ఇటీవల జరిగిన బిగ్‌బాస్ సీజన్ 7లో టాప్ 3 ప్లేస్‌ని సొంతం చేసుకున్న శివాజీ.. దాదాపు విన్నర్ అయినంతగా అందరి నుండి అటెన్షన్ పొందారు. బిగ్‌బాస్ చివరి డేస్‌లో ఆడపిల్లలపై ఆయన బిహేవియర్.. శివాజీని విన్నర్ కాకుండా చేసింది. అయితేనేం, బిగ్ బాస్ ఆయనకు చాలా మంచి పేరు తెచ్చిందనే చెప్పుకోవాలి. ఆయన మనస్థత్వం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ పరిచయం చేసింది. దీంతో శివాజీని శత్రువులుగా భావించే వారిలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. ఇక బిగ్ బాస్ ముచ్చట అలా ఉంటే.. రీసెంట్‌గా ఆయన నటించిన 90స్ అనే వెబ్ సిరీస్ ఒకటి ఈటీవీ విన్‌లో విడుదలై మంచి ఆదరణను పొందుతోంది. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయిన సందర్భంగా శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 90స్ గురించే కాకుండా.. ప్రస్తుత పాలిటిక్స్‌పై తన మైండ్ సెట్ ఏంటో, తన పయనం ఎటువైపో శివాజీ క్లారిటీ ఇచ్చాడు.
శివాజీ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఇంత వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో భాగం కాలేదు. నేను అప్పుడు పోరాటం చేసింది ప్రత్యేక హోదా కోసం మాత్రమే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, పొలిటికల్ లీడర్లు కలిసే ఉంటున్నారు. రాష్ట్రం విడిపోయినా.. అంతా కలిసే ఉండటం చూసి సంతోషంగా అనిపించింది. అందుకే చెబుతున్నా.. ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరం. నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతా. నాలాంటి వారు రాజకీయాలకు పనికిరారు. ప్రస్తుతం పాలిటిక్స్‌కు, నాకు సంబంధం లేదు. నటననే కొనసాగిస్తా.
అలా అని కామ్‌గా ఉంటానని అనుకుంటున్నారేమో.. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నా పాత్రను నేను పోషిస్తా. వారి గొంతుకనవుతా. ఇక ఎవరైనా నన్ను ఒక పార్టీకి ఆపాదిస్తే మాత్రం.. కచ్చితంగా అదే పార్టీలో చేరి వారి పనిపడతా. కాబట్టి నా జోలికి రావద్దు. నా పని నన్ను చేసుకోనీయండి. నేనెప్పుడూ నిజాలే మాట్లాడతా. అందుకే చెబుతున్నా.. నేను రాజకీయాలకు పనికిరాను. నాపై రాజకీయకోణంలో రాతలు, ఆలోచనలు మానుకోండి.. అని సీరియస్‌గా చెప్పుకొచ్చాడు.