కృష్ణా జిల్లా అటవీ ప్రాంతంలో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ఏపీ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఓవైపు రాజధాని నిర్మాణం కోసం రైతులనుంచి వేలకు వేల ఎకరాలు లాక్కుంటున్న ప్రభుత్వం ఇలా.. గురువులకు వందలకు వందల ఎకరాల భూమిని కేటాయించడంపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగాయి. దేశవ్యాప్తంగా జగ్గీ వాసుదేవ్‌కు యోగా గురువుగా ఎంతో పేరుంది. ఆయన స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం కూడా వాసుదేవ్ ఆధ్వర్యంలో గతంలో ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు మూడు రోజుల యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. ఇంతలోనే ఈషా ఫౌండేషన్‌కు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో 400 ఎకరాల అటవీ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీకి పెద్ద సంస్థలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈషా ఫౌండేషన్‌కు భూమి కేటాయింపులతో అక్కడ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. అయితే చంద్రబాబు తన స్వలాభం కోసమే ఈషా ఫౌండేషన్‌కు భూములు కేటాయించారని, అత్యంత వేగంగా, గోప్యంగా ఆ ఫైలు ముందుకు వెళ్లడమే దీనికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శైలాజానాథ్‌లు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల విలువచేసే భూములను అత్యంత చౌకగా ఆయనకు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తున్నారు.