రాష్ట్ర విభజన జరిగాక తెదేపా జాతీయ పార్టీగా ప్రకటించుకుంది. జాతీయ పార్టీ అంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాకూడదు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో పొరుగునే ఉన్న తమిళనాడు ఉంది. అక్కడ తెలుగువారి సంఖ్య ఎక్కువ. కొద్ది రోజులుగా తమిళనాడులో తెలుగువారి పట్ల వివక్ష చూపుతున్నారనే విమర్శలున్నాయి. పాఠశాలల్లో తెలుగు మీడియం తొలగించారు. తెలుగువారి హక్కులను కాలరాశారు. దీనికి వ్యతిరేకంగా తమిళనాడులోని తెలుగు సంఘాలు పోరాడుతున్నాయి. ఎన్నికల్లో ప్రభావితం చేసేంత మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తమ హక్కులను కాపాడే పార్టీకే ఓటు వేయాలని తెలుగువారు నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ కనీసం కొన్ని స్థానాలకైనా పోటీ చేసి ఉంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగువారికోసమే పుట్టినపార్టీ తెదేపా. ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదిగింది కాబట్టి తమిళనాడు ఎన్నికల బరిలో దిగినపక్షంలో అక్కడి తెలుగువారికి అండగా ఉండే అవకాశం లభించేది. గెలుపు, ఓటమి సంగతి పక్కన బెడితే రాజకీయ పార్టీలు తెలుగు వారి హక్కుల గురించి దృష్టిసారించేవి. ఇలాంటి అవకాశాన్ని తెదేపా వదులుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తమిళులు ఎక్కువగా ఉంటారు. ఇది గ్రహించే తమిళ పార్టీలు ఎన్నికలు జరిగినపుడు తమ పార్టీ అభ్యర్ధులకు బరిలోకి దింపుతూ, తమ గుర్తింపును కాపాడుకుంటుంటాయి. ఇలాంటి ఆలోచన తెదేపా, వైకాపాలకు లేకపోవడం శోచనీయం.