మహానాడు సాక్షిగా చంద్రబాబు తమ ప్రసంగంలో బజారులో పశువులను కొన్నట్టు టిఆర్‌ఎస్ తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయకులను కొన్నదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలనే సమర్ధిద్దాం. అంటే, తెలంగాణ టిడిపి నాయకులను పశువులుగా మనం అనుకోవాలా? పశువుల్ని తీసుకొచ్చి ఇంతకాలం ఈ పశువులే మీ నాయకులు అని చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టారని అనుకోవాలా? పశువుల్లాంటి నాయకులను ప్రజలనెత్తిన రుద్దింది ఎవరు? ఈ నాయకులు పోతేపోయారు, కొత్త నాయకులను తయారు చేసుకుంటాం ` అన్నారు చంద్రబాబు. తలసాని, తుమ్మల, తీగల ఎక్కడివారో ఎవరివారో చెప్పండి చంద్రన్నా!
చంద్రబాబు పార్టీ ఫిరాయించిన తన నాయకులను పశువులు అనవలసిన అవసరంలేదు. కెసిఆర్‌కి తెలంగాణని పాలించే సత్తాలేక తన ఎమ్మెల్యేలను తీసికెళ్ళి మంత్రి పదవులు కట్టబెట్టి పాలన సాగిస్తున్నాడు- తన ఆలోచనా ధోరణినే అవలంబిస్తున్నాడు- పాలనకు తెలుగుదేశం పార్టీపైనే ఆధారపడుతున్నాడు ` అని హుందాగా మాట్లాడితే బాగుండేది. తన లెగసీ కంటిన్యూ అవుతున్నందుకు పరిణతిచెందిన నాయకునిగా ఆనందించాలి.