తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేందుకు పెద్దగా సమయం లేదు. దాదాపు ఈ నెల పూర్తైనట్టే. ఇక అక్టోబర్‌లో ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావడం ఖాయంగానే కనిపిస్తోంది. నోటిఫికేషన్ వచ్చే.. కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. ఏం చేసినా ఈ లోపే చేయాలి. దీనికోసం పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా జనాల్ని ఎలా ఆకట్టుకోవాలనే విషయమై సమాలోచనలు చేస్తున్నారట. గతంలో మాదిరిగా తెలంగాణలో పరిస్థితులు లేవు. పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయంతో వచ్చిన జోష్‌తో తెలంగాణ ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు కేసీఆర్ కొత్త పథకాలను రూపొందిస్తున్నారట. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారట. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలను ఆకర్షించేలా కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారని టాక్. సమిష్టి లబ్ది గురించి ఆలోచించే రోజులు పోయాయి. వ్యక్తిగత లబ్దే ఇప్పుడు ప్రధానం. దీనిని దృష్టిలో పెట్టుకుని నేడు పథకాలను రూపొందించేందుకు గానూ మంత్రివర్గ భేటీ జరగనుంది. నిజానికి ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు జనంలోకి బాగా వెళ్లాయి. దీంతో బీఆర్ఎస్‌కు ఇవి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ పథకాలతోనే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు కర్ణాటకలో ప్రకటించిన పథకాలనే ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దాదాపు ప్రతి ఒక్కరినీ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ పథకాలను ప్రకటించింది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థికసాయం రూ.500 కే వంటగ్యాస్, రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు, చేయూత వంటి పథకాలతో ముఖ్యంగా మధ్యతరగతి, నిమ్న వర్గాల ప్రజానీకాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంతకు మించిన పథకాలతో జనంలోకి వెళితేనే వర్కవుట్ అవుతుంది. దీనిపై గులాబీ బాస్ బాగా కసరత్తు చేస్తున్నారట. రాబోయే ఎన్నికల ప్రచారంలో పథకాలే హైలైట్ కానున్నాయి. ఇక అన్ని పార్టీలు పథకాలకే పెద్ద ఓటు కానీ జనం ఎవరిని నమ్ముతారో చూడాలి.