మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు (జనవరి 19)ను పురస్కరించుకుని.. ఆయన భార్య లావణ్య త్రిపాఠి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రేమ జంట గత సంవత్సరం ఫ్యామిలీ సభ్యులందరి సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ఇటలీ వేదికైంది. నవంబర్ 3న ఇటలీలోని టుస్కానీలో వరుణ్, లావణ్యల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. మెగా కోడలుగా మారిన లావణ్య త్రిపాఠి.. ఆ ఫ్యామిలీతో చక్కగా కలిసిపోయింది. అందుకు సాక్ష్యం ఈ మధ్య దర్శనమిస్తున్న ఫొటోలే.
రీసెంట్‌గా బెంగళూరులో జరిగిన మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో కూడా లావణ్య త్రిపాఠి అందరితో కలిసిపోయి కనిపించింది. మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా అతి తక్కువ సమయంలోనే ఆమె ఇలా కలిసిపోవడం.. ఆ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌కి కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. అందుకే మెగా ఫ్యాన్స్ కూడా ఆమెను వదినా అంటూ ఆప్యాయంగా పిలచుకుంటున్నారు. ఇక విషయంలోకి వస్తే.. జనవరి 19 వరుణ్ తేజ్ పుట్టినరోజు. పెళ్లి తర్వాత వరుణ్‌కి మొదటి పుట్టినరోజు కావడంతో.. లావణ్య ఎలా శుభాకాంక్షలు చెబుతుందా? అని అంతా వేచి చూస్తున్న తరుణంలో.. వరుణ్‌లో తనకి నచ్చిన విషయం ఏమిటో చెబుతూ.. లావణ్య చెప్పిన బర్త్‌డే శుభాకాంక్షల పోస్ట్ మెగా ఫ్యాన్స్‌కు యమా నచ్చేసింది.
పుట్టినరోజు శుభాకాంక్షలు వరుణ్. నాకు తెలిసి.. నేను కలుసుకున్న వ్యక్తులలో అత్యంత అద్భుతమైన వ్యక్తి మీరు. ఇతరులను ప్రేమించే గుణం, వారి పట్ట చూపించే శ్రద్ధ నిజంగా స్ఫూర్తిదాయకం. మీలోని ఈ లక్షణమే నాకు ఎంతో నచ్చింది అని తెలుపుతూ.. కొన్ని బ్యూటీఫుల్ అండ్ రొమాంటిక్ ఫొటోలను లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆమె పోస్ట్ చూసిన వారంతా.. మా లవ్స్‌కి లవ్ అయిన వరుణ్ తేజ్‌కి శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలాగే నిండు నూరేళ్ల సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామంటూ మెగా ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు.