అక్కినేని అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
'అఖిల్' సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక ఫాంటసీ చిత్రమని అందరూ అనుకుంటున్నారు. కాని నిజానికి ఇదొక కామెడీ ఫిలిం. ఎలాంటి ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండవు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రమిది. ఆఫ్రికా ఖండంలోని భూమధ్యరేఖ మధ్య జరిగే కథ ఇది. అక్కడ సూర్యుడ్ని జువా అని పిలుస్తారు. జువా అంటే ఒక పవర్ అని అర్ధం. రెండు గంటల 10 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తుంది.
సినిమా డిలే అవ్వడానికి కారణం ఏంటి.?
సినిమా క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మొత్తం గ్రాఫిక్స్ లో ఉంటుంది. సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ ఫైట్ మాకు సంతృప్తి కరంగా అనిపించలేదు. నాగార్జునగారు కూడా సినిమా అంతా చక్కగా తీసి ఒక ఫైట్ సీన్ దగ్గర బాలేదని అనిపించుకోవడం ఇష్టం లేదని చెప్పారు. చివరి నిమిషంలో డి.క్యూ ఎంటర్టైన్మెంట్స్ వారు సి.జి వర్క్ చేస్తామని తీసుకున్నారు. ఎలాంటి రీషూట్స్ చేయలేదు. అందుకే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసాము.
సినిమా లేట్ గా రిలీజ్ చేస్తున్నారని నాగార్జున గారి అభిమానులు బాధపడినట్లున్నారు..?
మొదట దసరాకు రిలీజ్ అవుతుందని చెప్పి వాయిదా వేసినప్పుడు అక్కినేని అభిమానులు చాలా బాధపడ్డారు. కాని నాగార్జున గారు ప్రెస్ మీట్ పెట్టి కారణం చెప్పినప్పుడు అభిమానులంతా సపోర్ట్ చేసారు. నవంబర్ 11 అని డేట్ అనౌన్సు చేయగానే చాలా సంతోషంగా ఉన్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని కేవలం నైజాంలోనే 370 నుండి 400 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మొదట మేము అనుకున్నట్లు దసరా కు రిలీజ్ చేసి ఉంటే ఇన్ని థియేటర్స్ మాకు దొరికేవి కావు. సినిమా విడుదల విషయం వాయిదా పడడం కూడా మాకు కలిసొచ్చింది.
ఒక స్టార్ హీరో కొడుకును లాంచ్ చేయడంలో ప్రెజర్ గా ఫీల్ అయ్యారా..?
'మనం' సినిమాలో అఖిల్ ను చూడగానే నాకు బాగా నచ్చాడు. అప్పుడే తనతో సినిమా చేయాలనుకున్నాను. ఒక స్టార్ హీరో కొడుకుని ఇంట్రడ్యూస్ చేయడమనే విషయంలో చాలా టెన్షన్ పడేవాడిని. కథ కోసం, క్వాలిటీ కోసం కష్టపడ్డాం. నాగార్జున గారు ఒక ఫంక్షన్ లో నా కొడుకుని వినాయక్ కు ఇచ్చాను అని చెప్పారు. అప్పుడు నాపై బాధ్యత పెరిగిందనుకున్నాను.
అఖిల్ ఈ సినిమాలో ఎలా నటించాడు.?
అఖిల్ తన తండ్రి ఇమేజ్ దృష్ట్యా ఆయనలా నటించడానికి ప్రయత్నిస్తాడనుకున్నాను. కానీ అఖిల్ కొత్త లుక్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. తను డాన్సులు, ఫైట్స్ చేస్తుంటే కొత్త హీరో చేస్తున్నట్లుగా అస్సలు అనిపించలేదు. బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ కు కరెక్ట్ గా పంచ్ లు ఇస్తూ కామెడీ సీన్స్ లో కూడా బాగా నటించాడు. ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అఖిల్ లో ఉన్నాయి.
అఖిల్ లో మీకు బాగా నచ్చిన విషయం..?
ట్రైలర్ లో కనిపించే పాటలతోనే అఖిల్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్నాడు. దాని కోసం బాగా ప్రాక్టీస్ చేసాడు. రిహార్సాల్స్ చేస్తూ. ఫుడ్ తీసుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయాడు. చాలా భయపడ్డాం. తనలో మంచి కసి ఉంది. రోప్ ఫైట్స్ చేయడం కష్తమైన విషయం. అఖిల్ మాత్రం వన్ మోర్ ఇంకా బాగా చేద్దామని చేసేవాడు. తనలో ఉన్న కమిట్మెంట్ నచ్చింది.
సయేషా సైగల్ ను ఎన్నుకోవడానికి కారణం..?
సుధాకర్ రెడ్డి గారికి శివ అనే ఒక స్నేహితుడు ఉన్నాడు. తను బొంబాయ్ లో ఉంటారు. ఆయనొకసారి దిలీప్ కుమార్ గారి మనువరాలు ఒక అమ్మాయి ఉంది. ఒకసారి చూడండి అని చెప్పారు. సయేషాను చూసిన వెంటనే హీరోయిన్ గా ఓకే చేసేసాం. తను మంచి పెర్ఫర్మార్, డాన్సర్. తను కూడా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది.
ఆడియోకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది.?
సినిమా మొదలు పెట్టినప్పుడు మంచి బడ్జెట్ లో చేయాలనుకున్నాం. సుధాకర్ రెడ్డి గారు కూడా బాగా సపోర్ట్ చేసారు. ప్రతిది దగ్గరుండి చూసుకునేవారు. బయ్యర్స్ నుండి మంచి సపోర్ట్ వచ్చింది. బిజినెస్ బాగా జరిగింది. సుధాకర్ రెడ్డి గారి సలహా మేరకు మణిశర్మ గారితో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించాం. అలానే తమన్, అనూప్ మ్యూజిక్ సినిమాకు అసెట్ గా నిలిచింది.
మహేష్ బాబు గారు ఆడియో ఫంక్షన్ లో హీరోను ప్రెజంట్ చేయడంలో వినాయక్ గారి తరువాతే ఎవరైనా అని చెప్పారు. మీకు ఎలా అనిపించింది..?
ముందుగా మహేష్ బాబు గారు ఆడియో ఫంక్షన్ కు రావడం చాలా ఆనందంగా అనిపించింది. అఖిల్, మహేష్ తో సినిమా గురించి ఒక బైట్ చేయాలని అడిగితే ఆయన బైట్ ఏంటి.? ఆడియో ఫంక్షన్ కు వస్తానని చెప్పారు. స్టేజీ మీద నా గురించి అలా మాట్లాడిన వెంటనే నాపై ఇంత అభిమానం ఉందా..? అనిపించింది. మహేష్ తో త్వరలోనే 100 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తాను. తనతో మామూలు సినిమా చేయాలని లేదు. కథ రెడీ అయిన తరువాత డిస్కస్ చేసుకొని సినిమా మొదలు పెడతాం.
చిరంజీవి గారితో 150వ చిత్రం మీరే చేస్తారని వార్తలు వస్తున్నాయి.?
చిరంజేవి గారితో సరదాగా మాట్లాడడానికి కలుస్తుంటాను. అంతే కాని సినిమా గురించి కాదు. ఆయనతో సినిమా చేస్తానా..? లేదా..? అనేది త్వరలోనే తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.