అవును.. సరైనోడి చేతికి పగ్గాలిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో..! ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడో లెక్క..! ఇప్పుడే అసలు సిసలైన సుపరిపాలన అనేది మొదలైంది..! ఇవీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌ను చూసి యావత్ తెలుగు ప్రజలు అనుకుంటున్న మాట. ఇక ఎలాగో వ్యతిరేకించే, విమర్శించే వాళ్లు ఉండనే ఉంటారు.. వాళ్ల గురించి ఆలోచించడం, మాట్లాడుకోవడం అప్రస్తుతం. ఇంతకీ పవన్ గురించి ఇంతలా ఎందుకు జనాలు చర్చించుకుంటున్నారు..? సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఎందుకు మారారు..? ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి తెలుసుకుందాం..!
ఇదీ అసలు సంగతి!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కూటమి కట్టిన జనసేన100% స్ట్రైక్ రేట్‌తో సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కూటమి కట్టడంలో, ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలక పాత్రే పోషించారు. అందుకే సేనానికి ఎక్కడా ప్రియారిటీ తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. తొలుత డిప్యూటీ సీఎం పదవి.. ఆ తర్వాత పవన్ కోరిన కీలక శాఖలన్నీ ఇవ్వడం జరిగింది. అటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆ మరుక్షణం నుంచే పవన్ ఆన్ డ్యూటీ రంగంలోకి దిగిపోయారు. ఇక చూస్కో.. అధికారులతో వరుస సమీక్షలు చేస్తూ బిజిబిజీగా గడిపేస్తున్నారు. 19న ఛార్జ్ తీసుకున్న ఆయన.. తొలిరోజే 10 గంటల పాటు గ్యాప్ లేకుండా రివ్యూ నిర్వహించారు. ఆ మరుసటి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్. ఇక 21 తారీఖున అసెంబ్లీలోకి అలా అడుగుపెట్టి.. ప్రమాణం చేసొచ్చిన గంటకే మళ్లీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
భయపడిపోతున్నారే..!
సాధారణంగా మంత్రి లేదా సీఎం సమీక్ష అంటే ఎలా ఉంటుందో.. అధికారులు ఎలా ఉంటారో ఇప్పటి వరకూ మనం చూసే ఉంటాం. కానీ పవన్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. సేనానితో సమీక్ష అంటే చాలు అధికారులు గజగజ వణికిపోతున్నారట. ఎందుకంటే.. ఆయన ఏం అడుగుతారో.. ఏమని సమాధానం చెప్పాలో..? ఏం లొసుగులు బయటపెడతారో అని భయపడిపోతున్న పరిస్థితట. శుక్రవారం నాడు ఆర్థిక సంఘం నిధులపై ఆరా తీశారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఛీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పవన్ మాట్లాడుతున్న మాటలు, ఆయన తీరును చూసి మంత్రులు, అధికారులు ముక్కున వేలేసుకున్న పరిస్థితట.
లెక్కలు తీయాల్సిందే..!
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం, ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులపై తొలి రివ్యూ మీటింగ్ జరపగా నిధులన్నీ సీఎఫ్ఎంఎస్‌కు తరలించినట్లుగా పవన్ గుర్తించారు. దీంతో నిధులు ఎందుకు మళ్లించారు..? ఎవరు ఆదేశాలతో నిధులు మళ్లించారు..? పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు ఎందుకిలా చేశారు..? కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత..? ఎంతమేర పక్కదారి పట్టించారు..? అనేది పూసగుచ్చినట్లుగా నివేదిక కావాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అసలు వ్యవస్థలో ఏం జరుగుతోందని కన్నెర్ర జేయడంతో అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పరిస్థితి నెలకొందట. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు సీరియస్ అంశమని ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని ఫైనల్‌గా పవన్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారని తెలిసింది. ఇక గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుకుండా చూడాలని ఆదేశించగా.. నిధులు లేవు సార్ అని అధికారులు అన్నారు. దీంతో చిర్రెత్తుకుపోయిన సేనాని.. నిధులన్నీ ఎందుకు ఇలా చేశారంటూ మరోసారి ఆగ్రహానికి లోనయ్యారు. ఈ ఒక్క రివ్యూ అధికారులు జంకిపోయారట. ఈ విషయాలన్నీ బయటికి పొక్కడంతో ఇదీ.. ఇదే జనాలకు కావాల్సింది..! సరైనోడి చేతికి పగ్గాలిస్తే సుపరిపాలన అనేది ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసొస్తుందంటూ జనాలు చెప్పుకుంటున్నారు. చూశారుగా.. డిప్యూటీ సీఎం పవర్ అంటే ఏంటో.. మున్ముందు ఇంకా ఎలా ఉంటుందో ఏంటో..!