ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు టీడీపీ - జనసేన పొత్తు మరింత హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనతో పొత్తు విషయంలో తొందరపడ్డారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఆది నుంచి కొందరిలో ఆ ఆలోచన ఉండేది కానీ ఇప్పుడు మరింత ఎక్కువ మందిలో కాస్త గట్టిగానే బలపడిందని టాక్.
‘రా.. కదలిరా..’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పరిస్థితుల ప్రభావమో.. మరొకటో కానీ రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇది జనసేన పార్టీ నేతలకు ఒకింత ఆగ్రహం తెప్పించింది. దీనికి వెంటనే ఆ పార్టీ అధినేత పవన్ స్పందించి ఉంటే బాగుండేది. కానీ స్పందించింది లేదు.
60 మందిని బుజ్జగించాలి..
పవన్ తమ పార్టీ నేతలు, కార్యకర్తల ఒత్తిడి మేరకు స్పందించినా కూడా స్పందించే విధానం వేరే ఉంటుంది. ఇంటి గుట్టు బజారున పెట్టుకోకూడదు. కానీ పవన్ పెట్టేశారు. చంద్రబాబు రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి తానూ ప్రకటిస్తున్నానంటూ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇది టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. పైగా మూడోవంతు సీట్లు తీసుకుంటున్నామని చెప్పడం షాకింగ్‌గా మారింది. అంటే దాదాపు 58 స్తానాలు. అన్ని ఇస్తే.. టీడీపీకి మిగిలేవి కేవలం 115 సీట్లే. ఈ విషయాన్ని పక్కనబెడితే టీడీపీ నేతలను 60 మందిని దాకా బుజ్జగించాలి. అంటే పెద్ద మొత్తంలో రెబల్స్‌ను టీడీపీ ప్రోత్సహిస్తున్నట్టే. పైగా రిమోట్ జనసేన చేతిలో పెట్టడమే.
సొంతంగా పోటీ చేసినా గెలవగలం..
పోనీ ఇంతటితో వ్యవహారం ఆగుతుందా? అంటే రేపు ఈ కూటమి గెలిస్తే.. మంత్రివర్గంలోనూ ఎక్కువ సీట్లను జనసేన అడుగుతుంది. అది కూడా టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకే ఇప్పుడు జనసేనతో టీడీపీకి పొత్తు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మరింత దిగజారిందని.. సొంతంగా పోటీ చేసినా గెలవగలమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఒక్కసీటు గెలిచిన పార్టీకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట. ఇందులోనూ ఎంతో కొంత నిజముంది. కనీసం జనసేన బలాబలేంటో కూడా ఇప్పటి వరకూ తెలియలేదు. అదేమీ తెలియకుండా సీట్లను ధారబోసి పార్టీలో రెబల్స్‌ను పెంచుకోవడమెందుకని అంటున్నారు. మొత్తానికి తెలుగు తమ్ముళ్లలో అయితే మార్పు వస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..