కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవి మరణం గతేడాది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదుపేసింది. నిజాయితీపరుడైన డీకే రవిది ఆత్మహత్య కాదని, హత్యేనని ప్రతిపక్షాలు వాదించాయి. ఇసుక మాఫియాతో కుమ్మకైన స్థానిక నాయకులు ఆయన్ను హత్య చేశారంటూ ఆరోపించాయి. ఈ ఆరోపణలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. దీంతో స్పందించిన సోనియాగాంధీ ఐఏఎస్ అధికారి మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇక ఏడాది కాలంపాటు ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ డీకే రవిది హత్య కాదని, ఆత్మహత్యేనన్న నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
అయితే ఓ ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందనే విషయంపై కూడా సీబీఐ క్లారిటీకి వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. డీకే రవి ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సీబీఐ విచారణలో తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టిన ఆయన తీవ్ర నష్టాలను చవిచూసినట్లు సమాచారం. చిక్‌బళ్లాపూర్ ప్రాంతంలో 50 ఎకరాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేశారని, అందులో పెద్ద మొత్తంలో నష్టాలు రావడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సీబీఐ నిర్దారించింది. త్వరలోనే ఈ నివేదికను కోర్టుకు సమర్పించనుంది.