బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయి ఒక సినిమా తీయాలంటే అసాధ్యంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోల కంటే తామేం తక్కువ తినలేదంటున్నారు కొంతమంది కమెడియన్లు. కొన్నేళ్ల క్రితం దాకా కమెడియన్లను అందరూ కరివేపాకుల్లాగా చూసేవారు. తెరపై ఎంత గొప్పగా నవ్వించినా పారితోషికాలు, మర్యాదల విషయంలో వారిని చిన్నచూపు చూసేవారు. కానీ ఇటీవలి కాలంలో కమాండ్ ఉన్న కమెడియన్లు కాస్తా స్టార్ కమెడియన్లుగా మారిపోయారు. ఇక వారి ఆగడాలకు అంతే లేకుండా పోతోందని ఈమధ్య ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాహాటంగానే వాపోతున్నారు.
ఓ సీనియర్ ప్రొడ్యూసర్ ఆమధ్య నిర్మించిన ఓ సినిమాకు అయిన బడ్జెట్ చూసి కోపంతో ఊగిపోయారు. కారణం.. ఓ పేరున్న కమెడియన్ మార్నింగ్ తన టిఫిన్ ఖర్చు అక్షరాల ఐదు వందల రూపాయల బిల్లు ఇవ్వడం! కడుపు ఎండినపుడు అవకాశాల కోసం దర్శకుల చుట్టూ తిరిగిన కమెడియన్లలో కొంతమంది కడుపు నిండగానే బిల్డప్‌లు ఇస్తున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ సెట్లో టిఫిన్ ఉన్నప్పటికీ బయట టిఫిన్ చేసి వస్తూ బిల్లులు ఇస్తున్నారంటే కొత్త నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.
గతంలో పేరున్న హాస్యనటులు సినిమాకు రెండు మూడు లక్షలు తీసుకుంటే గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇవాళ డిమాండ్ ఉన్న కమెడియన్లు ఒక్కరోజుకే అంతకంటే ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఒక్క రోజుకు రూ. 5 లక్షలు తీసుకునే కమెడియన్లు కూడా ఉన్నారు. ఇటీవల ఇంకో కల్చర్ కూడా నడుస్తోంది. టాప్ కమెడియన్లు తమ సొంత కార్లలో షూటింగ్‌కు వస్తూ ట్రావెల్ ఏజెన్సీ బిల్లు లాగా ఏసీకారు రెంట్ వసూలు చేయడమే కాకుండా, డ్రైవర్ బత్తాలు కూడా వసూలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. సెట్స్‌కు వచ్చిన దగ్గర్నుంచీ డైరెక్టర్‌నో, అసోసియేట్ డైరెక్టర్‌నో ‘ఎప్పుడు వదిలేస్తారు?’ అనడం కూడా ఓ ఫ్యాషన్‌గా మారింది.
‘‘కమెడియన్లు ఏడాదికి ఇరవై ముప్పై సినిమాలు చేస్తారు కాబట్టి మాది వారికి 31వ సినిమా అవుతుంది. కానీ మాకు ఏడాదికి అదొక్కటే కాబట్టి ఇబ్బంది పెట్టకూడదని వారు అనుకోవట్లేదు’’ అని ఓ డైరెక్టర్ చెప్పారు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం అష్టకష్టాలు పడిన కొందరు కమెడియన్లు సైతం సక్సెస్ రాగానే అదే కోవలో చేరడం దురదృష్టకరమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.