ఏరు దాటక తెప్ప తగలేశాడంట వెనుకటికొకడు.. అప్పట్లో ఏముంది? ఇప్పటికీ ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరు. గత ఎన్నికలకు ముందు ఈయన గారు ఉత్తర కుమారుడి కంటే ఎక్కువగా ప్రగల్బాలు పలికారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా.. అది చేస్తా.. ఇది చేస్తానంటూ పెద్ద ఎత్తున సవాళ్లు చేశారు. కానీ నాలుగున్నరేళ్లకే సినిమా పూర్తైంది. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్టుంది. ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పుడో మూటగట్టి పైన పెట్టేశారు. అంతటితో ఆగితే బాగానే ఉండు. తాజాగా జగన్ అసెంబ్లీలో పలికిన చిలక పలుకులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ అభివృద్ధి చేయవచ్చు కదా?
ప్రత్యేక హోదా ఎండమావేనని నేడు అసెంబ్లీలో జగన్ తేల్చి పారేశారు. పైగా హైదరాబాద్ వంటి నగరాలు లేకుంటే రాష్ట్రానికి ఆదాయాలు పెరగవట. హైదరాబాద్ ఏమీ పుడుతూనే గోల్డెన్ స్పూన్‌తో పుట్టలేదు కదా. పాలకులు పెట్టుబడులు వచ్చేలా చేశారు. హైదరాబాద్‌లో అన్ని వనరులు ఉండేలా చూశారు. అన్ని రకాలుగా హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. ఉద్యోగాల కల్పన పెరిగింది. దీంతో హైదరాబాద్ కారణంగా తెలంగాణకు ఆదాయం పెరిగింది. మరి జగన్ వచ్చిన తర్వాత ఏదో ఒక నగరాన్ని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేయవచ్చు కదా? అది చేయలేదు. కనీసం రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేసిన ఘనుడు జగన్ కాదా?
నైరాశ్యంలో ఉన్నది జగనా? రాష్ట్రమా?
ఇప్పుడు హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం దారుణమనడమేంటి? గతంలో అంటే ఏపీ, తెలంగాణలు విడిపోయిన సమయంలో రాష్ట్రం మరింత దీన స్థితిలో ఉండేది. మరి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఏమీ నైరాశ్యంతో మాట్లాడలేదే? రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. తనకున్న ఐదేళ్ల సమయంలో కొన్ని పరిశ్రమలను తీసుకొచ్చారు. మరో ఐదేళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చారు. పరిశ్రమలు లేవు. ఉద్యోగ కల్పన లేదు. అభివృద్ధి లేదు. రావడం రావడమే కూల్చివేతలతో రాష్ట్రాన్ని జగన్ అంధకారంలోకి నెట్టేశారు. ఇప్పుడు హోదా ఎండమావంటూ మాటలేంటి? రాష్ట్రం కాదు నైరాశ్యంలో ఉన్నది.. జగన్ ఉన్నారని ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి.