సినీ ఇండస్ట్రీలో దర్శకుడు, నిర్మాతలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో.. వారిద్దరికీ నటీనటులు ఎలాంటి విలువ ఇస్తారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు కాదండోయ్.. ఇప్పట్లోని కొందరు దర్శక నిర్మాతలు ఒకరినొకరు తిట్టేసుకుంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేసేస్తున్నారు. ఒకప్పుడు దర్శకుడు ఎలా ఉండాలి అన్నా.. నిర్మాత అనే వ్యక్తి ఎలా ఉండాలన్నా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు గుర్తొచ్చేవారు. ఎందుకంటే ఆయనకుండే రేంజ్ .. క్రేజ్, క్యాలిబర్ వేరు. ఇప్పట్లో అలాంటి వారు లేరు.. ఒకవేళ ఉన్నా నూటికో.. కోటికో ఒకరున్నారంతే. అయితే.. ఇటీవల ఓ ప్రముఖ దిన పత్రికకు టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, వెయ్యికి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన అలీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత అంటే ఎవరు..? దర్శకుడు అంటే ఎవరనేదానిపై తన మనసులోని మాటను బయటపెట్టారు.
అలీ మాటల్లోనే..
‘నిర్మాత అంటే దేవుడితో సమానం. ఆ దేవుడికి పూజారి లాంటోడు దర్శకుడు. మనమంతా ఆ దేవుడికి భక్తులం. పూజారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాం. ఆలయానికి భక్తులుగా వెళ్లి భక్తులుగానే బయటికి రావాలి. అందుకే దర్శకుడు, నిర్మాతలను అందరూ గౌరవించాలి. అప్పుడే మన సినీ కెరీర్‌లో మంచిగా ఉంటాం.. ఉన్నతస్థాయికి ఎదుగుతాం. ప్రతి నిర్మాత నటీనటులకు హోటల్స్, ఒక ప్రాంతం నుంచి మరొక చోటికి రావడానికి ఫ్లైట్, ట్రైన్ టికెట్లు, డబ్బులు, పేరు, కారు కూడా ఇస్తున్నాడు. మరీ ముఖ్యంగా షూటింగ్‌లో ప్రతిరోజూ కొత్త బట్టలే వేసుకోవడానికి ఇస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ప్రతిరోజూ మనకు పండుగే అన్న మాట. అందుకే.. నిర్మాత దేవుడు.. దర్శకుడు పూజారి’ అని తాను అభిప్రాయపడతానని అలీ ఇంటర్వ్యూవేదికగా మనసులోని మాటను బయటపెట్టారు. నిజమే.. అలీ చెప్పింది వందకు వంద శాతం కానీ.. ఇదంతా ఒకప్పుడు కానీ ఇప్పట్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యిందన్న విషయం అందరికీ తెలిసిందే.