తెలంగాణలో టీడీపీ నష్టపోతోందా? అప్పట్లో పోటీ చేయడం.. ఇప్పుడు పోటీ చేయకపోవడంతో తన గొయ్యి తనే తవ్వుకుంటోందా? నిజానికి తెలంగాణలో టీడీపీకి కేడర్ బాగానే ఉంది. సెటిలర్స్ అంతా కూడా టీడీపీకి బాసటగానే ఉంటారు. అంతేకాకుండా సామాన్య ప్రజానీకం కూడా టీడీపీకి అండగా ఉంటుంది. అలాంటి టీడీపీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇదే బీఆర్ఎస్‌కు అస్త్రంగా మారింది. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి బీఆర్ఎస్ లబ్ది పొందింది. దీంతో టీడీపీ ఒకరకంగా తన ఉనికిని కోల్పోయినంత పనైంది. ఇక ఇప్పుడు మరోసారి తెలంగాణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది.
కేటీఆర్‌కు చుక్కలు చూపించారు..
ఈ ఎన్నికల నాటికి తిరిగి టీడీపీ పుంజుకుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు జైలు పాలైన తర్వాత తెలంగాణ టీడీపీ నేతలు మరింత యాక్టివ్ అయ్యారు. ఏపీలో కంటే కూడా తెలంగాణలోనే ఆందోళనలు బీభత్సంగా జరిగాయి. దాదాపు ఒకరోజు పాటు తెలంగాణలో మెట్రో రైలు సేవలకు ఆటంకం కలిగించారు. తెలంగాణలో చంద్రబాబు గురించి ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదన్న మంత్రి కేటీఆర్‌కు చుక్కలు చూపించి దిగి వచ్చేలా చేశారు. ఇలాంటి తరుణంలో ఏం ఆలోచించిందో ఏమో కానీ.. తెలంగాణలో పోటీ చేయబోమని టీడీపీ స్ఫష్టం చేసింది. ఈ నిర్ణయమే తెలంగాణలో పార్టీని మరోసారి ప్రశ్నార్థకంగా మార్చింది.
పార్టీకి మనుగడ ఉంటుందా?
టీటీడీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తెలంగాణలో పోటీ చేయకూడదని పార్టీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఇక తాను పార్టీలో ఉండి కేడర్‌కు న్యాయం చేయలేనని భావించి రాజీనామా చేశారు. ఇక టీడీపీ మరొక అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిందే. అసలు పోటీయే చేయలేని పార్టీకి రాష్ట్రంలో మనుగడ ఏముంటుంది? అలాంటి పార్టీలో కార్యకర్తలు మాత్రం ఎలా ఉంటారు? ఎవరి దిక్కు వారు చూసుకుంటారు కదా? ఇప్పుడు తెలంగాణలో నాయకులతో పాటు కేడర్ అదే పని చేస్తుంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఓడిన తర్వాతే టీటీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా చేశారు. క్రమక్రమంగా అగ్ర నేతలంతా పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడేదో నూతన నాయకత్వం దొరికిందనుకుంటే అది కూడా దూరమైంది. ఇక చూడాలి తెలంగాణలో టీడీపీ మనుగడ సాగిస్తుందా? లేదా? అనేది.