విజయ్ ఆంటోనీ మరోసారి మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ను వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన రోషగాడు, జ్వాల వంటి చిరంజీవి టైటిల్స్‌ని వాడుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇంద్రసేన అనే టైటిల్‌తో కూడా విజయ్ ఆంటోని ఆ మధ్య ఓ మూవీ చేశారు. ఇంద్ర అనే టైటిల్‌లో మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలియంది కాదు. ఇప్పుడు మరోమారు చిరు మూవీ టైటిల్‌ని విజయ్ ఆంటోని వాడుకుంటున్నారు. ఏ మూవీ టైటిల్ అనుకుంటున్నారా? చిరంజీవికి రీ ఎంట్రీలో మెమరబుల్ హిట్‌ని ఇచ్చిన హిట్లర్ టైటిల్‌ని ఇప్పుడు విజయ్ వాడుతున్నారు.
విజయ్ ఆంటోనీ హీరోగా.. ఆయనతో ఇంతకు ముందు విజయ్ రాఘవన్ అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి హిట్లర్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఈ సినిమాని యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోనీ సరసన రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. ట్రైన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కొన్నట్లుగా ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఇదే ట్రైన్‌లో హీరోయిన్ రియా సుమన్ హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తోన్న గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. విజయ్ ఆంటోనీ సరికొత్త లుక్‌లో కనిపించడంతో పాటు.. చివరలో జోకర్ గెటప్‌లో కనిపించి.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఈ మోషన్ పోస్టర్ సినిమాపై మంచి బజ్‌ని ఏర్పడేలా చేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మూవీని త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.