ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ అడుగులు వైఎస్సార్ కాంగ్రెస్‌వైపు పడుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. వైసీపీ ఎంపీలో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి, జ్యోతుల నెహ్రు తదితరులు బొత్స ఇంటికి వెళ్లి శుక్రవారం మంతనాలు జరిపారు. దీన్నిబట్టి బొత్స వైసీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విభజన పరిణామంతో ఏపీలో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌లో ఎవరైనా డిపాజిట్లు దక్కించుకున్నారంటే అది బొత్స కుటుంబ సభ్యులు మాత్రమే. విజయనగరం జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న బొత్సను వైసీపీ వైపు ఆకర్షించడానికి ఎన్నికలకు ముందునుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏపీలో భవిష్యత్తు లేదని తెలిసి బొత్స వైసీపీలోకి వెళ్లడంవైపు యోచిస్తున్నట్లు సమాచారం. ఆయనకు విశాఖ జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు కూడా వైసీపీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ బొత్స వైసీపీలోకి వెళితే అది కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బేనని చెప్పవచ్చు.