'లెజెండ్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న సినిమా 'లయన్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సత్యదేవాతో సినీజోష్ ఇంటర్వ్యూ..
ఈ అవకాశం ఎలా వచ్చింది..?
2000 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. దాసరి నారాయణరావు గారి దగ్గర సుమారు ఆరు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. గత ఐదు సంవత్సరాలుగా నేను బాలకృష్ణ గారితో ట్రావెల్ అవుతూ వస్తున్నాను. అప్పుడే నేను ఆయనకు స్క్రిప్ట్ నెరేట్ చేసాను. కాని కొన్ని కారణాల వలన డిలే అయ్యింది. 'లెజెండ్' సినిమా హిట్ తరువాత బాలయ్య గారు నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చి ఒక పెద్ద బాధ్యత నాపై పెట్టారు. 2014 జూన్ లో ఈ సినిమా మొదలు పెట్టాం. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో తీసిన చిత్రమిది.
సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ సినిమా. ఈ మూవీలో బాలకృష్ణ గారు 'గాడ్ సే' , 'బోస్' అనే రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు. మంచి కథ. ప్రతి సీన్, ప్రతి ఫైట్ చాలా కొత్తగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో మాస్ ఫైట్స్ ఉంటాయి. సొసైటీ నేపధ్యంలో చిత్రాన్ని తెరకెక్కించాం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఎక్కడా ఉండదు. రెండు, మూడు సన్నివేశాలలో పొలిటికల్ సీన్స్ ఉంటాయి కాని ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి అయితే కాదు. భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా తీసిన చిత్రమిది. ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'లయన్' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..?
నాకు 'లయన్' లో ఉండే లక్షణాలు బాలయ్య గారిలో కనిపిస్తాయి. డేరింగ్ గా స్టెప్స్ తీసుకోవడం ఇలా అన్ని విషయాలలో ఆయనకొక స్టైల్ ఉంటుంది. హీరోగానే కాకుండా ఒక మనిషిగా, రాజకీయనాయకుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సినిమాకి ఈ టైటిలే యాపట్ అవుతుందని పెట్టాం. టైటిల్ కు తగ్గట్లుగానే సినిమాలో ఆయన నటన కూడా ఉంటుంది.
ఈ స్క్రిప్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది..?
అందరు వాడుక బాషలో పిల్లలకు చెప్పే కథల నుండి ఈ సినిమా చేయాలనే తాట్ వచ్చింది. బాలకృష్ణ గారికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ సినిమాకు ఆయనైతేనే న్యాయం చేయగలరని ఆయనతోనే సినిమా చేసాను. మొదటి సినిమా అయినా నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి, బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు.
నటీనటుల గురించి..?
ఈ సినిమా కోసం బాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. నాలుగు నెలలు ఫుడ్ తీసుకోకుండా కేవలం ద్రవ పదార్ధాలను మాత్రమే తీసుకున్నారు. నాకు మొదటి సినిమా అయినా ఎంతో ప్రోత్సహించి నాకున్న ఒత్తిడిని దూరం చేసారు. ఈ సినిమాలో తొలిసారిగా త్రిష, బాలకృష్ణ సరసన నటిస్తోంది. స్క్రీన్ పై వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బావుంటుంది. లెజెండ్ సినిమాలో రాధిక ఆప్టే ఆల్రెడీ బాలయ్య సరసన నటించి మంచి పెయిర్ అనిపించుకున్నారు. రాధిక మాకు చాలా సపోర్ట్ చేసారు.
సినిమాలో హైలైట్స్ ఏంటి..?
ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్రైబల్ ఫైట్ చాలా కొత్తగా ఉంటాయి. క్లైమక్స్ ఫైట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. సినిమాలో మంచి సెంటిమెంట్ వాల్యూస్ ఉంటాయి.
మణిశర్మ గారి మ్యూజిక్ గురించి..?
బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్టే. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ముఖ్యం. సినిమాలో ఉన్న ఎమోషన్స్ ను ఎలివేట్ చేసేదే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా స్క్రిప్ట్ విని చాలా ఎక్సైట్ అయ్యి మణిశర్మ గారు మ్యూజిక్ చేసారు. మ్యూజిక్ కు మంచి అప్లాజ్ వస్తోంది.
బాలకృష్ణ ఈ సినిమా చూసారా..?
చూసారు. సినిమా చూసి చిన్న పిల్లవాడిలా చాలా సంతోషపడ్డారు.
సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి..?
ఒక మంచి సినిమా తీసాను అనే ఫీలింగ్ అయితే ఉంది. స్క్రిప్ట్ పై టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కథ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఏ సినిమాను పోలి ఉండదు. సినిమా రిలీజ్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, ప్రొడ్యూసర్స్ చాలా సంతోషంగా ఉంటారు.