తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో అనుహ్యమైన మార్పు చోటుచేసుకుంది. మొదటి పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావుకు చంద్రబాబు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో ఓటుహక్కు లేకపోవడంతో చివరి నిమిషంలో బరిలోంచి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి నామినేషన్ వేశారు.
ప్రతిభాభారతి కంటే ముందు ఆ స్థానానికి జూపూడి స్థానంలో పంచుమర్తి అనురాధను నామినేషన్ వేయాలని అధిష్టానం నుంచి సూచన వెళ్లింది. అయితే దీనికి ఆమె అంగీకరించలేదు. అంతకుముందే ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి బాబు హామీనిచ్చారు. ఇక ఇప్పుడు నామినేషన్ వేస్తే గవర్నర్ కోటాలో సీటు రాదని అనురాధ నిర్ణయించుకుంది. ఎమ్మెల్యే కోటాలో పాలడుగు వెంక్రటావు మరణంతో ఖాళీ అయిన సీట్లో ఆమె నామినేషన్ వేయాల్సి ఉంది. ఈ స్థానానికి ఇంకా రెండేళ్లు మాత్రమే పదవీ కాలం ఉంది. అదే సమయంలో గవర్నర్ కోటాలో శాసనమండలికి వెళితే మరో ఆరేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో ఆమె గవర్నర్ కోటాలోనే సీటు కావాలని పట్టుబట్టింది. దీంతో అప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నించి నిరాశకు గురైన ప్రతిభాభారతికి అవకాశం ఇవ్వాలని బాబు నిర్ణయించుకొని అప్పటికప్పుడు ఆమెతో నామినేషన్ దాఖలు చేయించారు.