నమ్ముకుంటే నట్టేట ముంచేట్లు కనబడుతోంది సింగపూర్ వ్యవహారం. ఏపీ రాజధానికి సంబంధించి ప్రజలు బాబుపై నమ్మకంతో టీడీపీకి ఓటేస్తే.. ఆయన తన పూర్తి నమ్మకం సింగపూర్ మీదనే పెట్టుకున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనుల మీద చంద్రబాబు పలుమార్లు సింగపూర్‌కు కూడా పోయి వచ్చారు. పది రోజుల క్రితమే సింగపూర్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను చంద్రబాబుకు అప్పగించింది. అయితే సింగపూర్ సంస్థ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటుందా..?, నిధుల సమీకరణకు తోడ్పాటునందిస్తుందా?? మాస్లర్‌ప్లాన్ మొత్తం పూర్తయ్యే వరకు ఏపీకి బాసటగా నిలుస్తుందా తదితర విషయాల్లో తెలుగు ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయి. ఎట్టకేలకు ఈ అనుమానాలను సింగపూర్ మంత్రి షణ్ముగం పటాపంచలు చేశారు. రాజధాని నిర్మాణంలో తాము పాలుపంచుకోమని, కేవలం ప్లానింగ్ మాత్రం వరకు మాత్రమే పరిమితమవుతామని చెప్పారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణానికి సంబంధించి భూముల సమీకరణ వివాదంపై కూడా ఆయన స్పందించడానికి ఇష్టపడలేదు. దీన్నిబట్టి రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధుల సమీకరణకు కూడా సింగపూర్ ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. సింగపూర్ బ్రాండ్ నేమ్ చెప్పుకొని రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరించవచ్చనుకున్న చంద్రబాబు ఆశయలు కూడా ఇక అడియాసలైనట్టేనన్న వాదనలు రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నాయి.