని రీమేక్‌ చెయ్యాలనుకోవడం మరో సాహసం. దాన్ని ఇద్దరు స్టార్‌ హీరోలతో చెయ్యడం అన్నింటి కంటే పెద్ద సాహసం. పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌, వెంకటేష్‌ ఇమేజ్‌ ఈ చిత్రాన్ని ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 

సినీజోష్‌ రేటింగ్‌: 3.25/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs