చలన చిత్ర పరిశ్రమ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకలలో దర్శకరత్న దాసరి నారాయణరావు అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ కార్మికులను కామ్రేడ్ అని సంబోదిస్తూ.. 'కళకి, కళాకారుడికి కుల, మత, ప్రాంత బేధం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ ని ఫిలింహబ్ గా తీర్చిదిద్దుతామన్నందుకు ఆయన అభినందనీయుడు, దానికి అందరం సహకరించాలి.నిర్మాతలకి, డబ్బింగ్ వాళ్ళకి ప్రభుత్వం ఇల్లు స్థలాలు ఇచ్చింది కానీ, కార్మికుల విషయంలో మాత్రం మొండిచేయి చూపించింది. సినిమా వాళ్ళకు స్థలం కావాలని కోట్ల విజయభాస్కర్ రెడ్డిని అడిగితే 70 ఎకరాలు కొండ ప్రాంతంలో ఇచ్చారు. వాటిని చదును చేసి ఇళ్ళు, స్టూడియోలు నిర్మించాం. దీనివెనుక కార్మికుల కృషి ఎంతోవుంది" అని తెలిపారు.
సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ "సినీ కార్మికులకు, సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుంది. సినీ కార్మికులకు ఇళ్ళు, స్థలాలు ఇచ్చే విషయంలో కృతనిశ్చయంతో వుంది. సాధారణ ప్రజలకు వర్తించే అన్ని పథకాలు, అర్హులైన సినీ కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటాం. సిఎం కెసిఆర్ సినిమా వాళ్ళ ఆస్తులు దోచుకుంటారని పుకార్లు పుట్టించారు. అదంతా నిజం కాదు. ఆయన పరిశ్రమ అభివృద్దిని కాంక్షిస్తున్నారు" అని చెప్పారు.
ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ "చెన్నై నుండి పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో కార్మికులంతా అన్నా అని పిలిచి తమవాడిని చేసుకున్నారు. ఇది వారిచ్చిన పునర్జన్మగా భావిస్తున్నాని, సినీ పరిశ్రమ హైదరాబాద్ లో ఉండటానికి దాసరి గారే కారణమని" చెప్పారు.
ప్రముఖ రచయిత పరచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "గతంలో చెన్నై సినీ పరిశ్రమలోని కొందరు మమ్మల్ని హేళన చేసారు ఇప్పుడు వారు వచ్చి చూస్తే ఆశ్చర్యపోయేంతలా సినీ పరిశ్రమ ఉంది. సినీ కార్మికులకూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాను"అని తెలిపారు.
ఎమ్మెల్యే బాబుమోహన్ మాట్లాడుతూ "నిర్మాతకు నష్టం కలగకూడదని సినీ కార్మికులు ఒళ్ళు దాచుకోకుండా శ్రమిస్తున్నారు" అని అన్నారు. నటుడు, 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ 37 సంవత్సరాలుగా మీ మధ్యనే ఉంటున్న మీ మనిషినే అని సినీ కార్మికులతో తనకు గల అనుబంధాన్ని పంచుకున్నారు. వారికి అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటాన" అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి తెలుగు చలన చిత్రం సమాఖ్య అధ్యక్షుడు కొమర వెంకటేష్, కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి పి.ఎస్ఎన్.దొరతో పాటు దర్శకుడు ఎన్.శంకర్, కొడాలి వెంకటేశ్వరరావు, శివాజీ రాజా, కాదంబరి కిరణ్, జెమిని కిరణ్, శ్రీశైలం యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్ అయిన లైట్ మెన్ లకు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. అతిథులకి, 24 సంఘాల అధ్యక్షులకి ఆత్మీయ సత్కారం చేశారు.