తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరుకుంది. ఓవైపు డీలిమిటేషన్, త్రిభాషా విధానంపై వాదోపవాదాలు.. మరోవైపు కేంద్రం, రాష్ట్రం మధ్య నిత్యం మాటల యుద్ధంతో టెన్షన్ టెన్షన్ గానే పరిస్థితులు ఉన్నాయి.
సరిగ్గా ఈ క్రమంలోనే అన్నాడీఎంకేతో కమలం పార్టీ జతకట్టింది. అదేనండీ.. తమిళనాట కమలానికి రెండాకులు తోడయ్యాయి అన్నమాట. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒక్క డీఎంకే పార్టీని బీజేపీ - అన్నాడీఎంకే, దళపతి విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కళగం ఢీ కొట్టనున్నాయి. వాస్తవానికి ఇదంతా తెరముందే జరిగినప్పటికీ.. తెర వెనుక జరిగిన కథ వేరే ఉంది. ఇంతకీ ఆ కథేంటి..? ఇందులోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు దూరారు? ఎన్నికల్లో ఏం జరగబోతోంది..? అనే ఆసక్తికర అంశాలపై ఈ ప్రత్యేక కథనం !
అటు పథకాలు.. ఇటు పొత్తులు !
తమిళనాట అమ్మ జయలలిత అకాల మరణం తర్వాత రాష్ట్ర ప్రజలకు కనిపించిన ఏకైక ఆశాజ్యోతి ఎంకే స్టాలిన్.. అందుకే డీఎంకేను గెలిపించి ఆయన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. వాస్తవానికి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమ్మ క్యాంటీన్లతో పాటు సంక్షేమ పథకాలను గత ప్రభుత్వానివి కొనసాగించారు. దీంతో అమ్మ లేని లోటును తీర్చుతున్న ఇమేజ్ తో ముందుకెళ్తున్నారు. ప్రజలకు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే.. మరోవైపు అభివృద్ధి పరంగా కూడా దూసుకెళ్తున్నారు. ఐతే స్టాలిన్ ప్రత్యర్థులు మాత్రం పొత్తులతో ఒక్కటవుతున్నారు. విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకొని డీఎంకేను పడకొట్టాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఐతే తాను ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తానని, పొత్తు అనే ఆలోచనే లేదని తేల్చి చెప్పేశారు విజయ్. ఐనా సరే ఒకటికి రెండుసార్లు దళపతిని దువ్వే ప్రయత్నంలో.. ఈ మధ్యనే నేరుగా కేంద్ర ప్రభుత్వం విజయ్ కి Y ప్లస్ భద్రతను కూడా ఏర్పాటు చేసింది. ఐనా సరే ఆయన ఏమాత్రం లొంగలేదు. దీనికి తోడు మొదటి నుంచి దళపతికి బీజేపీ అంటే అస్సలు పడట్లేదు.
కమలానికి రెండాకులు తోడు !
ఇక చేసేదేమీ లేక బీజేపీ తన పాత మిత్రులు అన్నాడీఎంకేతో చర్చలు జరపడం, డిమాండ్లకు ఒప్పుకోవడం, ముఖ్యంగా పళని స్వామి.. అన్నామలైను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేయడం, ఈ మార్పు చేర్పులు చకచకా జరిగిపోయాయి. ఇక పెద్దగా కష్టం లేకుండానే కమలానికి రెండు ఆకులు తోడయ్యాయి. దీంతో తమిళనాట హోరాహోరి పోరుకి రంగం సిద్ధం అయ్యింది. ఈ రెండు పార్టీల మైత్రి కొత్తదేమీ కాదు. నాడు జయలలిత నెచ్చెలి శశికళను జైలు నుంచి రిలీజ్ చేయడం, పన్నీర్ సెల్వంకు సహకరించడం, పళని స్వామికి చెయ్యి అందించడం ఇలా కొన్ని కొన్ని విషయాల్లో మద్దతు ఇస్తూ వచ్చిన బీజేపీతో గతంలోనే అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంది. ఐతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మైత్రి ఎక్కువ కాలం ఉండలేదు. ఇప్పుడు మళ్ళీ స్నేహం చిగురించింది. దీంతో అదిగో ఇదిగో అధికారం మాదే అన్నట్టుగా బీజేపీ సీన్ క్రియేట్ చేస్తున్నది.
రంగంలోకి పవన్ కళ్యాణ్ !
తమినాట జరిగే త్రిముఖ పోరులో పవన్ కళ్యాణ్ కూడా తనవంతు పాత్ర పోషించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణాది దేవాలయాల యాత్ర చేయడం.. తమిళనాడులో గుళ్ళు గోపురాలకు తిరగడం, అక్కడి అభిమానులు, హిందువులు సాదరంగా ఆహ్వానించడం ఇవన్నీ మనం చూశాం. ఐతే ఇదంతా బీజేపీ వెనకుండి నడిపించింది టాక్ బలంగానే వినిపించింది. ఐతే రేపొద్దున్న ఎన్నికల్లో వీలైతే జనసేన పార్టీని ఎన్నికల కథనరంగలోకి దింపడం, లేదా ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారం చేయడం చేయడానికి సేనాని సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఈయన ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మహారాష్ట్రలో బీజేపీ విజయదుందుభి మోగించడంతో లక్కీ లీడర్ అని.. గోల్డెన్ లెగ్ అని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సేవలు తమిళనాడులో కూడా వినియోంచుకోవాలని బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలిసింది.
ఇదే జరిగితే ముగ్గురు హీరోల మధ్య మాటల యుద్ధం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ - విజయ్ - ఉదయనిధి స్టాలిన్ మధ్య గట్టిగానే వార్ జరిగి తీరుతుంది. అప్పుడిక ఎవరిది పైచేయి..? డీఎంకేను ఢీ కొట్టే అసలు సిసలైన దమ్మున్న లీడర్ ఎవరు అనేది తెలిసిపోనుంది.
- Parvathaneni Rambabu ✍️