శేషాచలం అడవులు రక్తసిక్తమయ్యాయి. ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో రెండు వేర్వేరు చోట్ల దాదాపు 20 మందికిపైగా మృతిచెందారు. అయితే స్మగ్లర్లు తమపై కాల్పులు జరపడంతోనే తిరిగి కాల్చామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎదురు కాల్పులు జరిగిన దాఖలాలు కనబడకపోవడం పలు అనుమానాలను రేకిత్తిస్తోంది.
కొన్నేళ్లుగా తిరుపతి ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది స్మగ్లర్లు ఇక్కడ అటవీశాఖ సిబ్బందిని కూడా పొట్టనపెట్టుకున్నారు. వందల కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ఫారెస్టు అధికారులకు మరణాయుధాలు కూడా సరఫరా చేసింది. ఇక సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో స్మగ్లర్లు లేరని, వారంతా దినసరి కూలీలేనన్న వాదనలు వినబడుతున్నాయి. తెరవెనుక పెద్దలు ఉండి వీరికి రోజు లెక్కన కూలి కట్టిస్తు అక్కడ చెట్లు కొట్టిస్తున్నారని సమాచారం. అయితే ఈ కూలీల్లో కూడా ఎక్కువ మొత్తం తమిళనాడుకు చెందినవారే ఉన్నారు. దీంతో తమ రాష్ట్రానికి చెందిన 20 మంది కూలీలను ఏపీ ప్రభుత్వం పొట్టనపెట్టుకుందని అక్కడి పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని తమిళ సంఘాలు తెలుగువారికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగాయి. దీంతో చెన్నైలోని తెలుగువారి ప్రాణాలు, ఆస్తులు ఇప్పుడు ముప్పులో పడ్డాయి. వారి ఆస్తులపై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ను అటు తమిళ పార్టీలే కాకుండా ఏపీ, తెలంగాణల్లోని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి.