ఈఏడాది ఎండలు ఎక్కువ అంటూ అందరూ మాట్లాడుకోవడమే కాదు.. రథసప్తమి వెళ్ళగానే సూర్య భానుడి భగభగలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు ప్రజలను భయపెట్టేసాయి. శివరాత్రి వరకు కూడా చలి కాలం లేదు శివరాత్రికి శివ శివా అంటూ చలి వెళ్ళిపోతుంది. అసలు వేసవి మొదలవుతుంది అంటారు. కానీ ఈ ఏడాది అలాంటి సామెతలకు అస్సలు అవకాశం లేకుండా పోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి నడుమ లోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో తెలంగాణ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఓజోన్ పొర ప్రభావం తగ్గడంతో ఎండల తీవ్రతకు మనుషుల్లో చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అధిక ఎండల వలన కళ్లు మండటం, చర్మ సంబంధిత సమస్యలు, చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఫుణలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు ఎండల్లోకి రాకుండా ఉండాలని, వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.