హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘24’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్, 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంత ఈ సినిమా గురించి విలేకర్లతో ముచ్చటించారు.
ప్లాన్ చేయలేదు..
సమ్మర్ లో వరుసగా నా సినిమాలు రిలీజ్ అవుతుండడం నేను ప్లాన్ చేయలేదు. వరుస అవకాశాలు వస్తున్నాయి. నా లక్ అనే చెప్పాలి. ఎవరికీ ఇలాంటి సమ్మర్ కుదరదు. ఒక్కో సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. 'తేరి' సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. '24' క్లాస్ ఫిలిం. రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమా. ఆ రెండు లానే 'బ్రహ్మోత్సవం','అ ఆ' సినిమాలు కూడా హిట్ అవుతాయని అనుకుంటున్నాను.
తెలుగులో రాలేదు..
24 డిఫరెంట్ కాన్సెప్ట్. బహుశా హాలీవుడ్ లో చూసి ఉంటాం. తెలుగులో ఇది కొత్తగా కాన్సెప్ట్. అది విక్రం కుమార్, సూర్య ల సినిమా అని చెప్పొచ్చు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు 'ఈగ' సినిమా విన్నప్పుడు ఎంత హై ఫీలింగ్ కలిగిందో.. అదే ఫీలింగ్ 24 విన్నప్పుడు అనిపించింది. సమంత ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే.. ఏదైనా స్పెషాలిటీ ఉంటుందని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. అందుకే సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ లోనే నటిస్తున్నాను. హీరోయిన్ కు స్కోప్ ఉన్న సినిమాలో నేను కనిపిస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను.
అవార్డ్స్ అనీ సూర్య గారికే..
సూర్య నటుడిగానే కాదు, మంచి ప్రొడ్యూసర్ కూడా. డైరెక్టర్ విక్రమ్ ఆలోచించడం కాదు, ఆయన ఆలోచనను తెరపైకి తీసుకురావడానికి మంచి నిర్మాత అవసరం. ఆ పనిని సూర్య చక్కగా చేశారు. ఇక నటన విషయానికి వస్తే ఆత్రేయగా ఆయన చేసిన నటన అద్భుతం. ఈ ఏడాది అవార్డులన్నీ ఆయనకే వస్తాయి.
అప్పుడే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు..
విక్రం లవ్ పోర్షన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. తన ప్రతి సినిమాలో అలానే ఉంటాయి. 24 ఇంటెన్స్ ఫిలిం. అలాంటి సినిమాలో రొమాంటిక్ పోర్షన్స్ ఉంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
రిజల్ట్ పట్టించుకుంటాను..
చివరి 8 నెలలు మాత్రం ప్రతి నెల పని చేస్తూనే ఉన్నాను. 'అ ఆ', 'బ్రహ్మోత్సవం', 'తేరి', '24' ఇలా నేను నటించిన అన్ని సినిమాలలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేశాను. ప్రతి రోజు పని చేస్తూనే ఉన్నాను. సినిమాలో నటించడంతో నా పని అయిపోయిందని అనుకోను. రిజల్ట్ కోసం ఎదురుచూస్తాను.
నా పాత్రే నాకు ముఖ్యం..
నాకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తాను. నాతో పాటు మరి కొంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారనే విషయాన్ని పట్టించుకోను. నా రోల్ ఎలా ఉంటుందనే చూసుకుంటాను.
ఆ ఫీలింగ్ అప్పుడప్పుడు వస్తుంది..
కొత్త హీరోయిన్స్ ఎవరైనా స్టేజ్ పై నాకు సమంత అంటే చాలా ఇష్టమని అంటే, నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇంకా వెళ్లిపోలేదు అని చెప్పాలనిపిస్తుంది. నేను సీనియర్ హీరోయిన్ అయిపోయానని అప్పుడు అనిపిస్తుంది. అందుకే కొత్తగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. 'జనతా గ్యారేజ్' లో కూడా నా లుక్ కొత్తగా ఉంటుంది.
సితార స్టార్ హీరోయిన్ అవుతుంది..
సితార నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఈ మాట చెబితే మహేష్ నన్ను కిల్ చేస్తారేమో కానీ నేను చెప్పాలి. సితార ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతుంది. తను డ్యాన్స్, నవ్వు అన్నీ చూస్తుంటే గౌతమ్ కంటే సితార స్టార్ హీరోయిన్ అయిపోతుందనిపిస్తుంది(నవ్వుతూ..)
కొత్తగా ఉండే రోల్స్..
'బ్రహ్మోత్సవం'లో నా పాత్ర కొత్తగా ఉంటుంది. శ్రీకాంత్ కొన్ని సీన్స్, లైన్స్ చాలా బాగా రాశారు. ప్రతిది కొత్తగా ఉండేలా చూసుకున్నారు. ఇక 'అ ఆ' సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు నేను సెంటిమెంట్, ఎమోషన్స్, లవ్ ఇలా అన్ని క్యారెక్టర్స్ లో నటించాను కానీ కామెడీ రోల్స్ లో నటించలేదు. సినిమాలో కామెడీ ఎలిమెంట్ చేయాలనేది నా కల. ఆ కామెడీ 'అ ఆ' లో చేశాను.
డార్క్ రోల్స్ చేయాలనుంది..
నేను తమిళంలో డార్క్ రోల్స్ చేశాను. తెలుగులో ఎవరైనా అలాంటి పాత్రలతో వస్తే చేయడానికి నేను సిద్ధం. కన్నడలో 'యు టర్న్' మూవీ రీమేక్ లో నటించబోతున్నాను. ఈ చిత్రం తెలుగు, తమిళంలో రూపొందనుంది.