కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.. అని మహాపురుషుడు, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మాటను సమయం, సందర్భాన్ని బట్టి గట్టిగానే వాడేస్తుంటాం. కలలు కనొచ్చు.. కానీ అవి సాధ్యమైతే ఫర్లేదు.. కల్లలు అయితేనే ఎక్కడలేని ఇబ్బందులు! ఇప్పుడు సరిగ్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఎందుకంటే.. తాను మరో చంద్రబాబులా అవ్వాలని ఎన్నో కలలు కంటున్నారు. సీబీఎన్‌లాగా అయ్యి.. మంచి పనులు చేస్తే మంచిదే కానీ సీన్ రివర్స్ అయితేనే లేనిపోని ఇబ్బందులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇంతకీ రేవంత్ మనసులోని మాట ఏంటి..? సడన్‌గా ఎందుకిలా మాట్లాడేశారనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
అసలేం జరిగింది..?
అబ్బే.. నారా చంద్రబాబు నాకు గురువా..? ఆయనకూ నాకేంటి సంబంధం..? ఆయన టీడీపీ అధ్యక్షుడు, నేను పార్టీలో ఒక మెంబర్‌ను.. కేవలం సహచరుడిని మాత్రమే. గురువు అని ఎవరైనా చెబితే లాగి కొడతాను అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు గుర్తున్నాయ్ కదా..! ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగి కూటమి ఘన విజయం సాధించి సీఎం నారా చంద్రబాబు ప్రమాణం చేయడంతో ఒక్కసారిగా ప్లేట్ మార్చేశారు రేవంత్. తనకు చంద్రబాబే ఆదర్శం అని చెబుతున్నారు. తాను గతంలో 12 గంటలు మాత్రమే ప్రజల కోసం పని చేస్తే చాలని అనుకునేవాడిని.. కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 18 గంటలు పని చేసే వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఒక ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే మరొక మంచి ఆటగాడితో పోటీ పడాలని సెలవిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు గనుక.. తనతో సహా అధికారులంతా అంతే ధీటుగా 18 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం.
విజనరీతో పోటీనా..?
నిన్న, మొన్నటి వరకూ చంద్రబాబు ఎవరంటే అబ్బే అన్నట్లుగా ప్రవర్తించిన రేవంత్.. సడన్‌గా ఇలా ఏపీ సీఎం గురించి ప్రస్తావన తేవడంతో ఒకింత ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అంటే తొలుత గుర్తొచ్చేది విజనరీ.. ఆయన గురించి చెప్పాలంటే హైదరాబాద్ ఒక్కటి గుర్తు తెచ్చుకుంటే చాలు..! రాళ్లు, రప్పలుగా ఉన్న హైటెక్ సిటీ, సైబర్ టవర్స్.. ఇలా ఒటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయి. అందుకే చంద్రబాబును అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్.. విజనరీకి మారు పేరు అని మేథావులు సైతం అంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి పోటీ పడాలని తాపత్రయపడుతున్నారు. పోటీ పడటంలో తప్పులేదు కానీ.. ప్లాప్ అయితేనే అసలుకే ఎసరు వస్తుంది. వాస్తవానికి సీబీఎన్‌తో ఇంతవరకూ పోటీ పడి గెలిచిన దాఖలాల్లేవ్.. మరి గురువుతో శిష్యుడు పోటీ అంటే పెద్ద కిక్కించే విషయమే.. మరి రేవంత్ ఏ మాత్రం రాణిస్తారో చూడాలి..!