Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- సాయికుమార్(బర్త్ డే స్పెషల్)

Sun 26th Jul 2015 09:48 AM
sai kumar,samanyudu,prasthanam,adi,allu arjun  సినీజోష్ ఇంటర్వ్యూ- సాయికుమార్(బర్త్ డే స్పెషల్)
సినీజోష్ ఇంటర్వ్యూ- సాయికుమార్(బర్త్ డే స్పెషల్)
Advertisement
Ads by CJ

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలకు పని చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సాయికుమార్. ప్రస్థానం, సామాన్యుడు వంటి చిత్రాలలో పవర్ ఫుల్ రోల్స్ లో నటించి తను తప్ప ఆ పాత్రలకు వేరెవరు న్యాయం చేయలేరనిపించుకున్నాడు. సుమన్, రాజశేఖర్ వంటి హీరోలకు తన వాయిస్ అందించాడు. తెలుగు డిక్షన్ లో మంచి పట్టు ఉన్న ఈ నటుడు జూలై 27న తన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా నటుడు సాయికుమార్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

మిమ్మల్ని ఓ నటునిగా సంతృప్తి పరిచిన చిత్రాలేవి..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా బాపు గారు తెరకెక్కించిన 'స్నేహం' చిత్రంలో నటించాను. ఆ తరువాత చిరంజీవి గారితో కలిసి నటించిన 'ఛాలెంజ్' మూవీతో నాకు మంచి అవకాశాలు వచ్చాయి. విజయశాంతి గారితో నటించిన 'కలికాలం' సినిమా నన్ను కన్నడ ఇండస్ట్రీకు పరిచయం చేసింది. 1994 లో నేను నటించిన 'లాకప్ డెత్' సినిమా టైంలో థ్రిల్లర్ మంజు గారితో స్నేహం ఏర్పడింది. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో నటించిన 'పోలీస్ స్టొరీ' నా జీవితానికి పెద్ద మలుపు. ఈరోజు పోలీస్ బృందానికి బ్రాండ్ అంబాసడర్ గా మారడానికి కూడా కారణం అదే. నా జీవితంలో మరిచిపోలేని చిత్రాలివి.

విలన్ గా నటించిన చిత్రాలలో మీకు నచ్చిన సినిమాలు ఏంటి..?

సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు చిత్రాలు ప్రతినాయకుని పాత్రలో నన్ను బాగా ఎలివేట్ చేసాయి. ఆ చిత్రాలకు అవార్డులు సైతం సొంతం చేసుకున్నాను. ఎవడు చిత్రానికి కూడా అవార్డు వస్తే హాట్రిక్ కొట్టేవాడిని. కాని జగపతి బాబు నటించిన 'లెజెండ్' చిత్రానికి అవార్డు వచ్చింది. జగపతిబాబు ఆ అవార్డుకు అర్హుడు. ఆయనకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది. 

చాలా మంది హీరోలతో, దర్శకులతో పని చేసారు కదా.. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయిన హీరోలు, దర్శకులెవరు ..?

నా అద్రుష్టం ఏమిటంటే.. ఆ తరం నుండి ఈ తరం వరకు ఉన్న అందరి హీరోలతో, దర్శకులతో నేను పని చేసాను. నేను అజాత శత్రువుని. అందరిని కలుపుకొనిపోయే మనస్తత్వం కలవాడిని. ఇండస్ట్రీలో ఉన్నవారంతా కూడా నన్ను అన్న, తమ్ముడు, బాబాయ్ అని పిలిచేవారే. సో.. అందరితో కంఫర్టబుల్ గా వర్క్ చేస్తాను.

మీకు కన్నడలో ఉన్నంత ఫేమ్ తెలుగులో రాకపోవడానికి కారణాలేంటి..?

