ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైన వైసీపీకి రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. అసలే గెలిచిన క్రికెట్ టీమ్-11 మందిని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్న పార్టీకి.. వరుస రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే కీలక నేతలు, మాజీలు రాజీనామా చేయగా.. ఇదే లైన్‌లో సిట్టింగులు కూడా ఉన్నారనే వార్తతో హైకమాండ్ బెంబేలెత్తిపోతోంది. సరిగ్గా ఈ సమయంలోనే వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నటుడు, వైసీపీ నేత అలీ ఓ వీడియో రూపంలో ప్రకటించారు. అయితే.. తాను అలీగా మాత్రమే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇక నుంచి తాను ఏ పార్టీకి నాయకుడిని కాదన్నారు. గతంలో కూడా తాను ఉన్న పార్టీ నాయకుడు చేసిన మంచి గురించి చెప్పానంతే కానీ.. ఏ పార్టీలను, ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించిన పరిస్థితుల్లేవని అలీ స్పష్టం చేశారు. ఇకపై రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు.. కామన్ మ్యాన్‌గా ఉంటూ ఎన్నికల సమయంలో ఓటు మాత్రమే వేస్తానని ప్రకటించేశారు.
ఆశలు ఆవిరి..!
వాస్తవానికి ఏదైనా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉంటూ.. ప్రజల కోసం పోరాడాల్సిన వ్యక్తులు రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సరిగ్గా వైసీపీ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. 2019 ఎన్నికల ముందు.. అలీ రాజకీయ భవిష్యత్తుపై ఏ రేంజిల్ హైడ్రామా నడిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు తిరిగి.. ఇటు తిరిగి ఆఖరికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం, ఆ మరుసటిరోజే వైసీపీ కండువా కప్పుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. తొలుత రాజమండ్రి అని, ఆ తర్వాత విజయవాడ వెస్ట్ లేదా గుంటూరు జిల్లాలో మైనార్టీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఎంతో ఆశపడ్డారు. టికెట్ దక్కకపోవడం ఆఖరికి నిరాశే మిగిలింది. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవికే పరిమితం అయ్యారు అలీ. ఆ మధ్య ఈసారి రాజ్యసభకు పంపే యోచనలో వైసీపీ ఉందని వార్తలు కూడా గుప్పుమన్నాయి. సీన్ కట్ చేస్తే.. వైసీపీ ఓడిపోయి నెలరోజులు గడువక ముందే ఇలా రాజీనామా చేయడం గమనార్హం.
సడన్‌గా ఎందుకో..!?
వాస్తవానికి.. 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఎక్కడా కనిపించకపోవడమే కాదు.. కనీసం ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా సాహసించలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరే ఉండేదేమో..! కానీ పార్టీ ఓడిపోవడంతో రాజీనామా చేసేశారు. ఈయన టీడీపీ లేదా జనసేనలో చేరడానికి అవకాశాలున్నప్పటికీ ఆయన ఎందుకో ప్రయత్నాలు చేయలేదు. ఎందుకంటే.. ఏ ఎండకు ఆ గొడుగు అనే మాటలు వస్తాయని ముందే ఊహించారని అర్థం చేసుకోవచ్చు. పైగా పొలిటికల్ ఎంట్రీ అనేది 1999లో టీడీపీ నుంచే జరిగింది. 20 ఏళ్లపాటు టీడీపీలో కొనసాగారు కూడా. ఇప్పటికిప్పుడు పసుపు కండువా కప్పుకున్నా ఎవరూ కాదనరు కానీ.. ఆ ట్రోలింగ్స్, మీమ్స్ దెబ్బకు అలీ తట్టుకోలేరంతే. ఇక తన ఆప్తుడు, ఆత్మీయుడు అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.. ఈ పార్టీలో చేరినా పెద్ద అభ్యంతరాలేమీ రావు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరినా సరే.. అడ్డంగా బుక్కవ్వడం ఖాయమని, ఉన్నంతలో ప్రశాంతంగా ఉందామని ఫిక్స్ అయిన అలీ.. పూర్తిగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. మరోవైపు.. వైసీపీలో చేరాక పెద్దగా సినిమా అవకాశాలు కూడా రావట్లేదని.. నోటికాడికి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతున్నాయని ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే కామెంట్స్ సైతం కొందరి నుంచి వినవస్తున్నాయి.