ఈమధ్య కాలంలో వాస్తుకు ఎనలేని ప్రాధాన్యత లభిస్తోంది. ఇటు ఏపీ అటు తెలంగాణల్లో కూడా ప్రభుత్వాలు వాస్తుకు ప్రాధాన్యతనిస్తుండటం ప్రజలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో వాస్తుదోషం ఉందని ఏకంగా సచివాలయాన్నే మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తానేం తక్కువ తినలేదంటూ చంద్రబాబు కూడా వాస్తు పేరిట మరమ్మతుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేస్తున్నారు. ఆయన ప్రభుత్వ కార్యాలయాకే పరిమితం కాకుండా దశాబ్దాలుగా తాను నివసిస్తున్న గృహసముదాయాన్ని కూడా సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రస్తుతం తాను నివాసముంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నెం.65లోని ఇంటిని పడగొట్టి వాస్తు ప్రకారం కొత్త ఇల్లును నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ ఇంటి నిర్మాణం కోసం ప్రస్తుతం చంద్రబాబు అద్దె ఇంట్లోకి మారనున్నారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం 25లో ఓ ఇంటిని ఆయన అద్దెకు తీసుకుంటున్నారు. ఈనెల 12న ఆయన అద్దె ఇంట్లోకి మారనున్నాడు. ఆ వెంటనే రోడ్ నం.65లోని ఇంటిని పడగొట్టి కొత్త నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.