పాత సారాయే.. కొత్త సీసాలో పోస్తారట..
జనాలను మార్చడం ఇప్పటికిప్పుడు సాధ్యపడదు కాబట్టి ఏమార్చాలి. బలహీన వర్గాల కోసం చేసిందేమీ లేకున్నా.. ఇక మీదట చేస్తామని నమ్మించాలి. పథకాలకు మెరుగుపెట్టాలి.. ఏదో ఒకలా అధికారాన్ని రాబట్టుకోవాలి. ఇదే వైసీపీ ముందున్న టార్గెట్. ఇప్పటికే వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని సర్వేలన్నీ తేల్చేశాయి. మరోవైపు ఇంటా బయటా అంతా సీన్ రివర్స్ అయిపోయింది. దేవుడి స్క్రిప్టో మరొకటో కానీ గత ఎన్నికల్లో ప్లస్ అయిన అంశాలన్నీ మైనస్ అయి కూర్చున్నాయి. ఈ క్రమంలోనే ఇక ముందున్న లక్ష్యం జనాలను ఏమార్చడం. ఈ క్రమంలోనే వైసీపీ మేనిఫెస్టోకు తుది రంగులు దిద్దుతోందట. అది పూర్తైన వెంటనే మేనిఫెస్టోను విడుదల చేస్తుందట.
నవరత్నాలకు మరింత సానబెట్టి మరీ..
మార్చి 10న బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం సభను నిర్వహించాలని జగన్ బావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఓ వైపు చురుకుగానే కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ సభకు ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఈ సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లన్నింటినీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ సభ కోసం పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు సైతం యత్నిస్తున్నారు. నవరత్నాలకు మరింత సానబెట్టి మరీ మేనిఫెస్టోలో చేర్చారని టాక్. పథకాలకు రింత మెరుగు పెట్టారని సమాచారం. మొత్తానికి పాత సారాయే కానీ దానికి కొంచెం, హంగులూ ఆర్భాటాలద్ది కొత్త సీసాలో పోసి అందిస్తారన్నమాట.
బలహీన వర్గాలను టార్గెట్ చేసేలా..
ఇక ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీ భజన చేస్తున్నారు కాబట్టి సిద్ధం సభలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను టార్గెట్ చేయనున్నారట. దీని కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల 10 నెలల కాలంలో ఏం చేసిందో ప్రజలకు వివరించబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి మేనిఫెస్టో అయితే బలహీన వర్గాలను టార్గెట్ చేసేలా ఉంటుందని సమాచారం. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి ఈ నెల 13, 14 తేతదీల్లో అసెంబ్లీ ఎన్నికల జాబితాను పూర్తి స్థాయిలో వెలువరించనున్నారు. మరోవైపు వైసీపీలో జంపింగ్ జపాంగ్స్ మరింత పెరిగారు. నామినేషన్ వేసే సమయానికి ఎవరు ఏ పార్టీలో ఉంటారనేది కూడా అర్థం కాకుండా ఉంది. ఇక చూడాలి ఏం జరగనుందో..