చిరుకు పవన్ వద్దు.. సీఎం రమేషే ముద్దు!!
అబ్బే రాజకీయాలు నాకొద్దు.. సినిమాలే ముద్దు.. అస్సలు ఇకపై పాలిటిక్స్ ప్రస్తావన తీసుకురాను..! ఇవీ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రతిసారీ ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలు. సీన్ కట్ చేస్తే పట్టుమని నాలుగైదేళ్లు తిరగకముందే యూటర్న్ తీసుకున్నారేమో సందేహాలు మెగాభిమానుల్లో వస్తున్నాయి. ఇంతకీ బాస్ పాలిటిక్స్‌లో ఎందుకు వేలు పెడుతున్నట్లు..? ఇంట్రెస్ట్ ఉంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనవచ్చు కదా..? అనే ప్రశ్నలు అభిమానులు, ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి.
ఇదీ అసలు సంగతి!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యమే. ఇది ఎంత నిజమో.. రాజకీయాలకు దూరమైన నేతలు కూడా వాటి ప్రస్తావన, వేలు పెట్టకుండా ఉండరన్నది అంతకుమించి నిజమన్నది చిరంజీవిని చూస్తే తెలుస్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా.. సింగిల్‌గా వస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో కూటమి అభ్యర్థులు ఏ చిన్నపాటి చాన్స్ వచ్చినా సరే.. సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి, బిజినెస్‌మెన్ సీఎం రమేష్.. చిరంజీవిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మద్దతివ్వాలని కోరారు కూడా. ఆ మధ్య ఇది పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది. అంతటితో ఆగలేదు.. మరోసారి మళ్లీ కలవడం..ఈసారి ఏకంగా వీడియో కూడా రిలీజ్ చేయడాన్ని బట్టి చూస్తుంటే రమేష్ కోసం ఎంతలా చిరు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రమేష్‌ను జాకీలేసి మరీ గట్టిగానే లేపుతున్నారు చిరు. ఇన్నాళ్లు పాలిటిక్స్ పక్కనెట్టిన చిరు.. మెల్ల మెల్లాగా పాలిట్రిక్స్ షురూ చేశారని మాత్రం క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు.
తమ్ముడొద్దా అన్నయ్యా..!
సీఎం రమేష్ కోసం ఇంత హడావుడి చేస్తున్న చిరంజీవి.. సొంత తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పట్టించుకోకపోవడం గమనార్హం. రాజకీయాల గురించి చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నానని మరీ చెప్పిన మెగాస్టార్.. ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు పవన్, చంద్రబాబు.. కేంద్రంలో మోదీ కలిసి కూటమిగా ఏర్పడటం సంతోషంగా ఉందని.. ఇదొక మంచి పరిణామం అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధి పథంలో నడవాలంటే సీఎం రమేష్, పంచకర్ల రమేష్ లాంటి వ్యక్తులు గెలవాలని ఆకాంక్షించారు. మరి పవన్ కల్యాణ్ సంగతేంటి..? తమ్ముడిని అన్నయ్య ఎందుకు లైట్ తీసుకున్నారో ఎవరికీ అంతుచిక్కట్లేదు. వాస్తవానికి ఈ ఎన్నికలు జనసేనకు, ముఖ్యంగా పవన్‌కు డూ ఆర్ డై లాంటివి.. గెలిస్తే సరే లేకుంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా అయ్యే ఛాన్స్ ఉంది.. అలాంటిది పవన్ కోసం చిరు ఏదో ఒకటి చేయొచ్చు.. కానీ ఇదిగో ఇలా ఇంటికి వచ్చిన వారితోనే సరిపెట్టుకోవడం ఎంతవరకూ సబబో మరి.