తెలుగులో సాయికుమార్ అంటే డైలాగ్స్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు మాత్రమే చేయగలడు అనే ఫీలింగ్ అందరికి ఉంది. అలా కాకుండా నేను కూడా మొదటినుండి కమర్షియల్ చిత్రాల్లో నటించి ఉండాల్సింది. నా కథల ఎంపికలు, నాకున్న పరిధులే తెలుగులో నేను అనుకున్న ఫేమ్ రాకపోవడానికి కారణం. కన్నడలో నేను నటించిన చిత్రాలు ట్రెండ్ ను క్రియేట్ చేసాయి. రీసెంట్ గా అక్కడ విడుదలయిన 'రంగి తరంగ' చిత్రం పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని సక్సెస్ ఫుల్ గా నాలుగోవారం రన్ అవుతుంది.

ల్యాండ్ మార్క్ అనిపించిన చిత్రాలేవి..?

రీసెంట్ గా నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ప్రతివారింట్లో 'ప్రస్థానం' సినిమా ఉండడం గమనించాను. చాలా సంతోషంగా అనిపించింది. అది కాకుండా కన్నడలో 'శ్రీ కైవర మహాత్మే' అనే చారిత్రాత్మక చిత్రం నాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. 

ఈ పాత్రలో నేను నటించలేకపోయానే అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా..?

రీసెంట్ గా రిలీజ్ అయిన 'బాహుబలి' చిత్రంలో సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్రలో నేను నటిస్తే బావుండేదే అనుకున్నాను. కాని మార్కెటింగ్ వాల్యూస్ బట్టి ప్రస్తుతం ఉన్న దర్శకనిర్మాతలు పరభాష నటులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమాలు కాబట్టి అన్ని భాషలకు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాసాలిస్తున్నారు. ఈ అవకాసం నేను మిస్ అయ్యానే.. అని అనుకోకపోతే నటునిగా నేను చనిపోయినట్లే లెక్క. మనకని రాసి ఉంటే నా వరకు వస్తుంది. నాది కానప్పుడు ఎప్పటికి రాదు.

మీ అబ్బాయి ఆది కెరీర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?

ప్రస్తుతం ఉన్న సినిమాలకు కావాల్సిన ఫిజిక్, డాన్సు, గ్లామర్, నటన అన్ని ఆది లో ఉన్నాయి. ఏ చాలెంజ్ కు అయినా తను రెడీగా ఉన్నాడు. తన స్క్రిప్ట్స్ మొదట తనే వింటాడు. అందులో లోటుపాట్లు ఉంటే నేను సజెషన్స్ ఇస్తాను. పెళ్లి తరువాత తన లైఫ్ చాలా బావుంది.

నాన్నగారు లేని లోటు కనిపిస్తుందా..?

యాభై ఏళ్ళు నాన్నతో కలిసి ట్రావెల్ చేసాను. ఆయన లేరు అనే ఫీలింగ్ మర్చిపోయి నిన్న రాత్రి ఇంటికి వచ్చి నాన్నగారు భోజనం చేసారా.. అని అడిగాను. ఆయన ఎప్పటికి నాతోనే ఉంటారు.  

ఈ పుట్టినరోజుకు కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకున్నారా..?

చనిపోయే వరకు నటిస్తూ ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ పుట్టినరోజు నుండి కొంచెం హెల్త్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ముందుగా పొట్ట తగ్గించాలి(నవ్వుతూ..)

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ప్రస్తుతం 'పోలీస్ స్టొరీ' పార్ట్2 చేయాలనుకుంటున్నాను. దానికి 'న్యూ పోలీస్ స్టొరీ' అనే టైటిల్ కూడా ఖరారు చేసాం. కథ బాగా వస్తే చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాను. కన్నడ లో 'పటాస్' మూవీ రీమేక్ లో నటిస్తున్నాను. తెలుగులో సుదీర్ బాబు హీరోగా ఒక చిత్రంలో, బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మరొక చిత్రంలో పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్నాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో ఓ చిత్రంలో నటించనున్నాను. ఇవి కాకుండా కన్నడలో నాలుగైదు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