టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద గండమే పొంచి ఉంది. అన్నీ పాజిటివ్స్ కనిపిస్తున్నా కూడా ఇబ్బందికర పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. దాన్ని గట్టెక్కారో టీడీపీకి తిరుగులేదనే చెప్పాలి. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. ఇక వైసీపీ నుంచి జగన్‌తో విభేదించిన వారు.. ఆశించిన స్థానంలో సీటు దక్కని వారు.. అసలు ఎక్కడా సీటు దక్కనివారు.. ఇలా చాలా మంది నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కితే మంచిదే కదా.. ప్రాబ్లమ్ ఏముంది అంటారా? ఇక్కడే ఉంది అసలు చిక్కంతా. టీడీపీలో నాయకులకు కొదువ లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి అంటిపెట్టుకున్న సీనియర్స్ ఉన్నారు.
సీట్లను సర్దలేక నానా తంటాలు..
అలాగే ఆ తర్వాత జాయిన్ అయిన నేతలూ ఉన్నారు. జనసేన పొత్తులో భాగంగా కొన్ని సీట్లు ఆ పార్టీకి వెళ్లిపోతాయి. ఇక మిగిలిన స్థానాల్లో టీడీపీ నేతలంతా సర్దుకోవాలనుకుంటే పొరపాటే.. ఒకవేళ బీజేపీ కూడా పొత్తులో కలిసిందో దానికి కొన్ని స్థానాలివ్వాలి. ఇక ఇవన్నీ పోను కొత్తగా పార్టీలో చేరే వారికి తగు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడు టీడీపీకి మిగిలేది కేవలం కొన్ని స్థానాలే. సింగిల్‌గా బరిలోకి దిగుతున్న వైసీపీయే సీట్లను సర్దలేక నానా తంటాలు పడుతోంది. టీడీపీ అంతకు రెట్టింపు తంటాలు పడాలి. పార్టీ అధికారంలో లేకున్నా సరే.. పార్టీ కోసం పాటుపడిన నేతలకు నిరుత్సాహం కల్పించకూడదు.
ఏ మాత్రం ఛాన్స్ దొరికినా..
తమ పార్టీ నుంచి నేతలెవరూ జంప్ కాకుండా చూసుకోవాలి. ఇదంతా టీడీపీకి తలకు మించిన భారమే. విపక్ష పార్టీ అసమ్మతి నేతల కోసం త్యాగం చేసేందుకు ఎవరూ సిద్ధపడరు. త్యాగం చేయమనడం కూడా అది టీడీపీకి తగదు. ఈ తరుణంలో టీడీపీ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కానీ ఈ వ్యవహారాన్నంతటినీ వైసీపీ అనుకూలంగా మలచుకుంటుంది. వైసీపీ నుంచి చాలా మంది నేతలు టీడీపీ కండువా కప్పుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. బొప్పన భవకుమార్, సీతంరాజు సుధాకర్ వంటి వారు ఏ క్షణమైనా సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మరికొందరు వైసీపీ కీలక నేతలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. వీరంతా సైకిల్ ఎక్కితే టీడీపీ పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది.