ఆది, ఆదాశర్మ జంటగా శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మిస్తున్న చిత్రం 'గరం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో ఆదితో సినీజోష్ ఇంటర్వ్యూ..
అనుకున్నదే చేశాం..
మేం ఏం అనుకొని సినిమా చేశామో ఆ సోల్ బాగా వచ్చిందని నా నమ్మకం. సినిమాలో సెంటిమెంట్, కామెడి ఇలా అన్నీ చక్కగా కుదిరాయి. నాన్నగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. నటీనటులు టెక్నిషియన్స్ అందరూ కలిసి టీం ఎఫర్ట్ చేసిన సినిమా.
యూత్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్..
ఈ సినిమాలో వరాలబాబు అనే పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ కు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ప్రేమకావాలి, లవ్‌లీ తరువాత నా క్యారెక్టర్ అంత బాగా ఈ సినిమాలో కుదిరింది. రాజమండ్రి స్లాంగ్‌లో మాట్లాడాను. అందరినీ ఎంటర్‌టైన్ చేసే క్యారెక్టర్. ఫైట్స్ చాలా థ్రిల్లింగ్‌గా కంపోజ్ చేశారు. నాన్నతో వర్క్ చేసిన థ్రిల్లర్ మంజు, సత్యప్రకాష్‌లతో వర్క్ చేయడం హ్యపీగా అనిపించింది.
మదన్ మంచి రైటర్..
మదన్‌గారు డైరెక్టర్ మాత్రమే కాదు మంచి రైటర్ కూడా. ఇప్పటివరకు మదన్ గారు ఇలాంటి సినిమా చేయలేదంతే. ఈ సినిమాలో ఎమోషనల్ ఫీల్‌ను బాగా డీల్ చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్ పార్ట్‌పై ఆయనకున్న గ్రిప్ చూసి స్టన్ అయ్యాను. మంచి కామెడి టైమింగ్ ఉన్న సెటిల్డ్ డైరెక్టర్.
ఆ రిస్క్ ను ఎంజాయ్ చేస్తాం..
సినిమా చేయడం అంత సులువు కాదని ఈ సినిమాతో నాన్న నిర్మాతగా చేయడంతో అనిపించింది. ఈ ఫీల్డే పెద్ద రిస్క్. కానీ ఈ రిస్క్ ను ఎంజాయ్ చేస్తాం. ఏ హీరో అయినా ఓ సినిమా సొంత బ్యానర్‌లో చేయాలి. అప్పుడు ప్రొడ్యూసర్ ఎంత ప్యాషనేట్‌గా ఉన్నారో తెలుస్తుంది. వాల్యూ ఆఫ్ సినిమా తెలిసింది. సినిమా తీయడం, పబ్లిసిటీ చేయడం ఎంత కష్టమో తెలిసింది. దీంతో నిర్మాతల హీరోగా ఇంకా ఎదగాలని కోరుకుంటాను. సినిమాపై బాధ్యత పెరిగింది.
ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా తెలుగులోనే..
కన్నడలో 'పటాస్' సినిమాలో నటించమని ఎస్.పి.బాబుగారు నన్ను అడిగారు. అయితే ఇప్పుడు నేను చేస్తే టు ఎర్లీ అయిపోతుంది. సో.. చేయనని చెప్పా. తెలుగులో నాన్నగారి పాత్రను కన్నడలో కూడా ఆయనే చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ గారి రోల్ లో గణేష్ చేస్తున్నారు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా తెలుగులోనే..
నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
చుట్టాలబ్బాయి సినిమా చేస్తున్నాను. హీరోయిన్‌గా నమిత ప్రమోద్‌ను పరిచయం చేస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. రీసెంట్ గా బ్యాంకాక్‌లో ఓ పాట కూడా షూట్ చేశాం. ఫిబ్రవరి 22 నుండి కొత్త షెడ్యూల్ మొదలు పెడుతున్నాం. కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. కథలు వింటున్నాను. మంచి కథ దొరికితే సినిమా చేస్తాను అంటూ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశారు.