పవన్.. అంత ఆషామాషీ కాదబ్బా!
అవును.. ఎన్నికల ముందే పిఠాపురంలో గెలిచేశాం.. ఇక నియోజకవర్గ ప్రజలు అలా ఓటేయడం.. నేనిలా ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం అంతే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనమైంది. అసలు పవన్‌లో ధీమా ఏంటి..? ఓటుకు లక్ష రూపాయిలిచ్చినా గెలుస్తానని అంత కాన్ఫిడెన్స్‌గా ఎలా చెప్పగలుగుతున్నారు..? నిజంగానే పవన్‌పై పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత రూ. 100-150 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధమయ్యారా..? ఇంతకీ పిఠాపురంలో ఏం జరుగుతోంది..? అసలు పవన్ ఇక్కడ్నుంచి ఎందుకు పోటీచేస్తున్నారు..? సేనానికి ఉన్న ప్లస్‌లు ఏంటి..? ఎవరీ గీత.. ఈమె ట్రాక్ రికార్డ్ ఏంటి..? నాడు చిరుకు జరిగిన పరిస్థితులను వీరాభిమానులు, జనసైనికులు ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు Cinejosh.com పొలిటికల్ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం రండి..
పక్కా వ్యూహంతోనే..!
పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసి తీరాల్సిందేనని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్. 2009లోనే ఇక్కడ్నుంచి పోటీచేయాలని భావించినప్పటికీ సేనానికి కుదరలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీచేయడం.. ఊహించని రీతిలో ఓటమిని చవిచూడటం జరిగింది. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకూ ఆ రెండు నియోజకవర్గాల్లో ఎలాంటి చిన్న సమస్య తలెత్తినా సరే.. ముందుండి, ప్రభుత్వాన్ని నిలదీస్తూనే వచ్చారాయన. ఈసారి ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారని భావించినప్పటికీ వ్యూహం మార్చిన పవన్.. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో, గెలుపోటములను డిసైడ్ చేసే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ స్వీప్ చేసి తీరాల్సిందేనన్నది కూటమి ప్రధాన టార్గెట్. ఇందులో భాగంగానే జనసేనకు తూర్పు, పశ్చిమలోనూ ఎక్కువ సీట్లను ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ పవన్ తెచ్చుకున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించిన సేనాని త్వరలోనే మరికొందర్ని ప్రకటించబోతున్నారు. ఇక పిఠాపురం నుంచి తాను పోటీచేస్తే కాకినాడ పార్లమెంట్‌తో పాటు.. దీని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని రావొచ్చని పవన్ ప్లాన్. అందుకే కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్దమైపోయారు పవన్. ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తే.. పిఠాపురం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (కాకినాడ ఎంపీ అభ్యర్థి).. తాను కాకినాడ లోక్‌సభ నుంచి పోటీచేస్తానని కూడా పవన్ ప్రకటించేశారు.
ఆషామాషీ ఏం కాదు..?
