నందమూరి బాలకృష్ణ తనకు ఎంతో ప్రియమైన సంగీత దర్శకుడు తమన్‌కు ఓ విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు. బాలయ్య, తమన్ కాంబినేషన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస బ్లాక్‌బస్టర్లతో ఈ ఇద్దరి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాల పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగానూ వీరిద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడింది. బాలయ్య అయితే తమన్‌ను ప్రేమతో నందమూరి తమన్ అని పిలుస్తూ సన్నిహితంగా ముచ్చటించేవాడు. ఈ అనుబంధానికి గుర్తుగా బాలయ్య తాజాగా తమన్‌కు ఖరీదైన కారును బహుకరించాడు. ఈ కార్ విలువ దాదాపు కోటి రూపాయలకు పైగానే ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కొత్తగా కొనుగోలు చేసిన పోర్స్చే బ్రాండ్ కారును బాలయ్య స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించి తమన్‌కు అందజేశాడు. ప్రస్తుతం వీరిద్దరి అనుబంధాన్ని చాటేలా కొత్త కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి హిట్స్ వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇప్పుడు అఖండ 2 కోసం తమన్ ప్రత్యేకంగా పని చేస్తున్నాడు. ఈ సక్సెస్ ఫార్ములా మళ్లీ వర్కౌట్ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
బాలయ్య, తమన్ కలిస్తే థియేటర్లలో సందడి ఖాయం. గతంలో అఖండ, డాకు మహారాజ్ టైంలో థియేటర్లలో స్పీకర్లు దాదాపు పగిలినట్లు ఫ్యాన్స్ చెబుతుంటారు. అఖండ 2 కూడా ఇదే స్థాయిలో ఉంటుందని తమన్ ముందుగానే హింట్ ఇచ్చాడు. ఇప్పుడు షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
తమన్ నందమూరి ఫ్యామిలీలో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్నాడు. నారా భువనేశ్వరి కూడా తమన్‌ను నందమూరి తమన్ అని సంబోధించడంతో ఆయన నందమూరి కాంపౌండ్‌లో ఓ వ్యక్తిగా నిలిచిపోయాడని అభిమానులు భావిస్తున్నారు.