జీహెచ్‌ఎంసీ ఎన్నికలను సాధ్యమైనంత అధిక కాలం సాగదీయడమే టీఆర్‌ఎస్ ఆలోచనలా కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారో తెలియజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరో 249 రోజులు అంటే డిసెంబర్ వరకు గడువు కావాలని ప్రభుత్వం తరఫున తెలంగాణ ఏజీ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత సమయం ఇవ్వలేమని, ఎన్నికల నిర్వహణకు మరో తేదీని ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే గ్రేటర్‌లో డివిజన్‌ల విభజన ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్నదని, త్వరగా ఈ విషయాన్ని తేల్చలేమని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్‌లను 200 డివిజన్‌లుగా విభజించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియకు కనీసం 8 నెలల సమయం కావాలన్నది సర్కారు వాదన. మరి హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.