వంగా గీతా వర్సెస్ పవన్‌గా నెలకొన్న ఈ పరిస్థితులను గతంలో పాలకొల్లులో చిరంజీవి వర్సెస్ ఉషారాణి పోటీచేసిన విషయాన్ని జనాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో మెగాస్టార్ కూడా కచ్చితంగా కొట్టేస్తారని.. సొంత ఇలాకాలో గెలవకుండా ఉంటారా..? పైగా కాపు సామాజిక వర్గమున్న జిల్లా, ఇంచార్జ్ కావడంతో గెలుపు పక్కా.. మెజార్టీ ఎంత వస్తుందో చూసుకోవాలంతే అని ప్రజారాజ్యం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం వ్యక్తం చేశాయి. సీన్ కట్ చేస్తే.. పాలకొల్లులో ఉషారాణి గెలవడం అందర్నీ షాక్ గురిచేసింది. అసలు చిరుకు ఎలాంటి సంబంధంలేని తిరుపతి ప్రజలు, అక్కడి సొంత సామాజిక వర్గం చేరదీసి.. గెలిపించి అసెంబ్లీకి పంపింది. ఇప్పుడు పవన్‌పై పోటీచేస్తున్న గీత కూడా సామాన్యురాలేం కాదు.. విద్యావంతురాలు, 1983లో రాజకీయాల్లోకి వచ్చి 1987 వరకూ శిశు సంక్షేమ రీజనల్ చైర్ పర్సన్‌గా పనిచేశారు. 1995-2000 వరకూ తూర్పుగోదావరి జిల్లా జడ్పీటీసీగా, 2000-2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ప్రజారాజ్యం తరఫున 2009లో పోటీచేసి గెలిచిన గీత.. 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో తనకు ఇంత ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో చిరు వ్యతిరేక క్యాంపులో చేరారని చెప్పుకుంటూ ఉంటారు. నాటి నుంచే జగన్‌కు కోవర్టుగా ఉంటున్నారనే ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. అందుకే పవన్‌కు ఈమెపై కోపం అని తెలుస్తోంది. ఆ తర్వాత వైఎస్ చనిపోవడం.. జగన్ వైసీపీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరిపోయి 2019 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచారు. ఒకరకంగా చెప్పాలంటే.. వంగా గీతా సామాన్యురాలేం కాదు ట్రాక్ రికార్డ్ గట్టిగానే ఉంది. పైగా కాపు సామాజిక వర్గమేకావడం మరో ప్లస్. ఈ మొత్తం పరిణామాలన్నీ కాస్త నిశితంగా పరిశీలిస్తే.. పవన్ గెలుపు అంత ఆషామాషీ కాదని రాజకీయ విశ్లేషకలు చెబుతున్నారు.
నాడు.. నేడు అదే సీన్!
ఒక రకంగా చెప్పుకుంటే పవన్‌కు కాపులపై బాగా నమ్మకం ఉంది.. వాళ్లే తనను గెలిపించి చట్టసభల్లోకి పంపుతారని ధీమాగానే ఉన్నారన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. 2019 ఎన్నికల్లో పవన్ పోటీచేసిన గాజువాకలో 50 వేల మంది, భీమవరంలో 70 వేల మంది సొంత సామాజిక వర్గమే ఉన్నా ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు 91వేల ఓట్లు కాపులవే పిఠాపురంలో ఉన్నాయి. మొత్తం 1,70,000 ఓట్లు ఉన్న పిఠాపురంలో 91 వేలు కాపు, బీసీ 40వేలు.. మిగిలిన సామాజికవర్గం సుమారు 40 వేల ఓట్లు ఉన్నాయి. దీంతో కాపు సామాజిక వర్గం తమదే.. గంపగుత్తగా తనకే పడినా గెలిచిపోతానని బహుశా పవన్ నమ్మకమేమో.. అయితే అటు ప్రతర్థి కూడా కాపే.. పైగా పవన్ రాజకీయాలు తెలియక మునుపే రంగప్రవేశం చేసిన మనిషి వంగా గీత అని ప్రత్యర్థులు చెప్పుకుంటున్న మాట. పైగా.. మిమ్మల్ని గెలిపించే బాధ్యత తమదేనని కొందరు చెప్పారని.. ఆ భావనే హృదయాన్ని తాకిందని మంగళవారం నాటి మీడియా మీట్‌లో పవన్ చెప్పారు. ఇదే మాటలు గాజువాక, భీమవరంలో పోటీచేసినప్పుడు ఎంత మంది కాపు కీలక నేతలు చెప్పారో.. చివరికి ఏం చేశారో పవన్ గుర్తెరిగితే మంచిది. తనను కొందరు నిలువెత్తునా మోసం చేశారని.. వారి వల్లే ఓటమిపాలయ్యారని స్వయంగా సేనానినే చెప్పుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తుల మాటలు పవన్ నమ్ముతుండటం గమనార్హం. నాడు ఏ మాటలు అయితే పవన్ నమ్మాడో.. నేడూ అలాగే గుడ్డిగా నమ్ముతున్నారని.. కొందరు జనసేన నేతలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.