పార్ట్ 3
పవన్‌కళ్యాణ్ గారూ మీరూ చంద్రబాబుని ఇంతకాలం ఎలా సమర్ధించారు?
కుప్పలు తగులబెట్టి పేళాలు ఏరుకోమంటున్న నాయకుడ్ని చూస్తున్నాం!
రాష్ట్ర విభజన వలన ఆర్ధికంగా తెలంగాణ ఎంత బలంగా వుందో, ఆంధ్రప్రదేశ్ ఎంతగా అట్టడుగు స్థాయికి చేరిందో ప్లానింగ్ కమీషన్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ చరిత్రని పరికిస్తే ఎన్నో దేశాలు, జాతులు యుద్ధాల వలన ఉనికినే కోల్పోయే దుర్భర పరిస్థితినుంచి మహోన్నత దశకు చేరుకున్న సంఘటనలు కనిపిస్తాయి. జాతి పునర్నిర్మాణానికి యువతను ఉత్తేజపరిచిన నాయకత్వాన్ని చూస్తాం. రాష్ట్ర రాజధానిలేక ` శాసన సభ, మండలి, సెక్రటేరియేట్, రోడ్లు, అంతర్జాతీయ స్థాయి ఉపాధి కేంద్రాలు, విద్య ` వైద్య వసతులు లేక రోడ్డునపడిన జాతిని కష్టపడటానికి- పునర్నిర్మాణానికి అంకితమయ్యేలా చూడటానికి నాయకుడు నడుం బిగించాలి. అంతేగాని ‘మీకు రాజధాని ఇస్తున్నాం ` మీకు ఐటి ఇండస్ట్రీ ఇస్తున్నాం ` మీకు ఫార్మా రంగాన్ని ఇస్తున్నాం’ అంటూ ప్రకటనలు గుప్పించి పెరిగిన భూముల విలువలు చూపించి సంతోషపడండి అని చెప్పే నాయకుడ్ని ఇప్పటివరకూ ఎక్కడా చూడకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూడవచ్చు. ముందుగా ఒంగోలు తర్వాత నూజివీడు రాజధాని అని లీకులిచ్చారు, ఆనక తుళ్ళూరు అని తేల్చేశారు! రియల్ ఎస్టేట్ వెంచర్స్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. మీ భూముల ధరలు న్యూయార్కు సిటీని దాటిపోయాయి అంటూ ‘అహ నా పెళ్ళంట’ సినిమాలో వ్రేలాడదీసిన కోడిని చూసి కోడి మాంసం తింటున్న అనుభూతిని పొందిన కోటా శ్రీనివాసరావు వలె వుంది ఆంధ్రుల పరిస్థితి. కృష్ణానదిపై వంతెనలు - లంకభూములలో పర్యాటకం - బహుళ అంతస్థుల భవనాలు - మెట్రోరైళ్ళు : రోజుకో ప్రకటన. చివరకు ‘ఈ నెల జీతాలెలా?’ అని కేంద్రంవైపు దీనంగా చూడటం!
పవన్ కళ్యాణ్‌గారూ ఇటువంటి నాయకత్వాన్నా మీరు ఇంతకాలం బలపరిచింది!
ప్రజలకు వాస్తవాన్ని ఎందుకు చెప్పరు? ప్రజలను పదేళ్ళపాటు కష్టాలకి మానసికంగా సిద్ధంచేయండి. పొరుగునున్న ఒరిస్సా పరిస్థితి మనకన్నా దారుణంగావుంది. కానీ ప్రజలు నవీన్ పట్నాయక్‌ని నమ్మడానికి కారణం - ఆయన ఏం చేస్తాడో అదే చెబుతాడు. వాస్తవానికి నవీన్ పట్నాయక్ కన్నా 1999 -2004 వరకు చంద్రబాబు చాలా బాగా చేశారు. కానీ చేసిన దానికన్నా ఎక్కువగా చెప్పుకోవడంతో, ప్రజల అంచనాలను -ఆశలను ఆయన అందుకోలేకపోయారు. ఇప్పుడు జరుగుతున్నదీ అదే! రాజధాని భూసేకరణపై ఎందుకింత డ్రామా?
(మరికొంత నాల్గవ భాగంలో)