పెద్ద సినిమా రిలీజ్ కు వచ్చిందంటే పైరసీ సెల్ పనిపడుతుంది.తాజాగా తెరవెనుక అనేక మంది పెద్దలున్న బాహుబలి పైరసీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కోరస్ గా అందరూ చెప్పారు. థియేటర్ లోనే చూడాలని వారు ప్రేక్షకులకు సూచించారు. పైరసీ సంగతి పక్కన పెడితే థియేటర్లలో ప్రేక్షకులకు జరుగుతున్న దోపిడీ గురించి మాత్రం 'బాహుబలి' యూనిట్ మాట్లాడలేదు. సినిమాకు ఉన్న క్రేజ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఆన్ లైన్ టికెట్స్ ను బ్లాక్ చేసారు. వాటిని బ్లాక్ లో ఐదువందల నుండి మూడువేల రూపాయల వరకు అమ్ముతున్నారని సమాచారం. ఈ అధిక ధర గురించి రాజమౌళికి, నిర్మాతలకు తెలియంది కాదు. అనేక థియేటర్లలో అనధికారంగా స్లాబ్ రేట్ నిర్ణయించి టికెట్లు అమ్ముతున్నారు. మేనేజర్లు దగ్గరుండి మరీ అమ్మిస్తున్నారు. ప్రతి థియేటర్ కు టార్గెట్ నిర్ణయించారనే మాట వినిపిస్తోంది. నైజాం ప్రాంతానికి దిల్ రాజు పంపిణీ హక్కులు తీసుకున్నారట. దాంతో హైదరాబాద్ లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ టార్గెట్ నిర్ణయించి తన పెట్టుబడి రికవరీ చేయడానికి ప్లాన్ చేసారట. దీనికి ప్రభుత్వ సహకారాన్ని అనధికారంగా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా రాజమౌళి అండ్ కో.. కు తెలియంది కాదు. కాని దీనిగురించి మాట్లాడకుండా పైరసీ గురించి మాత్రం స్పందించారు. ఒక్కో టికెట్ ఐదువందలకు అమ్మితే ప్రేక్షకుడు థియేటర్ కు వెళతాడా లేక పైరసీ చూస్తాడా అనేది వారికే తెలియాలి. ఆన్ లైన్ లి టికెట్ అమ్మకాల్లో కూడా మతలబు జరిగిందని అంటున్నారు. వెబ్ సైట్స్ ఓపెన్ కాలేదు. చాలా వరకు టికెట్స్ ముందుగానే బుక్ అయ్యాయి. ఇదంతా కావాలని చేసిందే. హైదరాబాద్ లో 14 చోట్ల బెనిఫిట్ షో వేస్తుండడం మరీ విచిత్రం. ఒక్కో టికెట్ మూడు వేల వరకు అమ్మారు. ఎవరి బెనిఫిట్ కోసం? ఈ అమ్మకం అనేది తెలియడం లేదు. ఒక సినీ పెద్దకు దీంతో సంబంధాలున్నా యంటున్నారు. 'బాహుబలి' లాంగ్ రన్ కాకుండా డబ్బులు రికవరీ చేసే ఉద్దేశ్యంతోనే థియేటర్లు పెంచేశారు.
పెద్ద సినిమా కాబట్టి టికెట్ ధర పెంచడం సబబే అని వాదిస్తున్నవారున్నారు. కాని వందకోట్లకు పైగా బడ్జెట్ తో తీసిన 'అవతార్' , 'శివాజీ' , 'రోబో' , 'ఐ' సినిమాల టికెట్లు సాధారణ ధరకే అమ్మిన విషయాన్ని రాజమౌళి అండ్ కో మర్చిపోయినట్టుంది.