ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో వారసత్వ పోరు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పదేళ్లుగా అధినేతకు కుడిభుజంగా వ్యవహరిస్తూ పార్టీని పటిష్టపరిచిన హరీష్‌రావు అంటే ఇప్పుడు కేసీఆర్‌కు పడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన ప్లీనరీ సమావేశం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు నం.2 పొజిషన్ కోసం అటు కేటీఆర్.. ఇటు హరీష్‌రావుల మధ్య అంతర్గతంగా ఓ యుద్ధమే కొనసాగుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు ప్రాధాన్యత పెంచడానికి అతణ్ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశముందున్న వార్త కథనాలు కూడా వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్లీనరీ వేదికపై హరీష్‌రావుకు మొదటి లైన్‌లో స్థానం కల్పించకపోవడం అటు పార్టీ వర్గాలను.. ఇటు మీడియాను కూడా విస్మయపరిచింది. అంతేకాకుండా సభ మొదలైన తర్వాత నింపాదిగా వచ్చిన హరీష్ మెల్లిగా వెళ్లి వెనక సీటులో కూర్చున్నారు. సాధారణంగా టీఆర్‌ఎస్ సభల్లో అన్ని తానై వ్యవహరించే హరీష్‌రావు ఇలా కొత్తగా నడుచుకోవడం కాస్త విస్మయపరిచే విషయమే.
ఇక ప్లీనరీలో మాట్లాడానికి కేటీఆర్ వేదిక మైక్ వద్దకు వచ్చినప్పుడు హర్షాతిరేకాలతో కార్యకర్తలు స్వాగతించారు. ఇంతవరకు బాగానే ఉన్న హరీష్‌రావు వచ్చిన సమయంలో స్టెడియం మారుమోగిపోయింది. కేటీఆర్ మైక్ ముందుకు వచ్చిన సమయంలో కంటే కూడా హరీష్‌రావు వచ్చినప్పుడే కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీన్నిబట్టి కార్యకర్తల్లో కేటీఆర్ కంటే కూడా హరీష్‌రావుకే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక ప్లీనరీలో బహిర్గతమైన విభేదాలను విపక్షాలు తమ విమర్శలకు వాడుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.